ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
క్రికెట్‌లో బౌలింగ్ అంటే బ్యాటర్ రక్షించుకుంటున్న వికెట్లకు గురిచూసి బంతిని విసరడం. బంతి విసిరే ఆటగాణ్ణి బౌలర్ అంటారు; [1] సమర్ధంగా బ్యాటింగు, బౌలింగు రెండూ చేయగల ఆటగాణ్ణి ఆల్-రౌండర్ అంటారు. బంతిని విసరడానికి బంతిని బౌలింగ్ చేయడానికీ ఉన్న తేడా, బయోమెకానికల్ చర్య. బౌలింగులో మోచేయి వద్ద వంపు ఉండే కోణం పరిమితంగా ఉండాలి.[2] బంతిని వేయడాన్ని బాల్ లేదా డెలివరీ అంటారు. వరసగా ఆరు సార్లు బంతిని వేస్తారు. దీనిని ఓవర్ అని పిలుస్తారు. ఒక బౌలర్ ఒక ఓవర్ వేసిన తర్వాత, పిచ్ రెండవ వైపు నుండి మరొక బౌలరు తరువాతి ఓవరు వేస్తారు.[3] బంతిని ఎలా వేయాలి అనేదాన్ని క్రికెట్ నియమ నిబంధనలు నియంత్రిస్తాయి.[4] ఒక బంతిని చట్టవిరుద్ధంగా చేస్తే, అంపైర్ దానిని నో బాల్‌గా నిర్ణయిస్తాడు.[5] బ్యాట్స్‌మన్‌కు అందనంత దూరంగా బంతిని వేస్తే, బౌలర్ వైపున ఉండే అంపైర్ ఆ బంతిని వైడ్ అని నిర్ణయిస్తాడు.[6]
బౌలర్లలో వివిధ రకాలున్నారు. ఫాస్ట్ బౌలర్ల ప్రాథమిక ఆయుధం వేగం. స్వింగ్, సీమ్ బౌలర్లు బంతిని గాలిలో గాని, బౌన్స్ అయినప్పుడు గానీ దాని మార్గం నుండి పక్కకు జరిగి వంపుగా వెళ్ళేలా చేయడానికి ప్రయత్నిస్తారు.[7] అలాగే స్లో బౌలర్లు, స్పిన్ బౌలర్లు వంటి రకాల బౌలర్లున్నారు. వివిధ రకాల ఫ్లైట్, స్పిన్‌లతో బ్యాటరును మోసగించడానికి ప్రయత్నం చేస్తారు. స్పిన్ బౌలర్ సాధారణంగా బంతిని చాలా నెమ్మదిగా వేస్తూ, బంతిని తిప్పుతాడు. బంతి నేలపై తగిలి పైకి లేచేటపుడు అది ప్రయాణించే మార్గపు కోణం మారి వేరే మార్గంలో పోతూ బ్యాటుకు అందకుండా బ్యాటరును ఏమారుస్తుంది.[8]
క్రికెట్ ప్రారంభమైన తొలి రోజుల్లో, అండర్ ఆర్మ్ బౌలింగ్ మాత్రమే చేసేవారు. క్రికెట్ మూలాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. గొర్రెల కాపరులు తమ గొర్రలను వేటాడే జంతువుల నుండి, శత్రువుల నుండీ కాపాడుకునేందుకు రాయి లేదా బంతితో కొడుతూ, అదే సమయంలో వికెట్ గేట్‌ను రక్షించుకోవడంతో ఈ ఆట మొదలైందని భావిస్తున్నారు. మరో సిద్ధాంతం ప్రకారం ఈ పేరు ఇంగ్లాండ్‌లో 'క్రికెట్' అని పిలువబడే పొట్టి పీట పేరు మీదుగా వచ్చింది. 1478లో నార్త్-ఈస్ట్ ఫ్రాన్స్‌లో కూడా 'క్రికెట్' ప్రస్తావన ఉంది. మధ్య యుగాలలో ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ఈ ఆట ఉద్భవించిందని రుజువు.
