ఫిలిప్ మెడోస్ టైలర్

ఫిలిప్ మెడోస్ టైలర్
1873లో టైలర్
జననంఫిలిప్ మెడోస్ టైలర్
(1808-09-25)1808 సెప్టెంబరు 25
లివర్‌పూల్, ఇంగ్లాండు
మరణం1876 మే 13(1876-05-13) (వయసు 67)
మెంటన్, ఫ్రాన్స్
Notable work(s)కన్ఫెష్షన్స్ ఆఫ్ ఏ థగ్

కల్నల్ ఫిలిప్ మెడోస్ టైలర్ CSI (25 సెప్టెంబర్ 1808 - 13 మే 1876) బ్రిటిష్ ఇండియాలో ఒక పాలనాధికారి, నవలా రచయిత. ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ భారతదేశంను పరిచయం చేసేందుకు ఈయన కృతులు దోహదం చేశాయి. చాలామటుకు స్వయంగా నేర్చుకున్నప్పటికీ, ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయమూర్తిగా, ఇంజనీరుగా, కళాకారుడిగా, రచయితగా వివిధ రంగాల్లో నిష్ణాతుడిగా పనిచేశాడు.

జీవితం, రచనలు

[మార్చు]

టైలర్ ఇంగ్లాండులోని లివర్‌పూల్ లో జన్మించాడు. అక్కడ ఈయన తండ్రి ఫిలిప్ మెడోస్ టైలర్ ఒక వ్యాపారస్తుడు. ఈయన తల్లి జేన్ హోనోరియా అలిసియా, నార్త్‌అంబర్ల్యాండ్ లోని మిట్‌ఫోర్డ్ కాసిల్‌కు చెందిన బెర్ట్రామ్ మిట్‌ఫోర్డ్ కుమార్తె.[1]

15 సంవత్సరాల వయస్సులో, టైలర్, బొంబాయి వ్యాపారి, మిస్టర్ బ్యాక్స్టర్‌ వద్ద గుమస్తాగా పనిచేయటానికి భారతదేశానికి పంపబడ్డాడు.[1] అయితే, బ్యాక్స్టర్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వలన, 1824లో టైలర్ హైదరాబాదు నిజాం సేవలో ఉద్యోగాన్ని సంతోషంగా అంగీకరించాడు. అలా తన సుదీర్ఘ వృత్తిజీవితం మొత్తం నిజాం కొలువుకు అనుబంధంగా ఉన్నాడు. అనతి కాలంలోనే ఈయన సైనిక విధుల నుండి పౌర విధులు నిర్వహించడానికి బదిలీ చేయబడ్డాడు. ఈ హోదాలో దక్షిణ భారతదేశపు ప్రజలు, భాషలపై నైపుణ్యత సంపాదించాడు.[2]

ఇంతలో, టైలర్ భారతదేశపు చట్టాలు, భూగర్భ శాస్త్రం, పురావస్తువులను అధ్యయనం చేసి, మెగాలిథ్‌లపై తొలి నిపుణుడు అయ్యాడు.[3] ఇవేకాకుండా, ఈయన న్యాయమూర్తి, ఇంజనీరు, కళాకారుడు, రచయిత కూడాను.

