పద్మా ఖన్నా | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1961–1996 |
జీవిత భాగస్వామి | జగదీష్ ఎల్. సిదానా (1986) |
పద్మా ఖన్నా, బీహార్కు చెందిన టివి-సినిమా నటి, నర్తకి, దర్శకురాలు. 1970-1980 మధ్యకాలంలో హిందీ, భోజ్‌పురి సినిమాలలో నటించింది. అమితాబ్ బచ్చన్‌తో సౌదాగర్ సినిమాలోనూ, రామానంద్ సాగర్ ఇతిహాస ధారావాహిక రామాయణం (1987-1988)లో రాణి కైకేయి పాత్రలోనూ నటించింది. ఎన్.టి. రామారావుతో కలిసి దేశోద్ధారకులు, రాజపుత్ర రహస్యం అనే రెండు తెలుగు సినిమాలలో కూడా నటించింది.
పద్మ ఖన్నా, బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించింది. తన 7 సంవత్సరాల వయస్సులో పండిట్ బిర్జు మహారాజ్ వద్ద కథక్ శిక్షణను తీసుకుంది.[1] నటీమణులు పద్మిని, వైజయంతిమాల సూచనల మేరకు బాలీవుడ్‌కు పరిచయమైంది.[2]
1962లో గంగా మైయ్యా తోహే పియారీ చదైబో అనే భోజ్‌పురి సినిమాతో నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 1970లో జానీ మేరా నామ్ సినిమాలో క్యాబరే డాన్సర్‌గా నటించడంతో గుర్తింపు వచ్చింది. లోఫర్, జాన్-ఎ-బహార్, పాకీజా వంటి సినిమాలలో డ్యాన్సర్‌గా నటించింది. 1980లలో, దూరదర్శన్‌లో ప్రసారమైన రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలో రాణి కైకేయి పాత్రను పోషించింది.
రామాయణ ఇతిహాసం ఆధారంగా 2008లో, భర్త జగదీష్ ఎల్. సిదానా దర్శకత్వంలో రూపొందిన నృత్య రూపకాన్ని న్యూయార్క్ లోని ఎవెరీ ఫిషర్ హాల్‌లో 64 మంది నటులు, నృత్యకారులతో కలిసి నటించింది.[1] 2004లో నహీర్ హుటల్ జయ అనే భోజ్‌పురి సినిమాకి దర్శకత్వం కూడా వహించింది.[3]
సినీ దర్శకుడు జగదీష్ ఎల్. సిదానాతో పద్మా ఖన్నా వివాహం జరిగింది.[1] ఇద్దరూ కలిసి 1990లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూజెర్సీ రాష్ట్రానికి వెళ్ళి, అక్కడ కథక్ అకాడమీని ప్రారంభించారు.[4][5]