బిష్ణు శ్రేష్ఠ (జననం 1975 ), భారత సైన్యంలో పనిచేసి రిటైరైన నేపాలీ గూర్ఖా సైనికుడు. ఒక రైలు సంఘటనలో బందిపోట్ల నుంచీ ఒక అమ్మాయిని ప్రాణాలు ఒడ్డి కాపాడినందుకు సేనా మెడల్, ఉత్తమ్ జీవన్ రక్ష పదక్ మెడల్ కూడా అందుకున్నారు.[1][2][3][4]
నేపాల్ లోని పర్బత్ జిల్లాలో బచ్చా దెయ్రలీ ఖొలాలో జన్మించారు బిష్ణు. ఈ ప్రాంతంలో ఎక్కువగా గూర్ఖాలు ఉంటారు. ఇక్కడి ప్రజల్లో 80శాతం మంది గురుంగ్ ప్రజలు. వీరు బ్రిటీష్, భారత సైన్యాల రెజిమెంట్లలో పనిచేస్తుంటారు. భారత గూర్ఖా రెజిమెంట్ లో ఉద్యోగం వచ్చిన తరువాత బిష్ణు కుటుంబం పోఖరా ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు.
సెప్టెంబర్ 2010లో, బిష్ణు గోరఖ్ పూర్ నుంచీ నేపాల్ కు మయూరా ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ ప్రాంతం వద్ద సాయుధులైన దొంగల ఒకటి ముఠా రైలు ఎక్కింది.[5][6] ప్రయాణికులను దోపిడి చేయడం మొదలుపెట్టారు దొంగలు.
నిద్రపోతున్న బిష్ణును దొంగలు లేపి, తన వద్ద ఉన్న విలువైన వస్తువులు ఇమ్మన్నారు. ఆయన ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, ఆ దొంగలు బిష్ణు పక్కనే ఉన్న 18 ఏళ్ళ యువతినిమానభంగం చేసేందుకు ప్రయత్నించారు. తనను కాపాడమని ఆమె బిష్ణును కోరింది. ఈ లోపు అప్రమత్తుడైన బిష్ణు తన వద్ద ఉన్న నేపాలీ కుక్రీ కత్తిని తీసి దొంగలను గాయపరచడం మొదలుపెట్టారు.