ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
బీమర్ (బీమ్ బాల్ అని కూడా అనడం కద్దు) అనేది క్రికెట్లో ఒక రకమైన డెలివరీ. దీనిలో బంతి అసలు బౌన్స్ అవ్వకుండా, బ్యాటరు నడుము కంటే పై ఎత్తున దూసుకు వెళుతుంది.[1] పిచ్‌పై బంతి బౌన్స్ అవుతుందని బ్యాటర్లు మామూలుగా అనుకుంటారు. కానీ ఇలా బౌన్స్ అవకుండా వచ్చే బంతిని కొత్తడం గానీ, తనకు తగలకుండా తప్పించుకోవడం గానీ బ్యాటరుకు కష్టతరమౌతుంది. అంచేత ఈ రకమైన డెలివరీ ప్రమాదకరమైనది. సాధారణంగా బౌలింగు చేసే సమాయ్ంలో బంతి బౌలరు చేతుల్లోంచి జారిపోవడం వల్ల అనుకోకుండా ఇలా జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కూడా ఇలా వేస్తారు కూడా. ఇది క్రికెట్ చట్టాలకు, ఆటగాళ్ల నుండి ఆశించే క్రీడాస్ఫూర్తికి చాలా విరుద్ధమైన చర్య. ఈ రకమైన డెలివరీ వలన బ్యాటరుకు దెబ్బలు తగిలి గాయాలు కావచ్చు.
ఇలాంటి డెలివరీ వేసినపుడు జరిమానాగా దాన్ని నో-బాల్‌గా ప్రకటిస్తారు. ట్వంటీ20లు, వన్డే మ్యాచ్‌లలో నైతే, దానితో పాటు తరువాతి డెలివరీ ఫ్రీ హిట్ కూడా అవుతుంది. బీమర్లు వేయడాన్ని క్రికెట్ చట్టం 41.7 ప్రకారం నియంత్రిస్తారు. ప్రమాదకరమైన బౌలింగ్ వేసినపుడు అంపైరు బౌలర్‌కు హెచ్చరిక చేస్తారు. 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో వకార్ యూనిస్ చేసినట్లుగా, హెచ్చరిక తరువాత కూడా బీమరు వేస్తే లేదాఉద్దేశపూర్వకంగా బీమరు వేస్తే ఆ బౌలరును ఆ ఇన్నింగ్సులో (లేదా ఆ మ్యాచ్‌లో) మళ్లీ బౌలింగ్ చేయకుండా నిరోధించవచ్చు. [2] ఫాస్ట్ బౌలర్లు, ప్రత్యేకించి ఇంకా తమ సాంకేతికతలను పూర్తిగా మెరుగుపర్చుకోని యువ ఆటగాళ్ళు, ఇతర బౌలర్ల కంటే ఎక్కువగా ఇటువంటి డెలివరీలు వేసే అవకాశం ఉంది. అయితే అది ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా జరుగుతుంది.
బీమర్లు కావాలని వేయకపోవచ్చు. చేతులకు చెమటలు పట్టడం వలన గానీ, బంతికి తడి అయినపుడు గానీ, బంతి చేతి నుండి జారి బీమరుగా పోవచ్చు. బౌలరు యార్కరు వేయడానికి ప్రయత్నించినపుడు కూడా అదుపు తప్పి బీమరు లాగా వెళ్ళే అవకాశం ఉంది. [3]
బౌలరు, బంతి నేలపై పడి లేచాక బ్యాటరు తల తగిలేలా గురిపెట్టి బంతిని వేసే అవకాశం ఉంది. దీనిని బౌన్సర్ అంటారు. క్రికెట్ చట్టాల ప్రకారం అది చట్టబద్ధమైన డెలివరీయే. బీమర్ల కంటే వీటిని ఆడడం లేదా దాన్నుండీ తప్పించుకోవడాం బ్యాటరుకు సులభం. బీమర్లు పిచ్‌పై పడకుండా నేరుగా బ్యాటర్ల పైకి వస్తూ, బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నేలపై తాకి పైకి లేచే బంతిని పాదాలు, శరీర కదలికలను ఉపయోగించి బ్యాటింగు చేసే సాంకేతికత బీమర్లకు వర్తించదు.
పాకిస్తానీ స్పిన్ బౌలరు అబ్దుర్ రెహ్మాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన 2014 ఆసియా కప్‌లో వరుసగా మూడు బీమర్లను వేశాడు. ఆ మూడూ నోబాల్లయ్యాయి. ఇకపై ఆ ఇన్నింగ్సులో మరి బౌలింగు చెయ్యకుండా నిషేధించారు. ఆ మూడు బంతుల్లో 8 పరుగులు ఇచ్చాడు. చట్టబద్ధమైన బంతి ఒక్కటి కూడా వేయకుండా మ్యాచ్ నుండి అలా నిషేధించబడడం క్రికెట్ చరిత్రలో అదే తొలిసారి. [4]
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, తాను ఉద్దేశపూర్వకంగానే మహేంద్ర సింగ్ ధోనీపై బీమరు వేసినట్లు అంగీకరించాడు. [5]