20 వ శతాబ్దం ప్రారంభంలో, బౌలర్లందరూ చేతిని కిందనుండి ఊపుతూ (అండర్ ఆర్మ్) బంతిని విసిరేవారు. అయితే, జాన్ విల్లెస్ తన సోదరి క్రిస్టినాతో కలిసి ప్రాక్టీస్ చేసేటపుడు భుజం ఆధారంగా చేతిని గుండ్రంగా తిప్పుతూ చేతిని పైకి లేపి ("రౌండ్-ఆర్మ్") బంతిని వేసాడు. ఆ విధంగా చేసిన మొదటి బౌలర్ అతడు. క్రిస్టినా వేసుకున్న వెడల్పాటి దుస్తులు అండర్ ఆర్మ్ బౌలింగుకు అడ్డుగా ఉన్నందున వాళ్ళు ఈ కొత్త పద్ధతిని కనిపెట్టారు.[9]
రౌండ్-ఆర్మ్ పద్ధతిని మ్యాచ్‌లలో విస్తృతంగా ఉపయోగించడం మొదలైంది. అయితే మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) దీన్ని చట్టవిరుద్ధమని ప్రకటించి నిషేధించింది. "చేతిని కిందకు పెట్టి, బంతిని విసరాలి. బంతిని చేతిలోంచి వదిలే సమయంలో చేయి మోచేతి కంటే దిగువన ఉండాలి. మోచేతి దగ్గర మడిచి విసరడం, కుదుపుతో విసరడం వంటివి చేయకూడదు." అని నియమాలు విధించింది.[10] చేయి భుజం ఎత్తును దాటి పైకి లేపకూడదని ఆ నిబంధనలు పేర్కొన్నాయి. అయితే, చేయి పైకెత్తి బౌలింగు చేసినపుడే మరింత ఖచ్చితంగా విసరగలిగారని, ఇదే ఎక్కువ బౌన్స్‌ను ఉత్పత్తి చేస్తుందనీ త్వరలోనే తెలిసిపోయింది. మళ్ళీ, పాలకమండలి ఈ పద్ధతిని నిషేధించింది. చివరికి 1835లో MCC ఈ పద్ధతిని ఆమోదించేంత వరకు [11] ఇది ఆటగాళ్లందరిలో వేగంగా ప్రజాదరణ పొందింది. అప్పటి నుండి అండర్ ఆర్మ్ బౌలింగ్ పద్ధతి దాదాపు అదృశ్యమైంది.
1981లో జరిగిన ఒక మ్యాచ్‌లో "అండర్ ఆర్మ్ బౌలింగ్ సంఘటన" జరిగి, ఆ జట్టుకు అపకీర్తి తెచ్చిపెట్టింది. అండర్ ఆర్మ్ బౌలింగ్ అప్పటికీ చట్టబద్ధంగానే ఉందనే వాస్తవాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్ట్రేలియన్ బౌలర్ ట్రెవర్ చాపెల్, అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసాడు. అలా చేసి అతను న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్, బ్రియాన్ మెక్‌కెచ్నీ, మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను టై చేయగలిగే అవకాశం దొరక్కుండా చేసాడు. ఎందుకంటే, అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తే సిక్సరు కొట్టే ఎత్తుకు బంతి రాదు కాబట్టి. [12]
ఈ సంఘటన ఫలితంగా అండర్ ఆర్మ్ బౌలింగును క్రికెట్‌లోని అన్ని గ్రేడ్‌లలో చట్టవిరుద్ధం చేసారు - రెండు జట్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప [13]
బయోమెకానికల్ నిర్వచనం ప్రకారం బౌలింగు చేయడం అనేది బంతిని విసరడం కంటే భిన్నంగా ఉంటుంది.
ఒరిజినల్‌గా ఈ నిర్వచనం, బౌలింగ్ చేసే సమయంలో మోచేయి కీలు నిటారుగా ఉండకూడదని ఈ నిర్వచనం చెప్పింది. బౌలర్లు సాధారణంగా తమ మోచేతులను పూర్తిగా విస్తరించి ఉంచి, బంతికి వేగాన్ని అందించడానికి చేతిని భుజం కీలు చుట్టూ గుండ్రంగా, చాపం లాగా తిప్పుతారు. బంతి చాపానికి పైన ఉండగా దాన్ని వదులుతారు. మోచేయి వద్ద చేయి వంగకూడదు. మోచేయి విస్తరిస్తే దాన్ని త్రోగా పరిగణించి, నో-బాల్ గా ప్రకటిస్తారు. బౌలర్ మోచేయిని కొద్దిగా వంచి ఉంచితేనే ఇది సాధ్యపడుతుందని భావించారు.[14][15][16]
