బేలారస్‌లో హిందూమతస్థులు చాలా తక్కువ. దేశంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, బ్రహ్మకుమారీలు, కైలాశ ది లైట్ అనేమూడు ప్రధాన హిందూమత సమూహాలు ఉన్నాయి . అలెగ్జాండర్ లుకాషెంకో ప్రభుత్వం నుండి ఇస్కాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ది లైట్ ఆఫ్ కైలాస పూర్తిగా నిషేధించబడింది. బేలారస్‌లో 1000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. [1]
ఇస్కాన్ అనుయాయులను "హరే కృష్ణ భక్తులు" అటారు. ఇస్కాన్‌కు బేలారస్‌లో ఆరు నమోదిత సంఘాలు ఉన్నాయి. [2] ఇవి గోమెల్, గ్రోడ్నో, మిన్స్క్, విటెబ్స్క్ నగరాల్లో ఉన్నాయి.
2003లో, ఇస్కాన్ యొక్క బేలారసియన్ బ్రాంచ్ కార్యకర్తలు బేలారసియన్ స్కూల్ టెక్స్ట్‌బుక్ ఆన్ హ్యుమానిటీస్‌లో తమ మతాన్ని కించపరిచినందుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ ఆమోదం పొందాక ప్రచురిస్తారు. పాఠ్యపుస్తకంలో "మేకింగ్-బ్లాక్‌హెడ్" అనే అభ్యంతరకరమైన పదం ఉపయోగించబడింది. ఇది ఇస్కాన్ విశ్వాసులను మోసం చేయడమేనని ఆరోపించబడింది. "నిజ జీవితానికి" తిరిగి రావాలంటే కృష్ణ విశ్వాసులకు మనోవైద్యుని సహాయం అవసరమని అది పేర్కొంది. [3]
బేలారస్ ప్రభుత్వం హరే కృష్ణ పట్ల మత అసహనాన్ని ప్రోత్సహించే పాఠ్యపుస్తకాలను ఉపయోగించడం కొనసాగించింది. మత సమూహాలు నిరసనలు తెలిపినప్పటికీ విద్యా మంత్రిత్వ శాఖ, మానవుడు, సమాజం, రాజ్యం అనే పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించడం కొనసాగించింది. అందులో ప్రొటెస్టంట్లు, హరే కృష్ణలను మత తెగలు అని అందులో పేర్కొంది. [4]
1000 మంది సభ్యుల మిన్స్క్ కమ్యూనిటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ దాని స్వంత భవనంలో సమావేసమవడంపై, నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడంపై నిరోధాన్ని ఎదుర్కొంది. 1990లో అది కొనుగోలు చేసిన భవనంలో హరే కృష్ణలను నమోదు చేయడానికి స్థానిక అధికారులు నిరాకరించారు. ఆ భవనం ఉన్న ప్రాంతం నివాస వినియోగానికి మాత్రమేనని ప్రార్థనా స్థలంగా ఉపయోగించరాదనీ పేర్కొన్నారు.
2004 నుండి హరే కృష్ణలు రిజిస్టర్ కాని భవనంలో సమావేశమైనందుకు స్థానిక అధికారుల నుండి ఆరు హెచ్చరికలు అందుకున్నారు. మిన్స్క్ కమ్యూనిటీ ఐరాస మానవ హక్కుల కమిషన్ (UNCHR)కి విజ్ఞప్తి చేసింది. దాంతో సంఘాన్ని మూసివేయడంలో స్థానిక ప్రభుత్వానికి ఆటంకం ఏర్పడింది. 2005 ఆగస్టులో UNCHR, 90 రోజులలోపు సంఘంపై "హక్కులను పునరుద్ధరించాలని" సిఫార్సు చేసింది. ఆ వ్యవధి లోపు స్థానిక అధికారులు UNCHR సిఫార్సును పాటించలేదు. [5]
కృష్ణ కాన్షియస్‌నెస్‌కు చెందిన మిన్స్క్ కమ్యూనిటీ అద్దె కోసం అనేక చోట్ల భవనాల కోసం ప్రయత్నించింది. అయితే అధికారులు ఒత్తిడి చేయడంతో భూస్వాములు తమ ఆఫర్‌లను ఉపసంహరించుకున్నారు. చివరికి సంఘం ఒక చట్టబద్ధమైన భవనాన్ని కనుగొని, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించింది. కానీ అధికారులు దాని రిజిస్ట్రేషన్ను తిరస్కరించారు.
మతపరమైన సాహిత్యాన్ని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసినందుకు హరే కృష్ణ భక్తులను అధికారులు వేధించారు, జరిమానా విధించారు, నిర్బంధించారు. నగరంలో మతపరమైన వస్తువులను పంపిణీ చేయడానికి అనుమతి కోసం హరే కృష్ణ భక్తులు చేసిన అభ్యర్థనలను మిన్స్క్ నగర అధికారులు పదేపదే తిరస్కరించినందున, వాటి పంపిణీని నిలిపివేయాలని సంఘం నిర్ణయించుకుంది.
