నెదర్లాండ్స్‌లో హిందూ మతం మైనారిటీ మతం, 2019లో డచ్ జనాభాలో 1.0% మంది హిందువులున్నారు. [1] యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ తర్వాత, ఐరోపాలోని మూడవ అతిపెద్ద హిందూ సమాజం నెదర్లాండ్స్‌లో నివసిస్తోంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో 1,50,000 - 2,00,000 మధ్య హిందువులు నివసిస్తున్నారు, వీరిలో అత్యధికులు దక్షిణ అమెరికాలోని మాజీ డచ్ వలస రాజ్యమైన సూరినామ్ నుండి వలస వచ్చారు. [2] [3] భారతదేశం, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూ వలసదారులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. [4] అలాగే హిందూమతంపై ఆధారపడిన కొత్త మత ఉద్యమాలను అనుసరించే పాశ్చాత్య అనుచరులు కూడా కొద్దిమంది ఉన్నారు.
నెదర్లాండ్స్‌లో గణనీయమైన సంఖ్యలో హిందువులు ఉండటం సాపేక్షికంగా ఆధునిక పరిణామం; 1960లో, దేశంలో కేవలం పది భారతీయ కుటుంబాలు మాత్రమే ఉన్నాయని అంచనా వేసారు. [5] బహుశా వాళ్ళే దాదాపుగా మొత్తం హిందూ జనాభా. 1971లో, సెంట్రల్ బ్యూరో వూర్ డి శ్టాటిస్టియెక్ (CBS) దాదాపు 3,000 మంది హిందువులను నమోదు చేసింది. [6] అయితే 1970లలో ఈ సంఖ్య బాగా పెరిగింది. ఇది ఇండో-సూరినామీస్ ("హిందుస్తానీలు") ల వలస కారణంగా జరిగింది. వీరి కుటుంబాలు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఒప్పంద కార్మికులుగా సూరినామ్‌కు వలస వెళ్ళారు. 1975లో సూరినామ్ స్వాతంత్ర్యం పొందడంతో, కొత్త దేశంలో వారి భవిష్యత్తు పట్ల కలిగిన ఆందోళన కారణంగా హిందుస్థానీ జనాభాలో దాదాపు మూడోవంతు మంది సూరినామ్‌ను విడిచిపెట్టి నెదర్లాండ్స్‌కు వలసవెళ్లారు. [5] ఇండో-సూరినామీస్ ప్రధానంగా హిందువులు. ఫలితంగా నెదర్లాండ్స్‌లో హిందూ జనాభా ఒక్క దశాబ్దంలో పదిరెట్లు పెరిగి 1980లో 34,000కి చేరుకుంది, 1990లో 61,000కు, 2000లో 91,000 కూ చేరుకుంది [6]
2010-19 నుండి హిందూ జనాభాలో మార్పులు. [7] [1]
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2010 | 0.6% | - |
2011 | 0.6% | - |
2012 | 0.6% | - |
2013 | 0.7% | +0.1% |
2014 | 0.6% | -0.1% |
2015 | 0.6% | - |
2019 | 1.0% | +0.4% |
సూరినామ్ నుండి వలస వచ్చిన వారే నెదర్లాండ్స్‌లోని అతిపెద్ద హిందువుల సమూహం. అయితే నేరుగా భారతదేశం శ్రీలంక నుండి వచ్చిన వారు కూడా గణనీయం గానే ఉన్నారు. [8] హిందువుల సంఖ్య అంచనా 1,00,000 నుండి 200,000 పైచిలుకు వరకూ ఉండవచ్చు. [9] దాదాపు 1,00,000 మంది హిందువులు ఉన్నారని 1997 అధ్యయనం చెప్పింది. [8] 2006 లో CBS వేసిన అంచనా ఈ సంఖ్యతో ఏకీభవించింది. 83,000 మంది సూరినామ్ మూలాలు, 11,000 భారతీయ మూలాలు, 5,000 ఇతర నాన్-యూరోపియన్లు, 1,000 మంది యూరోపియన్లు ఇందులో ఉన్నారు.[10] అయితే, హిందూ కౌన్సిల్ ఆఫ్ నెదర్లాండ్స్, దేశంలో సుమారు 2,15,000 మంది హిందువులున్నట్లు అంచనా వేసింది. అందులో 1,60,000 మంది సూరినామ్ నుండి, 15,000 మంది భారత ఉపఖండం నుండి, 40,000 మంది ఇతర ప్రాంతాల నుండీ వచ్చారు. [11] నెదర్లాండ్స్‌లో 2,00,000 మంది భారతీయ మూలాలు ఉన్నవారు 15,000 మంది ప్రవాస భారతీయులూ ఉన్నారని భారతీయ డయాస్పోరాపై వేసిన ఉన్నత స్థాయి కమిటీ చెప్పింది. ఈ రెండు సంఖ్యలూ చాలా దగ్గరగా ఉన్నాయి. [12] ఈ రెండు అంచనాలకూ ఉమ్మడి మూలం ఉందా లేక అవి భారతీయ జాతి నేపథ్యం ఉన్న వ్యక్తులందరినీ హిందువులుగా భావిస్తున్నాయా అనేది స్పష్టంగా లేదు.
