ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నిర్మలమ్మ | |
జన్మ నామం | రాజమణి |
జననం | బందరు ఆంధ్రప్రదేశ్ భారతదేశం | 1920 జూలై 18
మరణం | 2009 ఫిబ్రవరి 19 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 88)
ప్రముఖ పాత్రలు | స్నేహం కోసం, మాయలోడు |
సినీనటి నిర్మలమ్మ (1920, జూలై 18 - 2009, ఫిబ్రవరి 19) తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.
నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. 1920, జూలై 18న గంగయ్య, కోటమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు.
నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో రంగస్థల నటుడు జీవీ కృష్ణారావుతో వివాహం జరిగింది. నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డ కృష్ణారావు సాంప్రదాయం ప్రకారం, పెళ్ళిచూపుల కోసం నిర్మలమ్మ ఇంటివద్దకు వెళ్ళాడు. తాను పెళ్లి అయ్యాక కూడా నటిస్తానని, నటనకు అడ్డు చెప్పకుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానని కండీషన్ పెట్టింది. అందుకు కృష్ణరావు అంగీకరించడంతో వారిద్దరికీ వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.[1]
చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. వివాహం జరిగిన ఉదయం అనే నాటక సంస్థను ఏర్పాటుచేసి, పలు నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. కొందరు సినీ ప్రముఖులు సినిమాలు చేయవచ్చు కదా అని కోరడంతో భార్యభర్తలు సినిమాల వైపు అడుగుపెట్టారు.1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. కొన్నాళ్ల తరువాత 1961లో కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది. ఆ తరువాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి. సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.
భార్యభర్తలు చిత్రంలో అక్కినేని తల్లిదండ్రులుగా గుమ్మడి - నిర్మలమ్మ కలిసి నటించారు. ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు 20 సినిమాల వరకు జంటగా నటించారు. మనుషులు మారాలిలో శోభన్‌బాబుకు తల్లి పాత్ర పోషించగా.. అక్కడి నుంచి తల్లి, పిన్ని పాత్రలు పోషిస్తుండగా.. ఆ క్యారెక్టర్లు ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు స్వాగతంలో నటించడానికి ఒప్పించాడు.[2]
60 ఏళ్ళపాటు తెలుగు తెరపై పలు పాత్రలను పోషించిన నిర్మలమ్మ, బామ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. కాకినాడలో కరువు రోజులు అనే నాటకంలో నటిస్తుండగా నటుడు పృథ్వీరాజ్‌కపూర్ నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి.
నిర్మలమ్మ మరణించడానికి కొంతకాలంగా ముందు అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి హైదరాబాదులో 2009, ఫిబ్రవరి 19 న మృతిచెందారు.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)