డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం 1915, 1915లో భారత గవర్నర్ జనరల్ అమలు చేసిన అత్యవసర క్రిమినల్ చట్టం. దీనిని డిఫెన్స్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం లోను, ఆ తరువాతా జాతీయ వాదుల, విప్లవకారుల కార్యకలాపాలను అదుపు చేసేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు. [1] ఇది బ్రిటిష్ డిఫెన్స్ ఆఫ్ ది రియల్మ్ యాక్ట్స్ మాదిరిగానే ఉంది. ఈ చట్టం, ముందస్తుగా నిర్బంధించడం, విచారణ లేకుండా నిర్బంధించడం, రచన, వాక్కు, కదలికలను నిరోధించడం వంటి విస్తృతమైన అధికారాలను కార్యనిర్వహణా వ్యవస్థకు ఇచ్చింది. అయితే, హానికరమైన సంఘాలు లేదా హానికరమైన మూలాలున్న వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఆంగ్ల చట్టాల లాగా కాకుండా, డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం రాజుకు సంబంధించిన ఏ విషయానికైనా వర్తింపజేయవచ్చు. [2] ఆ చట్టాన్ని భారతీయులపై అడ్డూ అదుపూ లేకుండా ప్రయోగించారు. వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని అనధికారిక భారతీయ సభ్యులు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా సమర్థించారు. విధ్వంసకర జాతీయవాద హింస నుండి బ్రిటిష్ భారతదేశాన్ని రక్షించడానికి ఇది అవసరమని భావించారు. 1915లో విఫలమైన గదర్ కుట్ర తర్వాత మొదటి లాహోర్ కుట్ర విచారణ సమయంలో ఈ చట్టాన్ని మొదటిసారిగా అమలు చేసారు. పంజాబ్‌లో గదర్ ఉద్యమాన్ని, బెంగాల్‌లో అనుశీలన్ సమితినీ అణిచివేయడంలో ఈ చట్టం కీలకపాత్ర పోషించింది. [3][4] అయితే, నిజమైన రాజకీయ చర్చను అణిచివేసేందుకు దాన్ని విస్తృతంగా, విచక్షణారహితంగా ఉపయోగించడం వలన దాని పట్ల తీవ్రమైన ప్రజావ్యతిరేకత వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రౌలట్ చట్టం రూపంలో ఈ చట్టాన్ని పొడిగించేందుకు చేసిన ప్రయత్నాన్ని వైస్రాయ్ కౌన్సిల్‌లోని అనధికారిక భారతీయ సభ్యులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. రాజకీయ అసంతృప్తికి, జాతీయవాద ఆందోళనలకూ ఇది చిచ్చుగా మారి, రౌలట్ సత్యాగ్రహంతో ముగిసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం 1939 గా ఈ చట్టాన్ని తిరిగి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని స్వతంత్ర భారతదేశం అనేక సవరించిన రూపాల్లో ఉపయోగించుకుంది. చైనా-భారత యుద్ధం, బంగ్లాదేశ్ సంక్షోభం, 1975 ఎమర్జెన్సీ, ఆ తరువాత పంజాబ్ తిరుగుబాటుతో సహా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఉపయోగించింది.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనపుడు భారతీయులు తిరుగుబాటు చేస్తారేమోనే బ్రిటిషు వారి భయాలకు విరుద్ధంగా ప్రధాన స్రవంతి రాజకీయ నాయకత్వం నుండి బ్రిటన్‌కు అపూర్వమైన మద్దతులభించింది. సైనికులను, వనరులనూ అందించి భారతదేశం, బ్రిటిషు యుద్ధ సన్నాహాలకు భారీగా సహకరించింది. సుమారు 13 లక్షల మంది భారతీయ సైనికులు, కార్మికులు ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో పనిచేశారు. భారత ప్రభుత్వం, సంస్థానాధీశులు ఇద్దరూ పెద్ద మొత్తంలో ఆహారం, డబ్బు, మందుగుండు సామగ్రినీ పంపారు. అయితే, బెంగాల్, పంజాబ్‌లు వలసవాద వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ప్లేగు