2005లో, శాస్త్రీయ పరిశోధనా సంఘం చేసిన పరిశీలనలో ఈ నిర్వచనం భౌతికంగా అసాధ్యం అని పరిగణించారు. బౌలింగ్ చేసేటపుడు దాదాపు బౌలర్లందరూ తమ మోచేతులను కొంతవరకు విస్తరిస్తారని బయోమెకానికల్ అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే చేతిని గుండ్రంగా తిప్పేటపుడు కలిగే ఒత్తిడి వలన మోచేయి జాయింటు అతిగా విస్తరిస్తుంది. విసిరిన బంతిని చట్టవిరుద్ధంగా పరిగణించాలంటే, ముందు 15 డిగ్రీల వరకు కోణాల పొడిగింపులు లేదా హైపర్‌ఎక్స్‌టెన్షన్‌లను అనుమతించాలని మార్గదర్శకాన్ని ప్రవేశపెట్టారు.[14][16]
వికెట్టు తీసుకోవడం, బ్యాటరు పరుగులు తీసే అవకాశాలు లేకుండా చెయ్యడం ఈ రెండే బౌలింగు లక్ష్యాలు. బ్యాటరు బ్యాటుకు సరిగ్గా మధ్యలో తగలకుండా తప్పుకునేలా బంతికి తగు చలనాన్ని ఆపాదిస్తే ఈ లక్ష్యాన్ని సాధించే వీలు ఉంటుంది. దీనికి మూడు విభిన్నమైన పద్ధతులున్నాయి. బంతిని చక్కటి లైను, లెంగ్తులతో వెయ్యడం, బ్యాటరు స్పందించలేనంత వేగంతో బంతిని వెయ్యడం, బంతి బ్యాటరు వద్దకు వచ్చేటప్పటికి బంతికి పక్కలకు వెళ్ళేలా చెయ్యడం- ఈ పక్కలకు వెళ్ళడం అనేది బంతి నేలకు తాకకముందే గాల్లోనే చలించడం, లేదా నేలకు తగిలి పైకి లేచేటపుడు పక్కకు వెళ్ళడం ఈ రెండూ ఉంటాయి. మంచి బౌలరు వీటిలో రెండింటిని కలపగలడు. నిజమైన గొప్ప బౌలరు మాత్రం ఈ మూడింటినీ కలపగలడు.
మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం వలన, బ్యాట్స్‌మన్ ముందుకు కదిలి బంతిని డ్రైవు చేసేందుకు గాని, వెనక్కి అడుగు వేసి బ్యాక్ ఫుట్ మీద కొట్టడానికి గానీ వీలు లేకుండా ఉంటుంది. దీనివలన బ్యాట్స్‌మన్ బంతిని మంచి షాటు కొట్టగలిగే అవకాశాలు లేకుండా చేస్తుంది. బ్యాటరు డెలివరీని తప్పుగా అంచనా వేసి, అతను వికెట్ కోల్పోయే సంభావ్యతను కూడా పెంచుతుంది. ఒక మంచి లెంగ్త్ డెలివరీ అంటే బంతి పిచ్ నుండి లేచాక బ్యాట్‌ని తప్పించుకోడానికి దూరంగా పోయేంత సమయం ఉంటుంది, కానీ బ్యాట్స్‌మన్ దానికి తగ్గట్టు కదలడానికి, ప్రతిస్పందించి షాట్‌ను సర్దుబాటు చేసుకోడానికీ తగినంత సమయం ఉండదు. బౌలర్ ఎంత వేగంగా, ఎంత ఎక్కువగా బంతి కదలికను సృష్టించగలిగితే, గుడ్ లెంగ్త్ అంత విస్తృతి అంత ఎక్కువగా ఉంటుంది.
పిచ్‌పై ఉండే ఇతర ప్రాంతాలు కూడా తరచుగా గుడ్ లెంగ్త్ డెలివరీకి ఉపయోగపడతాయి. ఇతర రకాలైన డెలివరీల్లో యార్కర్ ఒకటి. బంతిని నేరుగా బ్యాట్స్‌మన్ పాదాల వద్ద బౌల్ చేసి, బ్యాట్స్‌మాన్‌ని ఔట్ చేయడానికి ఉద్దేశించిన డెలివరీ ఇది. అలాగే బౌన్సర్ అనే డెలివరీ కూడా ఉంది. ఇందులో బంతి పిచ్ పైనుండి బ్యాట్స్‌మన్ గొంతు ఎత్తుకు లేచేలా తక్కువ లెంగ్తులో బంతిని చేస్తారు. బ్యాటరుకు భౌతికంగా దెబ్బ తగిలే అవకాశమున్నడెలివరీ ఇది. యార్కరు లేదా ఫుల్ టాస్ ఎత్తు బ్యాట్స్‌మన్ నడుము కంటే ఎక్కువగా ఉండకూడదు. లేదంటే దానిని నో-బాల్ బీమర్ అని పిలుస్తారు. దీని వలన బౌలర్లు మ్యాచ్ నుండి నిషేధించబడవచ్చు.
