బాంబే సిస్టర్స్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | శాస్రీయ జంట గాత్ర విద్వాంసులు |
బాంబే సిస్టర్స్‌గా పిలువబడే సి.సరోజ (జ.7డిసెంబరు 1936), సి.లలిత (జ.26 ఆగష్టు 1958) కర్ణాటక సంగీతంలో జంట గాయకులు.[1]
ఈ సోదరీమణులు కేరళ రాష్ట్రంలోని త్రిచూర్‌లో ముక్తాంబాళ్, ఎన్.చిదంబరం అయ్యర్ దంపతులకు జన్మించారు. వీరు బొంబాయిలో పెరిగారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మాతుంగ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైస్కూలులో జరిగింది. మధ్యప్రదేశ్ భోపాల్ నుండి ప్రైవేటుగా ఇంటర్మీడియట్ చదివారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. వీరి సంగీత శిక్షణ హెచ్.ఎ.ఎస్.మణి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, టి.కె.గోవిందరావుల ఆధ్వర్యంలో నడిచింది.[2][3]
1950వ దశకంలో కర్ణాటక సంగీతంలో రాధ జయలక్ష్మి, శూలమంగళం సిస్టర్స్ వంటి జంట గాయకుల పరంపర కొనసాగింది.[4] 1963లో ఈ సోదరీమణులు బాంబే సిస్టర్స్ పేరుతో జంటగా సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. మొదట వీరు లలిత సంగీతంతో ప్రారంభించి క్రమక్రమంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించ సాగారు. వీరు సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో కీర్తనలను ఆలపించేవారు.[5]వీరు యువ సంగీత కళాకారులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. [6]