1938, ఫిబ్రవరి 25న ముంబాయిలో జన్మించిన ఫరూక్ మానెక్‌షా ఇంజనీర్ (Farokh Maneksha Engineer) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు, 5 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబాయికి, ఇంగ్లాండు కౌంటీలలో లాంక్‌షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రధానంగా వికెట్ కీపింగ్ విధులను నిర్వర్తించే ఇతను బ్యాటింగ్‌లో కూడా నేర్పరి.
ఫరూక్ ఇంజనీర్ 46 టెస్టులు ఆడి 31.08 సగటుతో 2611 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 121 పరుగులు. కీపింగ్‌లో 66 క్యాచ్‌లు, 16 స్టంపింగులతో 82 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ పంపించాడు.
ఇతడు 5 వన్డేలు ఆడి 38 సగటుతో 114 పరుగులు సాధించాడు. వన్డేలలో అత్యధిక స్కోరు 54 నాటౌట్. 3 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ కూడా చేశాడు.
1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ క్రికెట్‌లో ఫరూక్ ఇంజనీర్ భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి వికెట్ కీపర్ విధులను నిర్వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అదే సంవత్సరం నిష్క్రమించడంతో మళ్ళీ పాల్గొనే అవకాశం రాలేదు.