2003 అధ్యయనంలో మొత్తం ఇండో-సూరినామీస్ జనాభా - భారతీయ సంతతికి చెందిన సూరినామీలు - 1,60,000 అని చెప్పింది.` వీరిలో 80%, అంటే దాదాపు 130,000 మంది, హిందువులు. [11] 2003 అధ్యయనం ప్రకారం, అతిపెద్ద ప్రాంతీయ జనాభా దక్షిణ హాలండ్ (60,000), ఎక్కువగా ది హేగ్ చుట్టూరా ఉన్నారు. నార్త్ హాలండ్ లో 31,200 మంది ఉన్నారు; ఈ రెండు ప్రావిన్సుల్లోనే మొత్తం హిందువుల్లో 70% పైగా ఉన్నారు. [11] దాదాపు యాభై దేవాలయాలు ఉన్నాయని, దాదాపు 250 మంది పూజారులు ఉన్నారనీ, వీరిలో సగం మంది పూర్తి సమయం పనిచేసేవారనీ అదే అధ్యయనం సూచించింది. [13]
ప్రావిన్సుల వారీగా దేశం లోని హిందువుల శాతం: [14]
ప్రాంతం | హిందువుల శాతం |
---|---|
గ్రోనింగెన్ | 0.3% |
ఫ్రైస్‌ల్యాండ్ | 0.1% |
డ్రెంతే | 0.0% |
ఓవరిస్సెల్ | 0.3% |
ఫ్లేవోలాండ్ | 0.7% |
గెల్డర్‌ల్యాండ్ | 0.1% |
యుట్రెక్ట్ | 0.5% |
ఉత్తర హాలండ్ | 0.6% |
దక్షిణ హాలండ్ | 1.8% |
జీలాండ్ | 0.2% |
ఉత్తర బ్రబంట్ | 0.3% |
లింబర్గ్ | 0.1% |
హిందూ జనాభాలో దాదాపు 80% మంది సనాతన ధర్మానికి చెందినవారు కాగా, మిగిలిన 20% మంది ఆర్యసమాజ్ ఉద్యమానికి చెందినవారు. [10] హరే కృష్ణ లేదా భావాతీత ధ్యానం వంటి "గురు ఉద్యమాలకు" చెందిన ఇతర సమూహాలు ఉన్నాయి. హిందూమతం లోని కొన్ని అంశాలను పాటించే కొత్తతరం విశ్వాసాలను అనుసరించేవారు కూడా కొందరున్నారు. [10]
సింట్ మార్టెన్ జనాభాలో 5.2% మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [15] హిందువులకు సింట్ మార్టెన్ హిందూ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి, మూడవ ఆదివారాల్లో సన్ బిల్డింగ్‌లో సాధారణ సత్సంగాలను (ప్రార్థనలు) నిర్వహిస్తుంది.
కురాకావ్‌లో హిందూ మతం మైనారిటీ మతం. రాజధాని విల్లెమ్‌స్టాడ్‌లో ఒక పెద్ద హిందూ దేవాలయం ఉంది.
నెదర్లాండ్స్‌లో ఇప్పటికీ మైనారిటీ మతంగా పరిగణించబడుతున్నప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా వంటి ఇతర పాశ్చాత్య దేశాల కంటే హిందూమతం అక్కడ చాలా మెరుగ్గా ఉంది.
దేశంలో ఉన్న ఐదు హిందూ పాఠశాలలకు హిందూ సమాజం నుండి నిధులు అందుతున్నాయి, వీటిని జాతీయ పాఠశాలలుగా పరిగణిస్తారు. పాఠశాలలు ఇతర పాఠశాలల మాదిరిగానే పాఠ్యాంశాలను అనుసరిస్తాయి. పాఠ్యాంశాల్లో హిందీ , రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల బోధన, హిందూ పండుగలను జరుపుకోవడం కూడా ఉన్నాయి.
సమాజంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, కొన్నిసార్లు తమకు ఎదురయ్యే దురాగతాలను ఎత్తిచూపడానికీ హిందువులు 'అగ్ని' అనే స్వంత మానవ హక్కుల సమూహాన్ని కూడా స్థాపించారు. తమ స్వంత రేడియో ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేయడంతో పాటు, హిందూ సమాజం జాతీయ టెలివిజన్‌లో ఒక 30 నిమిషాల వారపు కార్యక్రమం 'ఓం'ను కూడా ప్రసారం చేస్తుంది. ప్రజలకు సహాయం చేయడానికి వారి స్వంత స్వచ్ఛంద సంస్థ 'సేవా నెట్‌వర్క్' కూడా ఉంది. [3] [2]
సరస్వతీ ఆర్ట్, [16] హిందోరామా వంటి అనేక సాంస్కృతిక వేదికలు, సంఘాలు హిందూ సంస్కృతిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. [17]
ఫ్రీక్ ఎల్. బక్కర్, నెదర్లాండ్స్‌లోని హిందువులు, బెర్లిన్: LIT వెర్లాగ్ 2018.