పాటిబండ్ల చంద్రశేఖరరావు భారతదేశ న్యాయకోవిదుడు. అతను పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1]
అతను 1936 ఏప్రిల్ 22న కృష్ణా జిల్లా కు చెందిన వీరులపాడు లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని, పి.హెచ్.డి ని చేసాడు. హైదరాబాదులోని నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.డి పట్టాను పొందాడు.[2] భారత మాజీ దౌత్యవేత్త వి. కె. కృష్ణ మేనన్ 1959లో ప్రారంభించిన "ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా" అనే సంస్థకు పరిశోధకునిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ 1963 నుండి 1967వరకు తన సేవలనందించాడు. అదే సంస్థలో 1999 నుండి 2000 వరకు అధ్యక్షునిగా పనిచేసాడు.[3] 1967లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖలో చేరాడు. ఆ తరువాత న్యాయ మంత్రిత్వ శాఖకు బదిలీ కాబడి దానికి కార్యదర్శిగా తన సేవలనందించాడు. దేశం తరపున దాదాపు 18 సంవత్సరాల పాటు సముద్ర న్యాయవివాదాల ట్రిబ్యునల్‌లో సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు.[4] 1972లో అతను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత విభాగంలో న్యాయ సలహాదారునిగా నియమితులయ్యాడు.[5] తదనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో అనేక హోదాలు నిర్వర్తించాడు. 1995-96లో న్యూఢిల్లీలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రానికి సెక్రటరీ జనరల్‌గా నియమితులైన గౌరవం కూడా పొందాడు. 1996లో ఆయన నేతృత్వంలోనే ఆర్బిట్రేషన్- కన్సీలియేషన్ చట్టం రూపుదాల్చింది. హాంబర్గ్‌లోని అంతర్జాతీయ సముద్ర జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా పనిచేశాడు.[6] భారతదేశంలో ముగ్గురు ప్రధాన మంత్రుల వద్ద అతను పనిచేశాడు. 1996 అక్టోబరు 1 నుంచి సముద్ర చట్టాల ట్రిబ్యునల్‌లో జడ్జిగా పనిచేస్తున్నాడు. అతను చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. రాజ్యాంగంతో పాటు మధ్యవర్తిత్వ చట్టాలపై ఆరు పుస్తకాలు కూడా రాశాడు. ఇటలీ, చైనా మధ్య సముద్ర జలాలపై వివాదం జరిగితే మధ్యవర్తిత్వం నడపడం ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించాడు.
అతను విశాఖపట్నంలోణి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా తన సేవలనందించాడు.[7]
అతను హైదరాబాదులో అక్టోబరు 11 2018న మరణించాడు.[8] అతనికి నలుగురు కుమార్తెలు.