టైలర్ గీసిన భోగనందీశ్వర ఆలయం యొక్క కలం, సిరా రేఖాచిత్రం, సి. 1834 

1840లో ఇంగ్లాండులో సెలవుపై ఉన్నప్పుడు, ఈయన తన తొలి భారతీయ నవల, "కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్‌"ను ప్రచురించాడు. దీనిలో తను థగ్గీ సంప్రదాయం గురించి విన్న కథలను, తన ప్రధాన పాత్రలు వర్ణిస్తున్నట్టుగా పునరావిష్కరించాడు. ఈ పుస్తకం తరువాత టిప్పు సుల్తాన్ (1840) తారా (1863) రాల్ఫ్ డార్నెల్ (1865) సీతా (1872) , ఎ నోబెల్ క్వీన్ (1878) అనే కథల శ్రంఖలను ప్రచురించాడు. ఈ కథలన్నింటిలో, వివిధ కాలాల్లోని భారతీయ చరిత్ర, సమాజాన్ని వర్ణిస్తూ, టైలర్ గౌరవప్రదంగా చూచిన స్థానిక వ్యక్తిత్వానికి, సంస్థలకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేశాడు. ముఖ్యంగా, "సీత" కథలో సిపాయి తిరుగుబాటుకు ముందుకాలంలో, ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ కు హిందూ వితంతువుతో జరిగిన వివాహాన్ని సానుభూతి దృక్పధంతో, హృద్యంగా చిత్రీకరించాడు. ఇక టైలర్ స్వవిషయానికొస్తే, ఈయన 1830 లో వివాహం చేసుకున్నాడని భావిస్తున్నారు. అయితే ఆయన ఆత్మకథలో, 1840లో జనరల్ విలియం పామర్ (1740-1816), ఆయన రెండవ భార్య, బీబీ ఫైజ్ భక్ష్ ఫైజున్నీసా బేగం (1828లో మరణించింది) కుమారుడైన, విలియం పామర్ (1780-1816) కుమార్తె మేరీ పామర్‌ను పెళ్లి చేసుకున్నానని వ్రాశాడు.[1][4] భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, ఈయన 1840 నుండి 1853 వరకు ది టైమ్స్ పత్రికకు విలేఖరిగా వ్యవహరించాడు. స్టూడెంట్స్ మాన్యువల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా (1870) ను రచించాడు.[2]

1850 ప్రాంతంలో, నిజాం ప్రభుత్వం యువ రాజా వెంకటప్ప నాయక సుదీర్ఘ మైనారిటీ కాలంలో సురపురం సంస్థానాన్ని నిర్వహించడానికి మెడోస్ టైలర్ను నియమించింది. ఎటువంటి యూరోపియన్ సహాయం లేకుండా, ఈ చిన్న సంస్థానాన్ని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడంలో ఈయన విజయం సాధించాడు. స్థానికులపై ఆయన ప్రభావం ఎంతగా ఉండిందంటే, 1857లో సిపాయి తిరుగుబాటు సమయంలో, ఈయన ఎటువంటి సైనిక మద్దతు లేకుండా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు.

కల్నల్ టైలర్, ఈస్టిండియా కంపెనీ సేవలో ఎన్నడూ పనిచేయనప్పటికీ, ఈయన ప్రతిభను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి, తదనంతరం పశ్చిమ దత్తమండల జిల్లాలకు డిప్యూటీ కమిషనర్‌గా నియమించబడ్డాడు. రైతులకు మరింత అనుగుణమైన, ప్రభుత్వానికి మరింత ఉత్పాదకమైన ఆదాయాలను ఇచ్చే విధంగా కొత్త రెవిన్యూ అంచనాల పద్ధతిని ఏర్పాటు చేయడంలో ఈయన విజయం సాధించాడు. కేవలం పట్టుదల ద్వారా, ఎటువంటి ప్రోత్సాహంగానీ, కంపెనీ మద్దతుగానీ లేకుండా, సగం చదువుకున్న యువకుని స్థాయి నుండి, 36,000 చదరపు మైళ్ళు (93,000 చ.కి.మీ)ల విస్తీర్ణంలో, యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఎదిగాడు.[2]

1860లో ప్రభుత్వసేవ నుండి పదవీ విరమణ చేసిన తరువాత ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అందుకుని, పెన్షన్ పొందాడు.[1] 1875లో టైలర్ కంటిచూపు కోల్పోయి, వైద్యుల సలహా మేరకు శీతాకాలం భారతదేశంలో గడపాలని నిర్ణయించుకున్నాడు, కానీ ఈయనకు అడవి జ్వరం సోకింది. ఈయన 1876 మే 13న ఇంగ్లాండుకు తిరిగి వెళ్తుండగా ఫ్రాన్స్‌లోని మెంటన్‌లో మరణించాడు.[1]

