ఫాలీ సామ్ నారిమన్ | |
---|---|
జననం | రంగూన్, బర్మా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత యాంగోన్, మయన్మార్) | 1929 జనవరి 10
మరణం | 2024 ఫిబ్రవరి 21 న్యూ ఢిల్లీ, భారతదేశం | (వయసు 95)
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ముంబయి విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
పిల్లలు | రోహింటన్ ఫాలీ నారిమన్ |
ఫాలీ సామ్ నారిమన్ (జననం 10 జనవరి 1929 - 21 ఫిబ్రవరి 2024) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పని చేసి న్యాయ వ్యవస్థలో ఆయన చేసిన విశేష కృషికిగాను 1991లో పద్మభూషణ్ [1], 2007లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నాడు. ఫాలి ఎస్ నారిమన్ 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పని చేశాడు. నారిమన్‌కు 2002లో ది గ్రుబెర్ ప్రైజ్ ఫర్ జస్టిస్ అవార్డు అందుకున్నాడు.[2]
ఫాలి.ఎస్.నారిమన్ మయన్మార్‌లోని రంగూన్లో 1929లో జనవరి 10న సామ్ బరియామ్‌జీ నారిమన్, బానూ నారిమన్ దంపతులకు జన్మించాడు. ఆయన సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో పాఠశాల విద్యను, ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ హిస్టరీలో బీఏ, 1950లో గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా పట్టా అందుకొని బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు.
ఫాలి.ఎస్.నారిమన్ బాప్సీ ఎఫ్. నారిమన్‌ను 1955లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు రోహింటన్ నారిమన్ 2011 నుండి 2013 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా, ఆ తరువాత భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశాడు.
ఫాలి.ఎస్.నారిమన్ 1950లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, 1961లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని 1972లో ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించండి. ఆయనను 1972లో కేంద్ర ప్రభుత్వం అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు.
1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా, 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా పని చేశాడు.
నారీమన్ భోపాల్ గ్యాస్ విపత్తు కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీకి అనుకూలంగా, ఆ తర్వాత తన తప్పును అంగీకరించి నష్ట పరిహారం విషయంలో బాధితులకు, కంపెనీకి మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గోలక్ నాథ్, ఎస్పీ గుప్తా.. లాంటి ముఖ్యమైన కేసులను వాదించాడు. 2014లో జయలలిత తరపున వాదించి ఆమెకు బెయిల్ ఇప్పించాడు. ఆయన అధికరణ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించాడు.[3]
నారిమన్ ఆత్మకథ పేరు “బిఫోర్ మెమరీ ఫేడ్స్”.
ఫాలి.ఎస్.నారిమన్ వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా 2024 ఫిబ్రవరి 21న ఢిల్లీలోని తన నివాసంలో మరణించాడు.[5][6]