బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (BCom) వాణిజ్యం, ఆర్థికం, గణితం, వ్యాపార నిర్వహణ మొదలైన శాస్త్రాలు ప్రధానంగా అభ్యసించే ఒక అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఈ డిగ్రీని పూర్తి చేయడానికి సాధారణంగా మూడేళ్ళు పడుతుంది. కొన్ని దేశాలలో నాలుగేళ్ళు కూడా పడుతుంది.
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ విద్యార్థులకు అనేక రకాల నిర్వహణ నైపుణ్యాలను అందించడానికి రూపొందించబడింది.[1] అంతే కాకుండా ఏదైనా నిర్ధిష్ట వ్యాపారానికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించడం కూడా ఇందులో భాగం.[2] అందువల్ల, చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులో ప్రధానమైన వాణిజ్య శాస్త్రంతో పాటు, సాధారణ వ్యాపార సూత్రాలు, ఖాతా పద్దులు, పెట్టుబడులు, ఆర్థికశాస్త్రం, వ్యాపార నిర్వహణ, మానవ వనరులు ఇంకా మార్కెటింగ్‌లో కోర్సులను తీసుకుంటారు. ఇంకా వ్యాపార గణాంకాలు, గణితం, సమాచార వ్యవస్థలలో పునాది కోర్సులు అవసరం.
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (హానర్స్) మరింత ఉన్నతమైనది. ఇందులో ఒక స్పెషలైజేషన్ అంశం ఉంటుంది. విద్యార్థి వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లేదా ఒక రంగంలో లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. దీనికి అదనపు అకడమిక్ కోర్సులు పూర్తి కావాలి. సాధారణంగా ఉన్నత విద్యా పనితీరు ప్రమాణాలు అవసరం. థీసిస్ కూడా సమర్పించవలసిన అవసరం కావచ్చు. ఇది తరచుగా మాస్టర్ ఆఫ్ కామర్స్ (M.Com), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) డిగ్రీలతో సహా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల మధ్య వారధిలా పనిచేస్తుంది.
బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ మొదటిసారిగా బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆంగ్లేయుడు విలియం ఆష్లే టొరంటో విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో కొద్ది రోజులు పని చేసి మళ్ళీ ఇంగ్లండుకు తిరిగివచ్చి బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ కామర్స్ ని ప్రారంభించాడు. దీని తర్వాత ఆంగ్లేయుల పాలనలో ఉన్న చాలా దేశాల్లో బీకాం డిగ్రీ ప్రారంభించబడింది.