ఫిటింగ్ మాస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
కథ | ఇ.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | అల్లరి నరేష్, మదాలస శర్మ, ఆలీ, చలపతి రావు, చంద్రమోహన్, సుధ |
విడుదల తేదీ | జనవరి 14, 2009 |
భాష | తెలుగు |
ఫిట్టింగ్ మాస్టర్ ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 2009 లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లరి నరేష్, మదాలస శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. జనవరి 14, 2009 లో విడుదలైన చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.[1] బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.[2]
సంపత్ అలియాస్ ఫిటింగ్ మాస్టర్ ఒక వ్యాయామ శిక్షకుడు. సంపత్ ఒకసారి మేఘన అనే ఒక అమ్మాయిని ఒక ప్రమాదం నుండి రక్షిస్తాడు. మేఘన అతనితో ప్రేమలో పడుతుంది కానీ సంపత్ మాత్రం తను ఆమెను పెళ్ళి చేసుకోలేననీ, చేసుకున్నా సంతోషంగా ఉంచలేనని చెప్పి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. ఆమె సంపత్ ను పెళ్ళికి ఒప్పించడానికి దుబాయ్ లో ఉన్న తన అన్నకు ఫోన్ చేసి రమ్మంటుంది. కానీ అతను వచ్చేదారిలో హత్యకు గురవుతాడు. ఒక పోలీస్ అధికారి ఈ కేసును విచారిస్తుంటాడు. తర్వాత ఆమె సంపత్ తన సోదరుని హత మార్చాడని అనుమానిస్తుంది. అది నిజమేనని సంపత్ నిర్ధారించి తన అన్న నిజ స్వరూపాన్ని ఆమెకి తెలియజేస్తాడు. మేఘన అన్న, అతని స్నేహితులు మరో ఇద్దరు కలిసి సంపత్ చెల్లెలి వ్యక్తిగత వీడియోలని ఇంటర్నెట్ లో పెడతారు. అంతకు ముందే ఈ ముగ్గుర్లో ఒకడు సంపత్ చెల్లెల్ని ప్రేమించి లేచిపోయి పెళ్ళిచేసుకుని ఉంటాడు. సంపత్ తల్లి గుండెపోటుతో మరణిస్తుంది. కొన్ని రోజుల తర్వాత సంపత్ చెల్లెలి భర్త స్నేహితులు ఆమె మొదటి రాత్రి వీడియోలని చూపించి ఆమెను మానభంగం చేస్తారు. ఆమె భర్తకు చెప్పగా అతను తేలిగ్గా తీసుకుంటాడు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇవన్నీ చూసిన సంపత్ తన కుటుంబం నాశనం చేసినవారిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందుకే పథకం ప్రకారం మేఘనను ప్రేమించినట్లు నటించి ఆమె అన్నను దుబాయ్ నుంచి రప్పించి చంపేస్తాడు.మిగతా ఇద్దరు స్నేహితులను కూడా అలాగే చంపేస్తాడు సంపత్. మేఘన మాత్రం అతన్ని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ సంపత్ మాత్రం కొడుకుని చంపిన హంతకుని ఎవరూ అల్లునిగా అంగీకరించరనీ, తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తాడు.