పట్టొం ఏ థాను పిళ్ళై (జూలై 15, 1885 - జూలై 27, 1970) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. తదనంతరం 1960, ఫిబ్రవరి 22 నుండి 1962, సెప్టెంబరు 25 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కేరళ రాజకీయాల్లో భీష్మాచార్యునిగా పేరుపొందాడు.
థాను పిళ్ళై తిరువనంతపురం సమీపంలోని పట్టొంలో ప్రముఖ నాయర్ కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి, వరదా అయ్యర్, తల్లి ఈశ్వరీ అమ్మ. థాను పిళ్ళై కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకొని న్యాయవాదిగా పనిచేశాడు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొని భారత జాతీయ కాంగ్రేసు సభ్యుడయ్యాడు.[1] కాంగ్రేస్ శ్రేణుల్లో ఎదిగి ట్రావెన్‌కూర్ సంస్థానంలో కాంగ్రేసు అధ్యక్షుడైనాడు. ఈయన అసలు పేరు ఏ. థాను పిళ్ళై. అయితే, తిరువనంతపురం వద్ద ఉన్న పట్టొంకు చెందినవాడు కనుక పట్టొం థాను పిళ్ళై అని పేరుబడింది. ఈయన్ను సాధారణంగా అందరూ పట్టొం అని వ్యవహరించేవారు.
పట్టొం 1921లో శ్రీమూలం ప్రజా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1928 నుండి 1932 వరకు రీజెన్సీ పాలనాకాలంలో ట్రావెంకూరు శాసనమండలిలో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాతా తిరిగి 1933, 1937లలో శ్రీమూలం శాసనసభకు, 1948లో ట్రావెంకూరు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1956 వరకు ట్రావెంకూరు - కొచ్చిన్ శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన నిర్భీతిగా అప్పటి దీవాను సి.పి.రామస్వామి అయ్యరుపై చేసిన విమర్శలు, ప్రజలలో స్వాతంత్ర్య ఆకాంక్షను రగిలించాయి, కానీ దీవానుకు కంటగింపు కలిగించాయి. తత్ఫలితంగా ఈయనను అరెస్టు చేసి జైళ్ళో పెట్టారు. కానీ జైళ్లో ఉన్న సమయంలో అనారోగ్యం చెందడంవలన విడుదల చేశారు. భారత స్వాతంత్ర్యం తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి ట్రావెంకూరు ప్రభుత్వం థాను పిళ్ళై ప్రధానమంత్రిగా ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో సి.కేశవన్, టి.ఎం.వర్ఘీస్ ప్రభుతులు కూడా ఉన్నారు.
"విమోచన సమరం"గా వ్యవహరించబడిన ఉద్యమ పర్యవసానంగా కేరళలో కమ్యూనిష్ఠు ప్రభుత్వం కూలిపోయి 1960లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు పట్టోం కేరళ రెండవ ముఖ్యమంత్రిగా పిఎస్‌పి-కాంగ్రేసు పార్టీల ప్రభుత్వం పాలనలోకి వచ్చింది. ఈయన 1962 నుండి 1964 వరకు పంజాబ్ గవర్నరుగానూ, 1964 నుండి 1968 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగానూ పనిచేశాడు.[1]