న్యూజిలాండ్‌లో హిందూమతం రెండవ అతిపెద్ద మతం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మతాలలో ఇది ఒకటి. 2018 జనాభా లెక్కల ప్రకారం న్యూజిలాండ్ జనాభాలో హిందువులు 2.63% మంది - 1,23,534 మంది - ఉన్నారు. [1]
భారతదేశం నలుమూలల నుండి హిందువులు నేటికీ వలసలు కొనసాగిస్తున్నారు. న్యూజీలాండ్ లోని అతిపెద్ద భారతీయ జాతి ఉప సమూహం గుజరాతీలు. తరువాతి హిందూ వలసదారులలో చారిత్రకంగా యూరోపియన్ వలస పాలనలో ఉన్న ఫిజీ వంటి దేశాల నుండి వచ్చిన భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. నేడు అన్ని ప్రధాన న్యూజిలాండ్ నగరాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి.
1836 లో మిషనరీ విలియం కోలెన్సో, వాంగరే వద్ద మావోరీ మహిళలు కొందరు ఒక విరిగిన కంచు గంటలో బంగాళదుంపలు ఉడకపెట్టడం చూసాడు. దాని అంచు చుట్టూ ఉన్న శాసనంలో చాలా పాత తమిళ లిపిలో 'ముహాయిదీన్ బక్ష్ ఓడ యొక్క గంట' అని రాసి ఉంది. ఈ ఆవిష్కరణతో తమిళం మాట్లాడే హిందువులు వందల సంవత్సరాల క్రితమే న్యూజిలాండ్‌ను సందర్శించి ఉండవచ్చనే ఊహాగానాలు వచ్చాయి.
అయితే, న్యూజిలాండ్‌లో హిందువుల మొదటి స్థావరం 19వ శతాబ్దంలో సిపాయిల (భారత సైనికులు) రాక నాటిది. పంజాబ్, గుజరాత్‌ల నుండి 1890లలో మొదటి సమాజాలు వచ్చాయి. 1980ల వరకు వచ్చిన హిందూ వలసదారులు దాదాపుగా అందరూ గుజరాత్ నుండి వచ్చినవారే. తరువాత భారతదేశం నలుమూలల నుండీ, శ్రీలంక, మలేషియా, దక్షిణాఫ్రికాతో సహా ఇతర ప్రాంతాల నుండీ వచ్చారు. [2]
ఇమ్మిగ్రేషన్ విధానాల సడలింపు, పెరిగిన వలసలు: 1987-2001
1987 నాటి వలస చట్టం ఫలితంగా పెరిగిన వలసల కారణంగా హిందువుల సంఖ్య 17,000 దాటిందని 1991 జనాభా లెక్కల్లో తేలింది. [3][4]భారతదేశపు ఆర్థిక సరళీకరణ ఆ సంవత్సరంలోనే మొదలైంది. దీనితో జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆ తరువాత ఎక్కువ మంది వలసదారులు రావడానికి వీలు కలిగించింది. వలస చట్టాలను సడలించడం వలన హిందువుల సంఖ్య 1991లో 18,000 నుండి మొదటిసారిగా 25,000కి పెరిగింది. 1987 చట్టపు విజయమే దీనికి కారణం.
2001 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల జనాభా దాదాపు 40,000 వద్ద ఉంది, అంటే 1991 జనాభా లెక్కల నుండి 10 సంవత్సరాలలో హిందువుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2006 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 64.557. 2001 నాటి జనాభా గణనతో పోలిస్తే ఇది దాదాపు 62% పెరుగుదల. [5] 2006, 2013 జనగణనల మధ్య సంవత్సరాలలో న్యూజిలాండ్‌లో హిందువుల సంఖ్య పెరుగుదల వివిధ సంఘటనల కారణంగా మందగించింది. భారతీయ ఆస్ట్రేలియన్లపై పెరిగిన హింస (2007-2010), 2011 క్రైస్ట్‌చర్చ్ భూకంపం లు హిందువుల పెరుగుదల క్షీణించడానికి ప్రధాన కారణాలు. అదే సమయంలో జనగణను 2011 నుండి 2013 కు జరపడానికి కూడా ఆ భూకంపమే కారణం. [6] భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన వలసదారుల సంఖ్య పెరగడంతో దీర్ఘకాలిక వలసల మందగమనం పాక్షికంగా ఆగింది. ఆర్థిక మాంద్యం సమయంలో, తక్కువ ఖర్చులు, మెరుగైన ఆర్థిక దృక్పథం కారణంగా వారి సంఖ్య వేగంగా పెరిగింది. [7][8] ఇటీవల నిర్వహించిన 2013 జనాభా లెక్కల ప్రకారం హిందూ జనాభా 90,018 మందితో మొత్తం జనాభాలో 2% కంటే కొంచెం ఎక్కువగా ఉంది. పైన పేర్కొన్న సంఘటనల ఫలితంగా వలసలు మందగించినప్పటికీ మొత్తం న్యూజిలాండ్ జనాభాలో హిందూమతస్తుల వాటా 0.5% పెరిగింది.
