బిచ్చగాడు 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు.[1]
ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తమిళంలో మార్చి 4, 2016 న విడుదలైంది. తెలుగులో మే 13, 2016 న విడుదలైంది.[2][3]
కోటీశ్వరుడైన అరుల్ (విజయ్ ఆంటోని) విదేశాల్లో ఎంబీయే చదువుకుని తిరిగి వస్తాడు. అతని తల్లి ఒక వస్త్ర పరిశ్రమ నడుపుతూ కార్మికులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు ప్రమాదవశాత్తూ ఆమె చీర ఒక యంత్రంలో ఇరుక్కుని తలకు బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆమెను బతికించుకోవడానికి అరుల్ అల్లోపతీ, ఆయుర్వేదం లాంటి అన్ని రకాలైన వైద్యాలు చేయిస్తాడు. కానీ ప్రయోజనం ఉండదు. వైద్యులు ఆమె ఇక ఎంతో కాలం బతకదనీ ఇంటికి తీసుకెళ్ళమని చెబుతారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చిన తరువాత అరుల్ ఒక రోజు ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఉండగా ఒక స్వామీజీ అతన్ని తనతో తీసుకెళ్ళి అతను ఎదుర్కొంటున్న సమస్యను గురించి చెబుతాడు. 48 రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిలా దీక్ష చేస్తే తల్లి ఆరోగ్యం కుదుటపడుతుందని సలహా ఇస్తాడు. దాంతో అరుల్ తన నమ్మకస్తుడైన స్నేహితునికి ఇంటి వ్యవహారాలు అప్పజెప్పి దూరంగా వెళ్ళిపోతాడు.
అరుల్ కు మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా ఒక గుడి దగ్గర చేరి అక్కడ ఉన్న బిచ్చగాళ్ళతో చేరి యాచన చేస్తూ కాలం గడుపుతుంటాడు. మహేశ్వరి అనే పిజ్జా దుకాణం అమ్మాయి మంచి తనాన్ని చూసి ఆమె మీద అభిమానం పెంచుకుంటాడు. ఆ అమ్మాయి కొంతకాలం క్రితం అమ్మ పెళ్ళిసంబంధాల వెబ్ సైటులో చూసిన అమ్మాయేనని తెలుసుకుని వారి వ్యాపారంలో సాయపడతాడు. ఆమె కూడా అతను బిచ్చగాడని తెలియక అభిమానిస్తుంటుంది. మరో వైపు అతని చిన్నాన్న అతని ఫ్యాక్టరీని ఎలాగైనా వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. చివరికి మహేశ్వరికి అతను బిచ్చగాడని తెలియగానే కొంచెం బాధ పడుతుంది కానీ అతన్ని మరిచిపోలేకుండా ఉంటుంది. ఒకరోజు మహేశ్వరి తల్లి ఆమె ల్యాప్ టాప్ లో అరుల్ పోటోను చూసి అతను ఒక వ్యాపారవేత్త అనీ, తమ సంబంధం కోసం ఇంతకు ముందుగానే సంప్రదించారనీ తెలుసుకుంటుంది. ఆమె నిజం తెలుసుకోవడానికి అరుల్ దగ్గరికి వెళుతుంది. అప్పుడే అరుల్ తన స్నేహితుడితో మాట్లాడటం విని అతను తల్లికోసం బిచ్చగాడిలా దీక్ష చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని కదిలించకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది.
అంతకుముందే అరుల్ బిచ్చగాళ్ళలో ఒక అమ్మాయిని బయటి వాళ్ళు వేధిస్తున్నారని తెలిసి ఆమెను ఒక మానసిక చికిత్సా కేంద్రంలో చేరుస్తాడు. ఆమె ద్వారా అక్కడ జరిగే అక్రమాలను తెలుసుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న ఆస్పత్రి నిర్వాహకులు అరుల్ ని చంపమని ఒక రౌడీ బృందాన్ని పురమాయిస్తారు. అరుల్ వారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు. దీక్షలో ఆఖరి రోజున మహేశ్వరి కూడా వచ్చి అతనికి జత కలుస్తుంది. మళ్ళీ అరుల్ చిన్నాన్న పంపిన గూండాలు అతని మీద దాడి చేయాలని చూస్తారు. వారిని ఎదుర్కొనే సమయంలో అరుల్ చిన్నాన్న వచ్చి అతన్ని కత్తితో పొడవబోతే మహేశ్వరి అడ్డుపడుతుంది. ఆమె మెడమీద గాయంతో ఆస్పత్రిలోచేరుతుంది. అరుల్ అప్పటికి తన దీక్ష ఇంకా పూర్తికాకపోవడంతో ఆస్పత్రి ఖర్చు ఎలా భరించాలో తెలియక సతమవుతూ ఉంటే తనతోటి బిచ్చగాళ్ళు వచ్చి తమ వద్ద ఉన్న బంగారం, ధనం ఇచ్చి అతన్ని ఆదుకుంటారు.
48 రోజులు దీక్ష పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిన అరుల్ కి తన తల్లి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. చివరిగా తల్లి నోటిలో తులసి తీర్థం పోయడానికి వెళ్ళి, చివరిగా తన తల్లి ప్రాణాలని బిక్షగా వేయమని వేడుకుంటాడు. ఆమెలో అకస్మాత్తుగా కదలిక వస్తుంది. ఆరు నెలల్లో ఆమె కోలుకుంటుంది. అరుల్, మహేశ్వరి వివాహం చేసుకుంటారు. ఒకసారి తల్లి, భార్యతో గుడికి వెళ్ళిన అరుల్ దగ్గరకి ఓ బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడుగుతాడు. అరుల్ ఏదో ఫోన్ కాల్ లో మాట్లాడుతూ అతన్ని పట్టించుకోడు. అతని తల్లి ఆ బిచ్చగాడికి దానం చేసి, బిచ్చగాళ్లను నిర్లక్ష్యం చేయవద్దనీ, వాళ్లలాంటి స్థితిమంతులు ఒక్క రోజు కూడా ఆ జీవితం గడపలేరనీ మందలిస్తుంది. అరుల్ నిర్లిప్తంగా అమ్మను క్షమించమంటాడు. తన తల్లి ఆరోగ్యం కోసం 48 రోజులు బిచ్చగాడిగా ఎన్ని కష్టాలు పడ్డాడో అసలు తల్లికి తెలీనీకుండా ఉంచిన భర్త గొప్పతనం చూసి మహేశ్వరి అతని వైపు ఆరాధనతో చూస్తుండటంతో కథ ముగుస్తుంది.