వ్యాధి, ధాన్యం ధరలు పెరగడం, బ్రిటీష్ సామ్రాజ్యంలోని వలస విధానాల పట్ల అసంతృప్తి ( కొమగాట మారు వ్యవహారం ద్వారా ఇది వెలుగు లోకి వచ్చింది), యుద్ధంలో బ్రిటను వెనుకంజ గురించి వచ్చిన పుకార్లు తదితరాల వలన పంజాబ్ అస్థిర స్థితిలో ఉంది. [5] కేంద్ర శక్తులపై దండయాత్ర చెయ్యాలంటే పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మాత్రమే మార్గాలుండడంతో భారతదేశం వాటికి చాలా దూరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తటస్థంగా ఉన్నంత వరకు, NWFP లోని తెగలు నియంత్రణలో ఉన్నంత వరకూ భారతదేశం సురక్షితంగానే ఉంటుందని యుద్ధం ప్రారంభంలో భారత ప్రభుత్వం ఊహించింది. [6] ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం, బెంగాలీ విప్లవ కార్యకలాపాలు, పంజాబ్‌లోని గదర్, ఒట్టోమన్ ఉమ్మా పట్ల సానుభూతి చూపే భారతీయ ముస్లింలు వగైరాలు ప్రేరేపించే అంతర్గత అశాంతి కారణంగా అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. [7]
గదర్ పార్టీ, జర్మనీలోని బెర్లిన్ కమిటీ తోటి, ప్రచ్ఛన్న భారతీయ విప్లవకారుల తోటి సమన్వయం చేస్తూ విప్లవం కోసం, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో తిరుగుబాటు కోసం ఉద్దేశించి అమెరికా, తూర్పు ఆసియా నుండి భారతదేశానికి వ్యక్తులను, ఆయుధాలనూ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉత్తర అమెరికాలోని బ్రిటీష్ నిఘా వర్గాలు యుద్ధం ప్రారంభంలోనే సూచించాయి. 1914 ఆగస్టు నుండి, భారతదేశంలో తిరుగుబాటును ప్రేరేపించడానికి గదర్ నాయకుల ప్రణాళికల ప్రకారం పెద్ద సంఖ్యలో సిక్కు ప్రవాసులు కెనడా, అమెరికాల నుండి భారతదేశానికి బయలుదేరారు. అదే సమయంలో బెంగాల్లో జాతీయవాద నేరాలు కూడా పెరిగాయి. [8] డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ చీఫ్ చార్లెస్ క్లీవ్‌ల్యాండ్ ఇప్పటికే భారతదేశంలో ఉన్న గద్దర్ కార్యకర్తలతోటి, తిరిగి వస్తున్న వారితోటీ కటువుగా వ్యవహరించడం ద్వారా భారతదేశానికి ఎదురౌతున్న ముప్పును ఎదుర్కోవాలని సూచించాడు. [9] ఈ క్రమంలో, గదర్ల రాకను పరిమితం చేయడానికి బ్రిటిషు ప్రభుత్వం 1914లో భారత్ లోకి ప్రవేశ నిరోధం చట్టాన్ని తెచ్చింది. [10] కానీ ఈ ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైంది. 1915 ఫిబ్రవరిలో ప్రణాళికాబద్ధమైన తిరుగుబాటు చివరి నిమిషంలో నివారించబడింది.
ఈలోగా, బెంగాల్ విప్లవకారులకు పెద్ద మొత్తంలో తుపాకీలను అందజేసిన జూగాంతర్ రోడ్డా కంపెనీ దాడి తరువాత బెంగాల్‌లో పరిస్థితి గణనీయంగా దిగజారింది. 1915లో 36 దౌర్జన్యాలు జరిగాయి. 1913లో 13, 1914లో 14 నుండి ఇవి వేగంగా పెరిగాయి. ఆగ్రహావేశాలు పెరిగాయి. కొంతమంది చరిత్రకారులు చెప్పినట్లు విప్లవకారులు "నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో భయానక పరిస్థితి" సృష్టించారు. "పరిపాలనను స్తంభింపజేసే తమ ముఖ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా వచ్చారు." భయంతో కూడిన సాధారణ వాతావరణం పోలీసులను, న్యాయస్థానాలనూ చుట్టుముట్టి, ఆత్మ విశ్వాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. [11] 1915 మొత్తంలో, కేవలం ఆరుగురు విప్లవకారులను మాత్రమే విజయవంతంగా విచారించారు.