న్యూజిలాండ్‌లోని హిందువులలో ఎక్కువ మంది ఆసియన్లు. ఆ తరువాత యూరోపియన్లు, పసిఫిక్ ద్వీపవాసులు ఉన్నారు. 3,567 మంది యూరోపియన్, 1,857 పసిఫిక్ ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. మావోరీలలో కూడా కొద్ది మంది హిందూమతాన్ని ఆచరిస్తారు. 858 మంది మావోరీలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు
మొదటి హిందూ సంస్థ - హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్ (HCNZ) 1990ల మధ్యలో ఏర్పడింది. ఇది ప్రపంచ హిందూ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్‌కు అనుబంధంగా ఉంది. HCNZ 2007 నుండి వార్షిక న్యూజిలాండ్ హిందూ సమావేశాలను నిర్వహిస్తోంది. ఇది హిందూ హెరిటేజ్ సెంటర్, హిందూ సోషల్ సర్వీస్ ఫౌండేషన్, హిందూ ఎల్డర్స్ ఫౌండేషన్, హిందూ యూత్ న్యూజిలాండ్‌లను కూడా స్థాపించింది. యువతకు, కుటుంబాలకూ శిబిరాలను నిర్వహిస్తోంది. 2010లో HCNZ న్యూజిలాండ్‌లోని హిందూ సమూహాలకు ప్రతినిధి సంస్థ అయిన హిందూ సంస్థలు, దేవాలయాలు, సంఘాలను (HOTA) ప్రారంభించింది. [2]
2019లో వెల్లింగ్‌టన్ లోని విక్టోరియా యూనివర్శిటీ చేసిన సర్వే ప్రకారం, నాస్తికులు, ప్రొటెస్టంట్లు, ముస్లింలు, క్యాథలిక్‌లు, ఎవాంజెలికల్‌ల కంటే హిందువులు నమ్మదగినవారని న్యూజిలాండ్ వాసులు భావిస్తున్నట్లు తేలింది. దాదాపు 28.3 శాతం మంది న్యూజిలాండ్ వాసులు హిందువులపై పూర్తి లేదా ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. అయితే 19.9 శాతం మందికి హిందువుపై అంతగా నమ్మకం లేదు. [13]
న్యూజిలాండ్‌లో యూదులకు, హిందువులకు అత్యధిక విద్యా స్థాయి ఉంది. [14]
హిందూ, మావోరీ ప్రజల ఆచారాలు, భాషల మధ్య సారూప్యతలు ఉన్నాయి. మావోరీ భాషకు సమానమైన కనీసం 185 సంస్కృత, ఇతర భారతీయ భాషా పదాలు ఉన్నాయి. కొన్ని హిందూ సంఘాలకు మారే ను పోలిన భవనాలున్నాయి. ఇక్కడ ప్రజలు సమావేశాలు నిర్వహిస్తారు, అక్కడే నిద్ర చేస్తారు. మావోరీలు కూడా హిందువుల లాగే కొత్త భవనాలలోకి గృహప్రవేశాలు చేస్తారు. సాధారణంగా సూర్యోదయానికి ముందు ఇది చేస్తారు. [15][16]
న్యూలాండ్స్‌లోని వెల్లింగ్‌టన్ [20] లో ఉన్న కురించి కుమరన్ ఆలయం. ఇది న్యూజిలాండ్‌లో స్థాపించబడిన మొదటి దక్షిణ భారత శైలి హిందూ దేవాలయం. ఇది పురాతన ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది.
వెల్లింగ్టన్ ఇండియన్ అసోసియేషన్ ఉత్తర భారత శైలిలో ఆలయాన్ని నిర్వహిస్తోంది. [21]
వెల్లింగ్టన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం [22] వైనుయోమాటాలో ఉంది. [23] న్యూజిలాండ్‌కు చెందిన సనాతన ధర్మ పరిపాలన సేవా ట్రస్ట్, కమ్యూనిటీ మద్దతుతో 2018లో ఈ ఆలయాన్ని స్థాపించింది
సనాతన్ ధరమ్ మందిర్, తౌరంగ హిందూ సంఘం సభ్యులు నిర్మించారు. [24] ట్రస్ట్ దాదాపు 2150 చదరపు మీటర్ల భూమిని టౌరికో శివారులో సుమారు $400,000కి కొనుగోలు చేసింది. [25] 2012 లో ప్రారంభించినప్పటికీ, ఆలయం పని 2015 వరకు ప్రారంభం కాలేదు [26] ఆలయం మొదటి దశ 2015 మధ్యలో పూర్తయింది. [27]
క్రైస్ట్‌చర్చ్, సౌత్ ఐలాండ్‌లోని ఏకైక హిందూ దేవాలయం BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్. [28] ఈ మందిరం 2011లో "మహాపూజ" తర్వాత ప్రారంభించబడింది. [29] 2011 క్రైస్ట్‌చర్చ్ భూకంపం తర్వాత 12 నెలల పునర్నిర్మాణం తర్వాత ఈ ఆలయం ప్రారంభించబడింది. [30]
BAPS శ్రీ స్వామినారాయణ దేవాలయం, రోటోరువా యొక్క మొట్టమొదటి హిందూ దేవాలయం, 2012లో ప్రారంభించబడింది, ఇది న్యూజిలాండ్‌లోని నాల్గవ "BAPS" దేవాలయం. [31] ఇది మధ్య ఉత్తర ద్వీపంలోని ఏకైక హిందూ దేవాలయం. [32]
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ న్యూజిలాండ్‌లో ఉంది, ఆక్లాండ్, హామిల్టన్, వెల్లింగ్‌టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో దేవాలయాలను నడుపుతోంది. ఆక్లాండ్ ఆలయం నగరం వెలుపల, ప్రధాన మందిరంపై ఒక టవర్‌తో వేద శైలిలో నిర్మించబడింది.