బర్రి రామచంద్రరావు | |
---|---|
జననం | విశాఖపట్నం | 1922 నవంబరు 21
మరణం | 2005 సెప్టెంబరు 24 విశాఖపట్నం | (వయసు 82)
ఇతర పేర్లు | బి. రామచంద్రరావు |
వృత్తి | రోదసీ రంగాన ప్రసిద్ధ పరిశోధకుడు |
ప్రసిద్ధి | భౌతిక శాస్త్రవేత్త |
బర్రి రామచంద్రరావు (ఆంగ్లం: Barri Ramachandra Rao) (1922 - 2005) ఐనావరణంలో అంతర్జాతీయ పేరుగాంచిన శాస్త్రవేత్త, రోదసీ రంగాన ప్రసిద్ధ పరిశోధకుడు.[1]
బి.ఆర్ గా సుప్రసిద్ధులైన బర్రి రామచంద్రరావు 1922 నవంబరు 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలిలో మత్స్యకార కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనూ, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను విశాఖలో చదివి బిఎస్సీ (ఆనర్స్) ని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. ఎంఎస్సీ. (ఫిజిక్స్) పట్టాను 1945లో ఏయూ నుంచి అందుకొని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సూరి భగవంతం నేతృత్వంలో పరిశోధన ఏయూలోనే ప్రారం భించారు. ఆల్ట్రాసోనిక్ కిరణాలు...వాటి పయనం అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకుగాను 1949లో ఏయూ డాక్టరేట్‌ను ప్రకటించింది.[2] రామచంద్రరావు 24 సెప్టెంబరు 2005 తేదీన పరమపదించారు.
ఆయన ఐనో మండలం, రోదసి, భౌతిక శాస్త్ర రంగాలలో పరిశోధనలు చేసారు. దేశంలో తొలిసారిగా అధిక వాతావరణ క్షితిజ సమాంతర వాయు వేగాల మీద పరిశోధనలు నిర్వహించి విజయులయ్యారు. అయ్హినో మండలంలోని తీరుతెన్నులు, పోకడలను కనుగొనడానికి నూతన పద్ధతులను రూపకల్పన చేసారు. రెండు లక్షల వ్యయంతో అయనొ మండలపు ధ్వని గ్రహిణిని నిర్మించారు. ఈయన కనుగొన్న పద్ధతులు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్నాయి.[3]
మన రాష్ట్రంలో తొలి యూనివర్శిటీ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిన్సిపాల్ గా కూడా ఖ్యాతి గడించారు. 1976, జూన్ 2 న యు.జి.సి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. తదనంతరం నేషనల్ ఫిషరీస్ అడ్వయిజరీ బోర్డు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. రాష్ట్రంలోని పలు జాతీయ విద్యా, పరిశోధక సంస్థలను సారథ్యం వహించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సూరి భగవంతం శిష్యులుగా భౌతిక శాస్త్ర రంగంలో విశేష పరిశోధనలు చేసారు. "ఫిజిక్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్స్" మొదలగు పలు గ్రంథములను రాసారు. ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మొదలగు సంస్థల అభివృద్ధికి కృషిచేసారు.[3]
ఆచార్య బి.ఆర్. రావును ఎన్నో పురస్కారాలు, పదవులు వరించాయి. ఆయన భారతదేశ రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. బెస్తవారి పల్లెలో పుట్టి పెద్దల సభకు వెళ్లడం వెనుక ఆయన మేథస్సే కారణం. 1982లో జరిగిన భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఈయన అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నాటి ప్రధాని ఇంధిరా గాంధీ హాజరయ్యారు. ఆచార్య బి.ఆర్. ప్రతిభ, బయోడేటా చూసి ముగ్ధురాలై అదే ఏడాది రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ పదవిలో ఆరేళ్ల పాటు (1982-88) కొనసాగి ఎంతో హూందాగా, రాజనీతిజ్ఞుడిగా ఖ్యాతి గాంచారు. మరో వైపు బి.ఆర్. ముంగిట ఎన్నో పదవులు వచ్చి వాలాయి. విశ్వ విద్యాలయాలకు పెద్దదిక్కు అయిన యు.జి.సికి రెండు పర్యాయాలు వైస్ ఛైర్మన్‌గా ( 1976 నుంచి 1982 వరకూ) వ్యవహరించే అవకాశం లభించింది.[4] 1965లో ప్రతిష్ఠాత్మకమైన శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికయ్యారు.[5] ( 1958 - 1998 ) ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహదారునిగా, పలు జాతీయ పరిశోధన సంస్థలకు గౌరవ ఆచార్యునిగా, సలహదారునిగా వ్యవహరించారు. పలు ప్రతిష్ఠాత్మకమైన జర్నల్స్‌కు 300కు పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు.[2]