బిజినెస్ మేన్

బిజినెస్ మేన్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం ఆర్.ఆర్.వెంకట్
కథ పూరీ జగన్నాధ్
చిత్రానువాదం పూరీ జగన్నాధ్
తారాగణం మహేశ్ ‌బాబు
సాయాజీ షిండే
కాజల్ అగర్వాల్
ప్రకాశ్ రాజ్
నాజర్
సంగీతం ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణం శ్యాం కే నాయుడు
నిర్మాణ సంస్థ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
పంపిణీ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
భాష తెలుగు

ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం పై ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన చిత్రం బిజినెస్ మేన్. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ ‌బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2012 జనవరి 13 న భారీ యెత్తున విడుదలై సంచలనాత్మక విజయం సాధించింది.

ముంబై నగర పోలీస్ కమిషనర్ భరద్వాజ్ (నాజర్) సిటీలో మాఫియాని అంతమొందించామని మీడియాకి ధ్రువీకరించిన తర్వాత ముంబైలో విజయ్ సూర్య (ఘట్టమనేని మహేశ్ బాబు) అనే యువకుడు ముంబైలోకి అడుగుపెడతాడు. ఆ నగరంలోని ధారవి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు (బ్రహ్మాజీ) తన ఇంటికి సూర్యని తీసుకెళ్తాడు. ఇదే ముంబైలో ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని తన స్నేహితుడు అన్న మాటలకు బదులుగా సూర్య తను ముంబైలో పెద్ద డానవ్వాలని, ముంబైని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో మాఫియా భయాన్ని తిరిగి నిద్రలేపడానికి వచ్చానంటాడు. అప్పుడు లాలూ (షయాజీ షిండే) అని ఇబ్బందుల్లో ఉన్న ఓ రాజకీయ నాయకుడికి సహాయం చేస్తానంటాడు. జాఇలులో ఉన్న లాలూ విరోధిని తను కొత్తగా ఏర్పరుచుకున్న అనుచరులల్లో జైలులో ఉన్న ఒకరితో చంపించేసి లాలూని తన స్నేహితుడిని చేసుకుని రాజకీయ బలం పెంచుకోవడం మొదలుపెడతాడు. ముంబైలో ఉన్న నేరస్థులు, రౌడీలను తన అనుచరులుగా మార్చుకుంటాడు. ముంబైపై పట్టు సాధిస్తూ మెల్లమెల్లగా సూర్య భాయ్ అనే పేరుతో ముంబై ప్రజల్లో ప్రముఖుడు, అదే ప్రజలకు భయాన్ని కలిగిస్తాడు.

ఇంతలో భరద్వాజ్ చేతుల్లోనుంచి తప్పించుకోడానికి భరద్వాజ్ కూతురు చిత్ర (కాజల్ అగర్వాల్)ని వాడుకోవాలనుకుంటాడు సూర్య. పెయింటర్ ఐన చిత్రని సూర్య ప్రేమిస్తున్నట్టు నటించి తనని ప్రేమలో పడేస్తాడు. కానీ సూర్య ప్రేమ ఓ నటన అని చిత్ర తెలుసుకునే సమయానికి సూర్య తనని నిజాయితీగా ప్రేమిస్తుంటాడు. ఆ విషయం తనకి తెలిసేలా చేసినా తను నమ్మదౌ కాబట్టి చిత్రను ఎలాగైన తనని తిరిగి ప్రేమించేలా చెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు. ఒక వ్యాపారవేత్తగా, డన్ గా అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో ఎదిగిన సూర్య లాలూతో స్నేహం, రాజకీయ బలాలను పెంచుకుంటాడు. సూర్య ఎక్స్పోర్ట్స్ & ఇంపోర్ట్స్ అనే కంపెనీ పెట్టి దాని ద్వారా తన అక్రమ వ్యాపారాలను నడుపుతుంటాడు. భారతదేశం వ్యాప్తంగా సూర్య భాయ్ అంటే ఓ వ్యక్తిలా కాక ఓ బ్రాండ్ అనిపించుకునేలా తన అక్రమ వ్యాపారాలను నలుమూలలా విస్తరింపజేస్తాడు. ప్రతీ నగరంలో, ప్రతీ టౌనులో, ప్రతీ ఊరిలో సూర్య ఎక్స్పోర్ట్స్ & ఇంపోర్ట్స్ బ్రాంచులను స్థాపిస్తాడు. ఆయా ప్రాంతాల్లో జరిగే కాంట్రాక్ట్స్ అన్నింటిపైన 2% టాక్స్ బలవంతంగానైన వసూలు చెయ్యమని అక్కడి లోకల్ గూండా, రౌడీలను నియమించుకుంటాడు సూర్య. దీనివల్ల కోటీశ్వరుడైన సూర్య తను స్థాపించిన బిజినెస్ బ్యాంక్ ఇనాగురేషన్ ఫంక్షనులో భరద్వాజ్ పక్కన కూర్చుని తన నిజమైన ఆంతర్యాన్ని చెప్తాడు. తనకి యుద్ధంలో తప్ప మంచి,చెడులతో పనిలేదని, తన పనులవల్ల ఇండియాలో క్రైం రేట్ తగ్గిందని, భారతదేశంలో మాఫియాని అంతమించి పేదలకు సాయం చెయ్యడమే తన ఈ పనుల అంతరార్థమని చెప్పేస్తాడు.

