డా. పాపినేని శివశంకర్ | |
---|---|
జననం | 1953, నవంబర్ 6 |
వృత్తి | తెలుగు అధ్యాపకులు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సాహితీ త్రిముఖుడు |
జీవిత భాగస్వామి | గృహలక్ష్మి |
పిల్లలు | సృజన, స్పందన |
తల్లిదండ్రులు |
|
పాపినేని శివశంకర్' సుప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత.
1953 నవంబర్ 6న విజయ దీపావళి నాడు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో పాపినేని వెంకట కృష్ణారావు, శాంతమ్మ దంపతులకు జన్మించారు. తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసి, 2010 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేశారు.
శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబరు 21 న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించింది.[1][2] ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.
ఇప్పటివరకు సుమారుగా 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను 'కథా సాహితి' పేరుతో వాసిరెడ్డి నవీన్తో కలిసి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.
శివశంకర్ కవితా సంపుటాలు 5 ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటాలు మట్టి గుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వెలువడ్డాయి.
'సాహిత్యం-మౌలిక భావనలు' అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణపతకం లభించింది. చినుకు, కథాసాహితి, విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు.
తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, 2000 సంవత్సరంలో వచన కవిత్వ పురస్కారం పొందారు.