పౌరుడు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజ్ ఆదిత్య |
---|---|
తారాగణం | సుమంత్ కాజల్ అగర్వాల్ సుమన్ తల్వార్ నాజర్ కృష్ణ భగవాన్ ఫిష్ వెంకట్ |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టుడియో |
విడుదల తేదీ | 13 జనవరి 2008 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 55 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పౌరుడు రాజ్ ఆదిత్య రచన, దర్శకత్వం వహించిన 2008 నాటి యాక్షన్ డ్రామా చిత్రం . ఈ చిత్రంలో సుమంత్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా, సుమన్, నాసర్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్ఎస్ క్రియేషన్స్ / అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుమంత్ సోదరి సుప్రియ నిర్మించింది. సుధాకర్ యక్కంటి ఛాయాగ్రహణం, మణి శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం 2008 జనవరి 13 న విడుదలైంది. ఇది రెండు కేంద్రాల్లో 100 రోజుల నడిచి బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి విజయాన్ని సాధించింది. దీన్ని హిందీలో గిరాఫ్తార్: ది మ్యాన్ ఆన్ ఎ మిషన్గా 2008 లో అనువదించారు.
అజయ్ ( సుమంత్ ) తన కళాశాల డిగ్రీ పూర్తి చేసి, ఐఎఎస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతని తండ్రి పాండు ( సుమన్ ) జకీర్ భాయ్ ( నాసర్ ) అనే శక్తివంతమైన మాఫియా నాయకుడికి కుడి భుజంగా పనిచేస్తాడు. కాశీ ( కోట శ్రీనివాసరావు ) తన కొడుకుతో కలిసి అదే నగరంలో ప్రత్యర్థి ముఠాను నడుపుతున్నాడు. పాండు గ్యాంగ్ స్టర్ అయినప్పటికీ, అతని కొడుకు అజయ్ అందుకు భిన్నమైన వాడు. చట్టాన్ని గౌరవిస్తాడు. అతను తన చదువులపై దృష్టి పెడతాడు. ఐపిఎస్ ప్రిలిమినరీలను పూర్తి చేస్తాడు. అతను మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. జకీర్ భాయ్ నేర ప్రపంచానికి తన తండ్రి విధేయతతో అతను ఏకీభవించనప్పటికీ, అతను తండ్రిని ప్రేమిస్తాడు. అజయ్, నృత్య పాఠశాలలో విద్యార్థి సంయుక్త ( కాజల్ అగర్వాల్ ) లు ప్రేమలో పడతారు. ఈ సమయంలో, హుస్సేన్ ( సుబ్బరాజు ) సిఐగా బాధ్యతలు స్వీకరించి, జకీర్ భాయ్, పాండు, కాశీలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దురదృష్టవశాత్తు, వారి రాజకీయ ప్రభావం కారణంగా అతను ఆ పని చెయ్యలేకపోతాడు. పాండుకు, కాశీ కొడుక్కూ మధ్య జరిగిన ఘర్షణలో, పాండు జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇది తెలుసుకున్న అజయ్ పోరాటంలో పాల్గొని తండ్రిని కాపాడుతాడు. తరువాత పాండు, అజయ్ లు ఇద్దరినీ హుస్సేన్ అరెస్టు చేస్తాడు. జాకీర్ భాయ్ పైకి కనబడుతున్న దానికంటే చాలా చెడ్డవాడు అని పాండు తరువాత తెలుసుకుంటాడు. అతని వద్ద పని మానుకోవాలని నిర్ణయించుకుంటాడు. దీన్ని ఇష్టపడని జకీర్ భాయ్, పాండును కాశీ అతని కొడుకూ చంపేలా చేస్తాడు. జకీర్ భాయ్ నగరాన్ని నియంత్రించాలని కోరుకుంటాడు, కాబట్టి కాశీని అతని కొడుకునూ చంపమని అజయ్‌ను కోరతాడు. అజయ్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఐ.ఎ.ఎస్. అవ్వాలనే కోరికను వదిలేసుకుని, చివరికి, జకీర్ భాయ్‌ని చంపేస్తాడు. అజయ్ చేత చంపబడిన వారందరూ మాఫియా ముఠా యుద్ధంలో మరణించారని హుస్సేన్ అందరినీ నమ్మిస్తాడు. అతను అజయ్ తన ఇష్టానుసారం IAS ప్రధాన పరీక్షలకు హాజరు కావడానికి సహాయం చేస్తాడు. సంయుక్త అజయ్‌లు తిరిగి ఏకమవడంతో ఈ చిత్రం ముగుస్తుంది.
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చల్రే చల్రే" | భాస్కరభట్ల రవికుమార్ | రంజిత్ | 4:27 |
2. | "నీ పక్కనుంటే" | రామజోగయ్య శాస్త్రి | హేమచంద్ర, ఉష | 4:51 |
3. | "Aamyamiya Aankh Maaro Miya" | భాస్కరభట్ల రవికుమార్ | సుచిత్ర | 4:36 |
4. | "అందాలనే అందిస్తా" | పెద్దాడ మూర్తి | రాహుల్ నంబియార్, రీటా | 4:30 |
5. | "సల్సా ఇది సల్సా" | రామజోగయ్య శాస్త్రి | వేణు, ఉష | 4:13 |
6. | "నీ పక్కనుంటే" (Remix) | రామజోగయ్య శాస్త్రి | హేమచంద్ర, ఉష | 4:07 |
మొత్తం నిడివి: | 26:44 |
Idlebrain.com కు చెందిన జీవి 3/5 రేటింగ్‌తో ఒక సమీక్ష ఇచ్చాడు: "పౌరుడు అనే శీర్షికను సమర్థించే సంభాషణలు ఉన్నప్పటికీ, ఇది కొడుకు యొక్క వ్యక్తిగత వ్యక్తిగత పగ కథ. మొత్తంగా, మెరుగైన క్లైమాక్సు, మంచి పోరాట సన్నివేశాలూ పౌరుడును సగటు చిత్రంగా మారుస్తాయి.[1]