దస్త్రం:Pollyumrigar.jpg | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పహ్లాన్ రతన్‌జీ ఉమ్రిగర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బొంబాయి లేదా సోలాపూర్, మహారాష్ట్ర ([1]) | 1926 మార్చి 28|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2006 నవంబరు 7 ముంబై | (వయసు 80)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 47) | 1948 డిసెంబరు 9 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఏప్రిల్ 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2021 అక్టోబరు 31 |
పహ్లాన్ రతన్జీ "పాలీ" ఉమ్రిగర్ (1926 మార్చి 28 - 2006 నవంబరు 7) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను భారత క్రికెట్ జట్టులో 1948 - 1962 మధ్య ఆడాడు. బొంబాయి, గుజరాత్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ఉమ్రిగర్ ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. అప్పుడప్పుడు మీడియం పేస్, ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. 1955 నుండి 1958 వరకు ఎనిమిది టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1962లో పదవీ విరమణ చేసినప్పటికి, భారత ఆటగాళ్ళలో కెల్లా అత్యధిక టెస్టులు (59) ఆడిన రికార్డు, అత్యధిక టెస్ట్ పరుగులు (3,631), అత్యధిక టెస్ట్ సెంచరీల (12) రికార్డులు అతని పేరిట ఉండేవి. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో అతను తొలి డబుల్ సెంచరీ సాధించాడు. [2] 1998లో, అతను CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది భారత క్రికెట్ బోర్డు మాజీ ఆటగాడికి అందించే అత్యున్నత గౌరవం. [3]
పాలీ ఉమ్రిగర్ బొంబాయిలో జన్మించి ఉండవచ్చు గానీ మహారాష్ట్రలోని షోలాపూర్ అని కూడా చెబుతారు.[1] తండ్రి బట్టల కంపెనీ నడిపేవాడు. అతను షోలాపూర్‌లో పెరిగాడు. పాఠశాలలో ఉన్నప్పుడు అతని కుటుంబం బొంబాయికి తరలి వెళ్లింది. [1]
అతను పార్సీ (జొరాస్ట్రియన్). ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో బాంబే క్రికెట్‌పై ఆధిపత్యం వహించిన సమాజం అది. [4] [2] అతను 1944లో బొంబాయి పెంటాంగ్యులర్‌లో 18 సంవత్సరాల వయస్సులో పార్సీల కోసం తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. సెయింట్ జేవియర్స్ కాలేజీలో BSc చదివాడు. బాంబే యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను హాకీ, ఫుట్‌బాల్ కూడా ఆడాడు. [1]
1948 అక్టోబరులో పర్యటనకు వచ్చిన వెస్ట్ ఇండియన్స్‌పై కంబైన్డ్ యూనివర్శిటీస్ [5] తరపున అతను 115* పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఏడు వారాల తర్వాత బొంబాయిలో అదే జట్టుతో జరిగిన 2వ టెస్టులో అతనికి అవకాశం కలిగించింది.