బౌలర్ బౌలింగ్ చేయడానికి ఎంచుకునే లైన్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది: అతను బంతిపై సృష్టించే కదలిక, బ్యాట్స్‌మన్ ఆడగలిగే షాట్లు, కెప్టెన్ సెట్ చేసిన ఫీల్డింగు. రెండు అత్యంత సాధారణ వ్యూహాలు నేరుగా స్టంప్‌ల వద్ద బౌలింగ్ చేయడం లేదా ఆఫ్ స్టంప్ లైన్ కొద్దిగా బయట 3 నుండి 6 అంగుళాల దూరంలో బౌలింగ్ చేయడం. స్టంప్స్ వద్ద బౌలింగ్ చేయడం అనేది బ్యాట్స్‌మన్ బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూని అవుట్ చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసే వ్యూహం. బ్యాట్స్‌మన్ బంతిని మిస్ అయితే ఔట్ అవుతాడు కాబట్టి ప్రమాదకర షాట్‌లు ఆడగల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని రక్షణాత్మక వ్యూహంగా కూడా ఉపయోగించవచ్చు. ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేయడాన్ని అనిశ్చితి కారిడార్ అంటారు. ఈ లైన్‌లో చక్కగా వేసిన బంతిని రక్షణాత్మకంగా ఆడాలా లేక వదిలివేయాలా అని బ్యాట్స్‌మన్‌ను గందరగోళానికి గురి చేస్తుంది. ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం వికెట్ కీపర్ లేదా స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చేలా చేసి బ్యాటరును అవుట్ చేయడం. ఆఫ్ స్టంపుకు బాగా వెలుపల బౌలింగ్ చేయడం లేదా లెగ్ స్టంప్ వద్ద బౌలింగ్ చేయడం వంటి ఇతర బౌలింగ్ పద్ధతులను సాధారణంగా ప్రతికూల, రక్షణాత్మక వ్యూహాలుగా పరిగణిస్తారు.
కొన్ని విభిన్న రకాల బౌలింగ్ వ్యూహాలు:
వ్యూహాత్మకంగా అనుకూలమైన లైన్, లెంగ్తుల్లో బంతిని ల్యాండ్ చేయగల సామర్థ్యం కాకుండా, బౌలరుకు ఉన్న ప్రధాన ఆయుధాలు బ్యాట్స్‌మన్‌ను సమీపిస్తున్నప్పుడు బంతిని పక్కకు పోయేలా చెయ్యగల సామర్థ్యం, బంతిని అధిక వేగంతో వేసే సామర్థ్యం.
క్రికెట్ బౌలర్ల వేగం 64న నుండి 161 కి.మీ/గం మధ్య ఉంటుంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో, 64–96 కి.మీ/గం వేగంతో వేసే బౌలరును స్లో బౌలర్ అని, 96–128 కి.మీ/గం వేగంతో వేసే బౌలరును మీడియం పేస్ బౌలరు అని, 128 కి.మీ/గం కంటే వేగంగా వేసే బౌలరును ఫాస్ట్ బౌలరు అనీ అంటారు. ఔత్సాహిక ఆటలో, ఈ వేగాలు ఒక 16 కి.మీ/గం నెమ్మదిగా ఉంటాయి. చాలా మంది ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్లు 126 కి.మీ/గం కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలుగుతారు. ప్రపంచంలోని కొంతమంది బౌలర్లు 144 కి.మీ/గం వేగంతో బౌలింగ్ చేయగలరు. ఆ వేగాలతో వచ్చే క్రికెట్ బంతికి ప్రతిస్పందించే సామర్థ్యం వృత్తిపరమైన బ్యాటర్ల ఉన్నత స్థాయి ఔత్సాహిక బ్యాటర్లకూ మాత్రమే ఉండే నైపుణ్యం. బౌలర్ వేగం, బ్యాట్స్‌మన్ ప్రతిచర్య వేగాన్ని మాత్రమే కాకుండా అతని శారీరక ధైర్యాన్ని కూడా సవాలు చేస్తుంది. ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్‌లను బౌలింగ్ చేయడం ద్వారా క్రమం తప్పకుండా లేదా అప్పుడప్పుడూ బ్యాటరును ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
