భారత రాజ్యాంగ రచన కోసం 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచనా కమిటీని ఇచ్చిన నివేదికను నెహ్రూ రిపోర్టు అంటారు.[1][2] ఈ నివేదికలో భారతదేశంలో ప్రతిపాదిత నూతన రాజ్యాంగ హోదా గురించి వివరించడం జరిగింది. అన్ని పార్టీల కమిటీ సదస్సుకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించగా, జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీలో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. మోతిలాల్ నెహ్రూ, అలీ ఇమామ్, తేజ్ బహదూర్ సప్రూ, మాధవ్ శ్రీహరి అనీ, మంగల్ సింగ్, షుయాబ్ ఖురేషి, సుభాష్ చంద్రబోస్, జి.ఆర్. ప్రధాన్ మొదలైనవారు తుది నివేదికపై సంతకం చేశారు.
1927 నవంబరులో బ్రిటన్ ఎగువసభలో జరిగిన చర్చలో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ మాట్లాడుతూ ‘అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా?’ అని సవాలు విసిరాడు. దాన్ని స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ బొంబాయి వేదికగా 1928, మే 19న ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, రాజ్యాంగ రచన కోసం 1928 ఆగస్టు 10న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎనమిది మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు.[3]