1915 మార్చి 19 న వైస్రాయ్ కౌన్సిల్‌లో అంతర్గత వ్యవహారాలు చూసే సర్ రెజినాల్డ్ క్రాడాక్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టగా, దాన్ని ఒకే సమావేశంలో ఆమోదించారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలానికీ, అది ముగిసాక ఆరు నెలల కాలానికీ మాత్రమే అమల్లో ఉండే తాత్కాలిక చట్టంగా తెచ్చారు. ఈ చట్టం గవర్నర్ జనరల్‌కు నిబంధనలను రూపొందించే అధికారాన్ని ఇచ్చింది.
బ్రిటిషు భారతదేశపు ప్రజల భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దీన్ని సాధించడం కోసం ప్రభుత్వ సిబ్బందికి, ఇతర వ్యక్తులకూ అవసరమైన అధికారాలు విధులకు సంబంధించి...
ముఖ్యంగా గదర్ ముప్పు నేపథ్యంలో, మైఖేల్ ఓ'డ్వైర్ ఈ చట్టాన్ని ఆమోదింపజేసేందుకు గణనీయమైన ఒత్తిడి తెచ్చాడు. శాసన సభలో సర్ సురేంద్రనాథ్ బెనర్జీకి సమాధానమిస్తూ, చట్టం అమలు చేసేందుకు వ్యవహరించే న్యాయపరమైన పాత్ర వహించే సలహా బోర్డును ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని, ఔచిత్యాన్నీ క్రాడాక్ తిరస్కరించాడు. ఈ విషయంలో ఈ చట్టం డిఫెన్స్ ఆఫ్ ది రియల్మ్ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ చట్టంలోని నిర్బంధ చర్యలు "నివారించేవే గానీ శిక్షించేవి కావు" కాబట్టి, న్యాయపరమైన పర్యవేక్షణ, సలహా లేకపోవడం ఆమోదనీయమేనని క్రాడాక్ అసెంబ్లీకి వివరించారు. [12]
ఈ చట్టాన్ని యుద్ధ కాలానికి, ఆ తర్వాత ఆరు నెలల పాటు "ప్రజా భద్రత" కోసం, "బ్రిటిష్ భారతదేశపు రక్షణ" కోసమూ తెచ్చారు. శత్రువుతో సంప్రదింపులు జరపడం, శత్రువు నుండి సమాచారాన్ని పొందడం, పుకార్లను వ్యాప్తి చేయడం, ప్రభుత్వ యుద్ధ ప్రయత్నాలకు అవరోధంగా ఉండే కార్యకలాపాలను చట్టవిరుద్ధం చేసింది. సామ్రాజ్య భద్రతకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినవారిని నిరవధికంగా, విచారణే లేకుండా నిర్బంధించడానికీ, "ఏ మాత్రం అనుమానమున్న" వ్యక్తులనైనా ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించడానికీ ఈ చట్టం వీలు కల్పించింది. [13] చట్టంలో సూచించిన నేరాలకు పాల్పడడం లేదా అందుకు కుట్ర చేయడంతో పాటు మరణ శిక్ష, బహిష్కరణ లేదా కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించే నేరాలు ఈ చట్ట పరిధి లోకి వస్తాయి. [14] DORA లాగా కాకుండా ఇందులో నిర్బంధించే అధికారం సబార్డినేట్ అధికారులకు ఉంది. క్రిమినల్ ప్రొసీజర్స్ యాక్ట్ 1898 లేదా 1908 క్రిమినల్ చట్ట సవరణ కింద ఇప్పటికే జరుగుతున్న విచారణలకు ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ ప్రొసీజర్స్ యాక్ట్ 1898లో సూచించిన విధానాలను అనుసరించాలి. కానీ ప్రత్యేక అధికారాలు, కోర్టు విచక్షణ వీటిని అధిగమించవచ్చు. అయితే, ఆరోపించబడిన నేరాల గురించి కమిషనర్లు నేరుగా తెలుసుకోవచ్చు. తద్వారా ప్రాథమిక పద్ధతులను అతిక్రమించవచ్చు.
హైకోర్టు న్యాయమూర్తుల స్థాయి కంటే తక్కువగా ఉండే ముగ్గురు కమీషనర్లను విచారణల కోసం నియమించే అధికారాన్ని ఈ చట్టం స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చింది. కనీసం ఇద్దరు సెషన్స్ న్యాయమూర్తులు లేదా అదనపు సెషన్స్ న్యాయమూర్తులుగా కనీసం మూడేళ్లపాటు ఉంటారు, మెజారిటీ తీర్పు ఆమోదయోగ్యమైనది.
