భగీరథ | |
---|---|
దర్శకత్వం | రసూల్ ఎల్లోర్ |
రచన | రసూల్ ఎల్లోర్ |
నిర్మాత | మల్లిడి సత్యనారాయణ రెడ్డి |
తారాగణం | రవితేజ శ్రీయ ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం హేమ విజయ కుమార్ జీవా నాజర్ వేణు మాధవ్ సునీల్ ఫిష్ వెంకట్ |
ఛాయాగ్రహణం | సునీల్ రెడ్డి |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | అక్టోబరు 13, 2005 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భగీరథ రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] ఇందులో రవితేజ, శ్రీయ ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, విజయ్ కుమార్, నాజర్ తదితరులు నటించారు.[3]
గోదావరి జిల్లాలో కృష్ణలంక అనేది ఒక కుగ్రామం. ఆ ఊరికి వెళ్ళాలంటే కేవలం పడవలపైనే వెళ్ళాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించనపుడు ఆ ఊరి ప్రజలు చాలా మంది అలా ప్రయాణించేటపుడు ప్రమాదాల బారిన పడుతుంటారు. అదే గ్రామంలో ఉండే ధనవంతుడు, ఆ ఊరి సర్పంచియైన బుల్లెబ్బాయి (విజయకుమార్) ఆ గ్రామానికి ఒక వంతెన నిర్మిస్తే బాగుంటుందని అనుకుంటాడు. అందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకుని అదే గ్రామంలో నుంచి వెళ్ళి వ్యాపారిగా స్థిరపడిన వెంకటరత్నం (ప్రకాష్ రాజ్)ను అభ్యర్థిస్తాడు. 20 సంవత్సరాలు గడిచినా వెంకటరత్నం ఆ మాతే ఎత్తడు. అసలు ఆ సంగతే పూర్తిగా మరిచిపోతాడు. దాన్ని గురించి కనుక్కోమని బుల్లెబ్బాయి తన కొడుకు చందు (రవితేజ)ను అక్కడికి హైదరాబాదు వెళ్ళి వెంకటరత్నంను కలుసుకోమంటాడు.
హైదరాబాదుకు వచ్చి వెంకటరత్నంను కలుసుకున్న చందు వెంకటరత్నం పూర్తిగా డబ్బు మనిషిగా మారిపోయాడనీ తన ఊరి గురించి పూర్తిగా మరిచిపోయాడనీ తెలుసుకుంటాడు. దాంతో అతని మనసు మార్చాలని నిర్ణయించుకుంటాడు. కొద్ది రోజులు నిరుద్యోగిగా కాలం గడిపిన చందు దుర్గా ప్రసాద్ అనే వ్యాపారవేత్త సహకారంతో తను కూడా మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించి వెంకటరత్నంకి పోటీగా ఎదుగుతాడు. దుర్గా ప్రసాద్ కూతురైన శ్వేత (శ్రీయ) కూడా అతనికి తనెవరో తెలియకుండా సహకరిస్తుంది. చందు అనేక మలుపుల తర్వాత వెంకటరత్నంను తన బాధ్యతను తెలియజెప్పి తన ఊరికి తీసుకెళ్ళడంతో కథ ముగుస్తుంది.
2005 అక్టోబరు 13న విడుదలైన[4] ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.
చక్రి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. చక్రి, కార్తీక్, రవివర్మ, హరిహరన్, శ్వేత పండిట్, శంకర్ మహదేవన్, కౌసల్య తదితరులు పాటలు పాడారు.[5]
పాట | పాడినవారు | రాసిన వారు |
---|---|---|
ఓ ప్రేమ నువ్వే ప్రాణం | కార్తీక్, శ్వేతా పండిట్ | చంద్రబోస్ |
పో పో పోవే | చక్రి | భాస్కర భట్ల |
ప్రపంచమే కాదన్నా | శంకర్ మహదేవన్ | చంద్రబోస్ |
ఎవరో ఎవరో | హరిహరన్, కౌసల్య | చంద్రబోస్ |
దిల్ సే కర్నా | రవివర్మ | కందికొండ |
నారింజ పులుపు నీది | చక్రి, టీనా కమల్ | భాస్కర భట్ల |