భారతదేశ జాతీయ రాజకీఈయాల్లో బలవంతుడైన జైదేవ్ (ప్రకాశ్ రాజ్) బలపరిచిన అరుణ్ ఘోఖ్లేని మేయర్ ఎలెక్షన్లలో లాలూ సూర్య సహాయంతో ఓడిస్తాడు. జైదేవ్ మీద కక్షకట్టిన అరుణ్ ఘోఖ్లే పోలీసులకు జైదేవ్ చేసింజ అక్రమాల గురించి చెప్పేస్తాడు. కేవలం భరద్వాజ్, సూర్యలకు మాత్రమే జైదేవ్ రహస్యాల గురించి తెలుసు. ఇలాంటి సమయంలో భరద్వాజ్ ఇంట్లో ఉండగా జైదేవ్ చేతిలో భరద్వాజ్ చంపబడతాడు. సూర్య సరైన సమయానికి వచ్చినా కాపాడుకోలేకపోతాడు. జరిగిన దారుణానికి బాధతో రగిలిపోతున్న చిత్రతో సూర్య తన గతాన్ని, తనకి జైదేవ్ మీదున్న వైరాం గురించి చెప్తాడు. సూర్య తండ్రి అమెరికాలో కోట్లు సంపాదించి ఇండియాలో ఎదైనా మంచి పని చెయ్యాలని కుటుంబంతో సహా వస్తాడు. అప్పుడు జైదేవ్ ఒక మామూలు రాజకీయ నాయకుడు. ట్రస్ట్ పేరిట సూర్య తల్లిదండ్రుల ఆస్తిని లాక్కుంటే ఇదేం న్యాయమని అడగడానికి వెళ్తే వాళ్ళిద్దరినీ చంపేస్తాడు జైదేవ్. పోలీసులని సూర్య కలిసి ఎంత ప్రాధేయపడినా ఒక్కరూ కేస్ రిజిస్టర్ చేసుకోరు. సమాజం ఒక అనాథకు చూపించిన వివక్ష సూర్యకి ఆ చిన్న వయసులోనే సమాజంపట్ల పగ పెంచుకునేందుకు కారణమయ్యాయి.

దేశంలో అక్రమాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నికలు పై దృష్టి పెడతాడు సూర్య. లాలూ సహాయంతో ప్రతిపక్ష నేత గురు గోవింద్ పటేల్ (రజా ముర్జాద్) దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. ఎన్నికల ప్రచారానికీ మరియూ విజయానికి 35 వేల కోట్లు ఇస్తానని, గురు గోవింద్ పటేల్ ని ప్రధాన మంత్రి పదవిలో కూర్చోపెడతానని మాటిస్తాడు. ఆ డబ్బుని వాడి ఎన్నికల్లో గెలిపించి, జైదేవ్ ప్రధాన మంత్రి పదవికి అనర్హుడని మీడియాలో నిరూపిస్తాడు. ఇది తెలిసి కోపంతో చిత్రను కిడ్నాప్ చేస్తాడు జైదేవ్. సూర్య అక్కడికి వెళ్ళి జైదేవ్ మనుషులందరినీ కొట్టాక చిత్రను కాపాడుకోడానికి తనని తాను తుపాకితో కాల్చుకుంటానని చెప్తాడు. చిత్ర వద్దంటున్నా, జైదేవ్ ప్రలోభపెడుతున్నా సూర్య కాల్చుకుంటాడు. వెంటనే జైదేవ్ ప్రాణాలను తుపాకితో కాల్చి చంపేస్తాడు. హాస్పిటల్లో తన ప్రేమను అంగీకరించిన చిత్రతో కలిసి మీడియాతో మాట్లాదుతున్న సూర్యతో సినిమా ముగుస్తుంది.

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఈ చిత్రం యొక్క పాటలను 2011 డిసెంబరు 22 న శిల్పకళావేదికలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. పాటల రచన భాస్కరభట్ల రవికుమార్ గారు రచించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా పాటలకు విశేష స్పందన లభించింది.

పాట గానం నిడివి
ముంబాయి రంజిత్, రాహుల్ నంబియర్, అలాప్ రాజు, నవీన్ మాధవ్ 2:43
సార్ ఒస్తారా ఎస్.ఎస్ తమన్, సుచిత్ర 3:57
పిల్లా చావ్ రాహుల్ నంబియర్ 4:19
చందమామ హరిచరణ్ 3:04
బ్యాడ్ బాయ్స్ గీత మాధురి, ప్రియ హిమేష్ 3:53
బిజినెస్ మేన్ మహేశ్ ‌బాబు, పూరీ జగన్నాధ్ 2:47

స్పందన

[మార్చు]

123తెలుగు తమ సమీక్షలో "బిజినెస్ మేన్ మహేష్ బాబు ఒన్ మాన్ షో. మహేష్ తనదైన శైలి నటన పూరీ మార్కు అధ్బుతమైన డైలాగులతో అలరిస్తుంది. కొన్ని లాజిక్ అందని అంశాలు ఉన్నప్పటికీ ఎంటర్టైన్ చేసే అంశాలు ఎక్కువ ఉన్నాయి. మీ స్నేహితులతో కలిసి ఈ వారాంతంలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పారు.[1] వన్ ఇండియా తమ సమీక్షలో "మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం మహేష్ చెప్పే డైలాగ్స్ కోసం చూడాలి" అని చెప్పారు.[2]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2012 సైమా అవార్డులు

  1. ఉత్తమ గీత రచయిత (భాస్కరభట్ల రవికుమార్ - సారొస్తా రొస్తారా)
  2. ఉత్తమ నేపథ్య గాయకుడు (తమన్ - సారొస్తా రొస్తారా)

మూలాలు

[మార్చు]
  1. "సమీక్ష : మంచి కిక్కు ఇచ్చే – బిజినెస్ మేన్". 123తెలుగు. Retrieved జనవరి 13, 2012.
  2. "భయపెట్టే 'బిజినెస్ మ్యాన్' (రివ్యూ)". వన్ ఇండియా. Retrieved జనవరి 13, 2012.