పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి,లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. భారతదేశంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని బంగాళా ఖాతానికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది చెన్నై నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, యానాం ,లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల[2](PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ [3](PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. క్యాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూరవిద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు [4]
జె ఏ కె తరీన్ వైస్ చాన్సలర్గా ఉన్న కాలంలో యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా విశ్వవిద్యాలయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా ఆడవారికి, వికలాంగులకు ఉచిత హాస్టల్ సౌకర్యం, విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా,సిల్వర్ జూబిలీ క్యాంపస్, వికలాంగులకు వెసులుబాటు కల్పించే విధంగా అన్నీ భవనాల్లో ర్యాంపుల నిర్మాణం జరిగాయి. ఈ సౌకర్యాలకు గాను 2012లో రాష్ట్రపతి నుండి ఉత్తమ విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.
గ్రంధాలయం పేరును ఆనంద రంగపిళ్లై గా నామకరణం చేశారు. ఇక్కడ ఏ.సి. సౌకర్యం, పుస్తకాలు తీస్కోడానికి ఆర్ ఎఫ్ ఐ డి., సౌకర్యం , పుస్తకాలను శోధించదానికి ప్రత్యేక సదుపాయం కలదు. దీనికి అనుబంధంగా రీడింగ్ హాల్ భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించి 2016 లో ఆవిష్కరించారు. ఈ రీడింగ్ హాల్ లో అంధుల సౌకర్యార్ధం బ్రైలి లిపిలో చదువుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం కలదు. ఇక్కడ ఒక డిబేట్ రూమ్, చిన్న థియేటర్ కూడా ఉన్నాయి.