2016 లో ISKCON కార్యకర్త హోమియెల్, బహిరంగ మత కార్యకలాపాలను జరిపినందుకు గాను అధికారులు అతనికి జరిమానా విధించారు. [6] హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, ఇస్కాన్ కార్యకర్తలు, ఇతర హిందూవాదుల ఏకపక్ష అరెస్టులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. [7]
జూలై 2021లో, బేలారసియన్ అధికారులు ప్రభుత్వేతర సంస్థలపై దాడిని ప్రారంభించారు. న్యాయ మంత్రిత్వ శాఖ బలవంతంగా మూసివేసిన NGOలలో "వేదాంత వాద" అనే హిందూ మత సాంస్కృతిక, విద్యా సంస్థ కూడా ఉంది. [8] "వేదాంత వాద - మహిలియోలో హరే కృష్ణ" సమూహం భారతీయ సంస్కృతిని, మతాన్నీ ప్రోత్సహించడంలో చురుకుగా ఉంది. [9]
"లైట్ ఆఫ్ కైలాస" హిందూ మత సంస్థ. శైవ శాఖకు చెందినది. దీన్ని బేలారస్‌లో నమోదు చేసుకోలేదు.
2002 జూలై 13 న, బేలారసియన్ ఆధ్యాత్మిక సంఘం "లైట్ ఆఫ్ కైలాస" కు చెందిన 17 మంది సభ్యులను మిన్స్క్ పార్కులలో ఒకదానిలో పోలీసులు నిర్బంధించారు. వారు అనుమతి లేని ఊరేగింపు, సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బేలారసియన్ పార్కులో హిందూ పాటలు, శ్లోకాలు పాడుతూండగా అరెస్టు చేసిన 17 మందిలో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
12 మంది హిందువులు - అందరూ బేలారస్ పౌరులే - పోలీసు ప్రాసెసింగ్ ఫెసిలిటీలో వేచి ఉన్న సమయంలో నిరాహార దీక్షను ప్రారంభించారు. కోర్టులో హాజరుపరిచే వరకు వారిని అక్కడే ఉంచారు. ఈ బృందం నిరాహారదీక్ష ప్రారంభించిందని ప్రాసెసింగ్ సెంటర్‌లోని అధికారులు ధృవీకరించారు. త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని చెప్పారు. [10]
బేలారస్‌లో 20 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న మత సమూహాలు సాహిత్యాన్ని ప్రచురించడం లేదా మిషన్‌లను స్థాపించడం, 20 కంటే తక్కువ మంది బేలారసియన్ పౌరులు ఉన్న తెగల ద్వారా వ్యవస్థీకృత ప్రార్థనలను జరపడం వంటి వాటిని నిషేధిస్తూ పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన బిల్లును హిందువులు వ్యతిరేకించారు. [11]
2002 నవంబరులో మరింత నిర్బంధ మతం చట్టం అమల్లోకి రాకముందే ఈ బృందం నమోదు చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది.
2003 జూన్ 1 న నలుగురు సాయుధ పోలీసు అధికారులు రాజధాని మిన్స్క్‌లోని ఒక ప్రైవేట్ ఫ్లాట్‌లో లైట్ ఆఫ్ కైలాస కు చెందిన సుమారు ఆరుగురు సభ్యులు నిర్వహించిన సాయంత్రపు కర్మ, ధ్యానాన్ని విచ్ఛిన్నం చేశారు. గ్రూప్ నాయకురాలు నటాల్యా సోలోవియోవా జూన్ 7న ఫోరమ్ 18 న్యూస్ సర్వీస్‌కు ఈ సంగతి చెప్పింది. నగరంలో మరోచోట ఇలాంటి హిందూ ధ్యాన సమావేశాన్ని విచ్ఛిన్నం చేసిన సరిగ్గా వారం తర్వాత ఈ దాడి జరిగింది. ఫోరమ్ 18 ఈ హిందూ సమావేశాలపై పోలీసులు ఎందుకు దాడి చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. కానీ జూన్ 9న మిన్స్క్ సిటీ కౌన్సిల్ యొక్క మత, జాతి వ్యవహారాల విభాగం అధిపతి అల్లా ర్యాబిట్సేవా వారి టెలిఫోన్‌కు సమాధానం ఇవ్వలేదు. అదే రోజు ఫోరమ్ 18 సంప్రదించిన అలెగ్జాండర్ కాలినోవ్, బేలారసియన్ స్టేట్ కమిటీ ఫర్ రిలిజియస్ అండ్ ఎత్నిక్ అఫైర్స్‌లో మిన్స్క్ హిందూ సమాజం గురించి తన డిపార్ట్‌మెంట్ వద్ద ఎలాంటి పత్రాలు లేవని చెప్పారు. [12]
బేలారస్‌లో బ్రహ్మ కుమారీలకు రెండు కేంద్రాలు ఉన్నాయి.