బౌలర్లు స్పిన్ లేదా స్వింగును ఉపయోగించి బంతిని పక్కకు వెళ్ళేలా చేయగలరు. బంతిని స్పిన్ చేస్తే అది గాల్లో ఉండగా మాగ్నస్ ప్రభావం[గమనిక 1] కారణంగా అది గాల్లో ఉండగా అది వెళ్ళే మార్గం నుండి పైకి జరుగుతుంది. ఆపై నేలకు తగిలాక పక్కకు తిరుగుతుంది. గాలిలో ఉన్న బంతికి పార్శ్వ చలనాన్ని కలగ చేయడానికి క్రికెట్ బంతికి మధ్యన చుట్టూ ఉండే సీమ్‌ను కొంత కోణంలో ఉంచినపుడు ఏర్పడే వాయు పీడన వ్యత్యాసాలను ఉపయోగించుకుని బంతిని స్వింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్లు సాధారణంగా బంతికి కదలికను ఇచ్చేందుకు స్వింగ్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. అయితే మీడియం పేస్, స్లో బౌలర్లు తరచుగా రెండింటి కలయికను ఉపయోగిస్తారు. అందరి ఉద్దేశమూ ఏమిటంటే, బంతికి చలనాన్ని కలిగించి, బ్యాటరు దాని లైన్‌ను అంచనా వేయడం తప్పు చేసి, బంతిని మిస్సయ్యేలా చేస్తారు. తద్వారా అతను బౌల్డ్ అవడం, లేదా ఎల్బీడబ్ల్యూ అవడం జరుగుతుంది. లేదా పూర్తిగా మిస్సవక పోయినా బ్యాటు బంతికి సరిగ్గా తగలక, బంతి ఫీల్డర్లకు చిక్కి క్యాచ్ అవుటు కావచ్చు.
బ్యాటరు ఊహకు చిక్కకుండా, అంచనాకు అందకుండా ఉండటానికి, బౌలరు సాధారణంగా వేగం, కదలిక రెంటినీ విభిన్నంగా కలుపుతూ వైవిధ్యంగా బౌలింగు చేస్తాడు. వ్యూహాత్మకంగా చాతుర్యం గల బౌలరు వివిధ డెలివరీని ఎదుర్కోవడంలో బ్యాట్స్‌మన్‌కు ఉన్న బలహీనతను గుర్తించగలడు. ఓవరు లోని చివరి బంతితో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలనే ఉద్దేశ్యంతో బౌలర్లు ముందుగానే ప్లాన్ చేసుకుని డెలివరీలు వేస్తారు. దీనిని బ్యాట్స్‌మన్‌కు "ఉచ్చు పన్నడం" అంటారు. [17] బ్యాట్స్‌మన్లు, బౌలర్లు తరచుగా "పిల్లీ ఎలుకా " ఆట ఆడుతూంటారు. బౌలర్ బ్యాట్స్‌మన్‌ని ఔట్ చేసేందుకు ఉచ్చు పన్నుతూ ఉంటే, బ్యాట్స్‌మాన్ అందుకు ప్రతిస్పందనగా తన వ్యూహాలను సర్దుబాటు చేస్తూనే ఉంటాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో, ఒక్కో బౌలరు బౌలింగ్ చేయగల ఓవర్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. ఈ సంఖ్య మ్యాచ్ నిడివిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇన్నింగ్స్‌లోని మొత్తం ఓవర్లలో ఇది 20% ఉంటుంది . ఉదాహరణకు, ఇరవై ఓవర్ల క్రికెట్‌కు సాధారణ పరిమితి ఒక బౌలర్‌కు నాలుగు ఓవర్లు, నలభై ఓవర్ల క్రికెట్‌కు ఒక బౌలర్‌కి ఎనిమిది, యాభై ఓవర్ల మ్యాచ్‌లో ఒక్కో బౌలర్‌కు పది ఓవర్లు ఉంటాయి. అయితే, ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రతి బౌలరు బౌలింగ్ చేసే ఓవర్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అయితే, వరుసగా రెండు ఓవర్లు వేయకూడదు. తద్వారా ఏ ఒక్క బౌలరు కూడా గరిష్టంగా ఇన్నింగ్స్ లోని మొత్తం ఓవర్లలో సగాని (+1) కంటే ఎక్కువ వెయ్యకుండా పరిమితం చేస్తారు. టెస్ట్ ఇన్నింగ్స్‌లో (డ్రింక్స్, భోజన విరామం, టీ విరామాలు, రోజు ముగింపు, మరుసటి రోజు ప్రారంభం) పరంగా కూడా ఈ నియమం వర్తిస్తుంది. మునుపటి మ్యాచ్ ముగిసాక, తదుపరి మ్యాచ్ ప్రారంభమైనప్పుడు మాత్రమే ఈ నియమాన్ని ఉల్లంఘించవచ్చు.