1949-50, 1950-51లో రెండు కామన్వెల్త్ జట్లు భారతదేశాన్ని సందర్శించే సమయానికి, ఉమ్రిగర్ జట్టులో రెగ్యులర్‌గా మారాడు. అతను మొదటి జట్టుపై అనధికారిక టెస్టుల్లో 276 పరుగులు, రెండో జట్టుపై 562 పరుగులు చేశాడు. మద్రాస్ టెస్టులో, అతను ఫ్రాంక్ వోరెల్ బౌలింగులో ఆడుతూ 90 నుండి 102కి వరుసగా రెండు సిక్సర్లతో చేరుకున్నాడు. [6]
ఒక సంవత్సరం తర్వాత స్వదేశంలో బలహీనమైన ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మొదటి నాలుగు టెస్టుల్లో అతను 113 పరుగులు మాత్రమే చేశాడు. ఐదవ టెస్టు జట్టు నుండి తొలగించారు గానీ హేమూ అధికారికి గాయం అవడంతో చివరి నిమిషంలో మళ్ళీ చేర్చారు. 7వ స్థానంలో ఆడుతూ అతను 130 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారతదేశం తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. బౌలింగ్ అంత నాణ్యమైనది కానప్పటికీ, ఉమ్రిగర్ దానిని తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా భావించాడు. [7] [8]
1952 లో ఇంగ్లండ్‌లో, ఉమ్రిగర్ టెస్టులు కాకుండా ఇతర మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేశాడు గానీ టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అతని మొత్తం స్కోరు 1,688, ఆ సీజన్‌లో భారత జట్టులోనే అత్యధికం. మే నెలలో అతను 800 పైచిలుకు పరుగులు చేశాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లాంకషైర్, కెంట్‌లపై డబుల్ సెంచరీలు చేశాడు. కేంబ్రిడ్జ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ కువాన్ మెక్‌కార్తీ [9] బౌలింగులో ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. అయితే, అతను ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 6.14 సగటుతో 43 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పరుగుల లేమి కంటే అతడు బ్యాటింగ్ చేసిన తీరు కలవరపెట్టింది. ఫ్రెడ్ ట్రూమాన్‌తో తలపడుతున్నప్పుడు, అతను పదేపదే స్క్వేర్ లెగ్ వైపు తిరిగి "ప్రతి బంతికి బ్యాట్‌ను చాపి పెట్టేవాడు, ఏదో కొత్త బ్యాట్స్‌మన్‌లాగా మిస్సయ్యేవాడు". [10] బెడ్సర్ అతనిని రెండుసార్లు ఔట్ చేసాడు; ట్రూమన్ నాలుగు సార్లు ఔట్ చేసాడు మూడు సందర్భాలలో అతను బౌల్డ్ అయ్యాడు. [11]
ఉమ్రిగర్ కెరీర్‌లోని మరే ఇతర దశల కంటే కూడా ఈ సిరీస్ గురించే ఎక్కువగా వ్రాయబడి ఉండవచ్చు. [12] ఉమ్రిగర్ ఫాస్ట్ బౌలర్‌లతో ఇతర సందర్భాల్లో చాలా ఎక్కువ విజయాలు సాధించాడు. 1959లో ట్రూమన్‌తో తన తదుపరి ఆటలో మాంచెస్టర్‌లో శతకం సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు సిరీస్‌లలో భారతదేశం తరపున అగ్రస్థానంలో ఉన్నాడు. వివిధ సమయాల్లో ఫ్రాంక్ కింగ్, వెస్ హాల్, రాయ్ గిల్‌క్రిస్ట్, చార్లీ స్టేయర్స్‌లను ఎదుర్కొన్నాడు. హాల్, స్టేయర్స్ బౌలింగులో అతను తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు.
అతను 1952-53లో స్వదేశంలో పాకిస్తాన్‌పై ఆడినపుడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. వెస్టిండీస్‌లో 1953 ప్రారంభంలో రెండు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో 560 పరుగులు చేశాడు. [13] పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో సోనీ రామధిన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో సెంచరీకి చేరుకున్నాడు. [14] 1955-56లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై అతను చేసిన 223, భారత్ తరపున నమోదైన మొట్టమొదటి డబుల్ సెంచరీ. [15] [16]
ఉమ్రిగర్ 1953-54లో కామన్వెల్త్ XI తో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో ఒకదానిని గెలిచిన భారత్ జట్టుకు నాయకత్వం వహించాడు. 1955-56లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నుండి మూడు సంవత్సరాల తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ వరకు, అతను వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్‌లో జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
1958-59లో వెస్టిండీస్‌తో జరిగిన ఒక టెస్టు తర్వాత, అతని స్థానంలో గులాం అహ్మద్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రెండు వరుస పరాజయాల తర్వాత గులాం అహ్మద్, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మద్రాస్‌లో జరిగే నాల్గవ టెస్టుకు ఉమ్రీగర్ మళ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గులాం అహ్మద్, గాయపడిన విజయ్ మంజ్రేకర్‌ల స్థానంలో ఎవర్ని తీసుకోవాలనే విషయంలో గందరగోళం ఏర్పడింది. మంజ్రేకర్ స్థానంలో మరో బ్యాట్స్‌మెన్ మనోహర్ హార్దికర్‌ని తీసుకోవాలని ఉమ్రీగర్ కోరాడు. అయితే ఆఫ్ స్పిన్నర్ జాసూ పటేల్ ఆడాలని BCCI అధ్యక్షుడు రతీభాయ్ పటేల్ పట్టుబట్టాడు. [17] దాంతో టెస్టుకు ముందు రోజు రాత్రి ఉమ్రీగర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. [18] ఆ తరువాత అతను మరో మూడు సంవత్సరాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు గానీ మళ్లీ కెప్టెన్‌గా మాత్రం వ్యవహరించలేదు. సిరీస్‌లోని ఐదు టెస్టుల్లో అతని 337 పరుగులే భారత్‌కు అత్యధికం.