గుల్బర్గాకు చేసిన సేవలు

[మార్చు]
1840లో మెడోస్ టైలర్

టైలర్ భారతదేశంలోని గుల్బర్గా ప్రాంతానికి అనేక సంస్కరణలను ప్రారంభించడం ద్వారా సేవలందించాడు. వ్యవసాయాన్ని మెరుగుపరచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం, పాఠశాలలను ప్రారంభించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడాన్ని ఈయన ప్రోత్సహించాడు. కరువు సహాయానికి తన సొంత డబ్బును కూడా ఖర్చు చేసేవాడని తెలిసింది. స్థానికులు ఆయనను ఆప్యాయతతో "మహాదేవ్ బాబా" అని పిలవడం ప్రారంభించారు. టైలర్ గుల్బర్గాలో గుర్తించదగిన పురావస్తు త్రవ్వకాలను చేపట్టి, తను కనుగొన్న విషయాలను ట్రాన్‌సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ ఐరిష్ అకాడమీ, జర్నల్ ఆఫ్ ది బాంబే బ్రాంచ్ ఆఫ్ రాయల్ ఆసియాటిక్ సొసైటీ వంటి పరిశోధనా పత్రికలలో ప్రచురించాడు.[5]

నివాళులు

[మార్చు]

రిచర్డ్ గార్నెట్ , టైలర్ గురించి ఇలా వ్యాఖ్యానించాడు, "ఈయన వ్రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ ఒక క్లాసిక్ అడ్వెంచర్ నవల. ఇది అనేక తరాల సామ్రాజ్యవాద కాలపు యువతకు స్ఫూర్తినిచ్చింది. దీన్ని ఒక శతాబ్దకాలంపాటు అనేకమంది కాల్పనిక రచనలు చేసిన ఆ కాలపు రచయితలు అనుకరించారు".[1]

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చే ప్రచురించబడిన హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ 1784-1947 లో సౌరీంద్రనాథ్ రాయ్, టైలర్‌కు గొప్ప నివాళులు అర్పించాడు. అందులో టైలర్ యొక్క పురావస్తు కృషి అత్యంత ప్రధానమైనదిగా గుర్తించబడింది.[5]

రచనా సంగ్రహం

[మార్చు]

నవలలు

[మార్చు]
  • కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ (లండన్, 1839, ద్వితీయ ప్రచురణ 1873
  • టిప్పు సుల్తాన్: ది టేల్ ఆఫ్ ది మైసూర్ వార్ (1840)
  • తారా: ఎ మరాఠా టేల్ (ఎడిన్‌బరో/లండన్, 1863)
  • రాల్ఫ్ డార్నెల్ (1865)
  • సీత (లండన్, 1872)
  • ఎ నోబుల్ క్వీన్:ఎ రొమాన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ (లండన్, 1878)

కాల్పనికేతర

[మార్చు]
  • దక్కనులో పెద్ద శిలాయుగ సమాధులు, ఇతర పురాతన అవశేషాలు (పునఃముద్రణ, హైదరాబాద్, 1941)
  • ది స్టూడెంట్స్ మాన్యువల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా (లండన్, 1871)

మరణానంతర ప్రచురణలు

[మార్చు]
  • ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ (లండన్, 1877)
  • పొగాకు-ఒక రైతు పంట (1886)
  • ది లెటర్స్ టు హెన్రీ రీవ్ (1947) [6]

చిహ్నాలు

[మార్చు]

మూస:Infobox COA wide

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Richard Garnett (rev. David Washbrook): "Taylor, Philip Meadows (1808–1876)" Oxford Dictionary of National Biography (Oxford, UK: OUP) Retrieved 13 May 2018.]
  2. 2.0 2.1 2.2 Chisholm 1911.
  3. Kennedy, Kenneth A. R. (2000). God-apes and Fossil Men: Paleoanthropology of South Asia - Kenneth A. R. Kennedy - Google Books. ISBN 9780472110131. Retrieved 5 October 2013.
  4. Philip Meadows Taylor The Story of My Life (Edinburgh: William Blackwood & Sons) 1877 pp. 62–63.
  5. 5.0 5.1 Sirnoorkar, Srinivas (19 November 2013). "It's a Taylor-made task". Deccan Herald. No. Bangalore. Retrieved 21 January 2015.
  6. Details from British Library catalogue Retrieved 13 May 2018. Archived 2021-09-26 at the Wayback Machine

బయటి లింకులు

[మార్చు]