1959లో ఇంగ్లండ్ పర్యటనలో, అతను మళ్లీ ఇతర మ్యాచ్‌లలో భారీగా స్కోర్ చేశాడు గానీ, టెస్టుల్లో మళ్లీ నాలుగో టెస్టు వరకూ ట్రూమాన్, బ్రియాన్ స్టాథమ్ బౌలింగులో కష్టపడ్డాడు. అతను టూర్ మ్యాచ్‌లలో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీపై 252* విదేశాల్లో ఒక భారతీయుడు చేసిన అత్యధిక పరుగులు. [19] చివరి మ్యాచ్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ట్రూమాన్ బౌలింగును ఎదుర్కొంటూ 118 చేసాడు. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు.
1959-60లో కాన్పూర్‌లో ఆస్ట్రేలియాపై భారతదేశం సాధించిన మొదటి విజయంలో ఉమ్రిగర్ ఆఫ్-స్పిన్, జాసూ పటేల్‌కు ముఖ్యమైన సహాయక పాత్రను పోషించింది. అయితే అతని బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. అతను వెన్ను గాయంతో సిరీస్‌లోని చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. 1960-61లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు, 1961-62లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై మరొక సెంచరీని సాధించాడు (మూడు టెస్టు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు).
కొన్ని వారాల తర్వాత, వెస్టిండీస్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ అన్ని మ్యాచ్‌లలో ఓడిపోయింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌లో, ఉమ్రిగర్ 56, 172 నాటౌట్‌లు చేశాడు. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. [20] తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 30 పరుగులకే తొలి ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత, అతను యాభై పరుగులు చేసాడు. భారత్ ఫాలో ఆన్‌లో ఉంది. ఉమ్రిగర్ 156 నిమిషాల్లో శతకాన్ని, 203లో 150కి చేరుకున్నాడు. వెస్ హాల్ రెండో కొత్త బంతిని తీసుకున్నప్పుడు, ఉమ్రీగర్ ఒకే ఓవర్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. [21] చివరి రెండు భారత వికెట్లకు 144 పరుగులు జోడించారు. 248 నిమిషాల్లో భారత్ చేసిన 230 పరుగుల్లో ఉమ్రిగర్ చేసినది 172* . అతను 445 పరుగులు, తొమ్మిది వికెట్లతో సిరీస్‌ను ముగించాడు. అతని దీర్ఘకాలిక వెన్నునొప్పి కారణంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఉమ్రిగర్ మరొక సీజన్ కోసం బొంబాయి తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1967-68లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు.
ఉమ్రిగర్ 1970వ దశకం చివరలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్లకు మేనేజర్‌గా ఉన్నాడు. అతను 1978, 1982 మధ్య జాతీయ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా, BCCI ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసాడు. అతను క్రికెట్ కోచింగ్‌పై ఒక పుస్తకాన్ని వ్రాసాడు. కొంతకాలం వాంఖడే స్టేడియంలోని పిచ్‌కు క్యూరేటర్‌గా ఉన్నాడు. అతను 1962లో పద్మశ్రీ, 1998-99లో CK నాయుడు ట్రోఫీని అందుకున్నాడు. జాతీయ అండర్-15 ఛాంపియన్‌షిప్ విజేతకు పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ బహూకరిస్తారు.
ఉమ్రిగర్ శోషరస క్యాన్సర్‌తో బాధపడుతూ, 2006 మధ్యలో కీమోథెరపీ చేయించుకున్నాడు. [22] అతను 2006 నవంబరు 7 న అనారోగ్యంతో ముంబైలో మరణించాడు [23]
అతను 1951లో తన దీనుని వివాహం చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.