ఈ చట్టం ప్రకారం, ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషను లేకుండా మేజిస్ట్రేట్‌లు నమోదు చేసిన సాక్ష్యాలను కమీషనర్లు ఆమోదించవచ్చు. 1872 నాటి భారతీయ సాక్ష్యం చట్టం నిర్వచించే సాక్ష్యాల ప్రమాణాలను ఇది అధిగమించింది. అంతేకాకుండా సాక్షి అందుబాటులో లేనప్పుడు లేదా చనిపోయిన సందర్భంలో రికార్డు చేసిన సాక్ష్యాన్ని ఆమోదించే అధికారాలను ఈ చట్టం కమీషనర్లకు కల్పించింది. తద్వారా సాక్షులను విప్లవకారుల బెదిరింపులు, హత్యల నుండి రక్షించడానికి ఉద్దేశించారు. ఈ చట్టం ప్రకారం జ్యూరీ విచారణ కోరే హక్కు లేదు. కమిషనర్ల నిర్ణయాలపై అప్పీలుకు వెళ్ళడం లేదా న్యాయపరమైన సమీక్ష కోరడాన్ని ఈ చట్టం కల్పించలేదు.
శాంతిభద్రతలను నెలకొల్పడానికి, విప్లవోద్యమాన్ని అడ్డుకోడానికీ రూపొందించబడినప్పటికీ, ఆచరణలో ఈ చట్టం విప్లవకారులను పరిమితం చేయడం నుండి, మతపరమైన హింసకు పాల్పడేవారిని అరెస్టు చేయడం ద్వారా, మితవాద రాజకీయ నాయకుల గొంతు నొక్కడం వరకూ విస్తృత స్థాయిలో ఉపయోగించారు. డిఫెన్స్ ఆఫ్ ది రియల్మ్ యాక్ట్ వలె కాకుండా, ఈ చట్టం రాజుకు సంబంధించిన ఏ విషయానికి వ్యతిరేకంగానైనా వర్తిస్తుంది. 1917 జూన్ నాటికి, 705 మంది ఈ చట్టం కింద గృహ నిర్బంధంలో ఉన్నారు. అలాగే రెగ్యులేషన్ III కింద 99 మంది జైలు శిక్షలు అనుభవించారు. యుద్ధకాలంలో, ఒక్క డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కిందనే 1400 పైచిలుకు వ్యక్తులను భారతదేశంలో నిర్బంధించారు. మరో మూడు వందల మంది చిన్న శిక్షలకు గురయ్యారు. రెండు వేలకు పైగా వ్యక్తులు, భారతదేశం లోకి ప్రవేశం ఆర్డినెన్స్ పరిమితులకు లోబడి ఉన్నారు.[15]
1915 భారత రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సమయంలో, భారత రాజకీయ ఉద్యమంలోని మితవాద నాయకుల నుండి గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని భారతీయ నాన్-ఆఫీషియేటింగ్ సభ్యుల నుండి సర్వత్రా ఈ చట్టానికి మద్దతు లభించింది. బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు భారతదేశంలో ప్రజలు మద్దతు పలికారు. యుద్ధ పరిస్థితిలో ఈ చర్యలు అవసరమనే అవగాహన కారణంగా ప్రజలు ఈ మద్దతు నిచ్చారు. దీని అమలు వలన భారతదేశంలో విప్లవకారుల హింస గణనీయంగా తగ్గిపోయింది. అయితే, సాధారణ జనాభా పైన, మితవాద నాయకులకు వ్యతిరేకంగానూ ఈ చట్టాన్ని ప్రయోగించడం వలన భారతీయ జనాభాలో దీని పట్ల విరక్తి చెందారు.
ఈ చట్టాన్ని అనుసరించి లాహోర్ కుట్ర విచారణ లోను, బెనారస్ కుట్ర విచారణలోను, బెంగాల్‌లోని ట్రిబ్యునల్‌లలోనూ బెంగాల్ పంజాబ్ విప్లవకారులకు 46 మరణశిక్షలు, 64 జీవిత ఖైదులు విధించారు. [16] తద్వారా ఈ చట్టం విప్లవోద్యమాన్ని సమర్థవంతంగా అణిచివేసింది. అయితే ముందస్తు నిర్బంధ అధికారాన్ని బెంగాల్లో మరింత ప్రత్యేకంగా అమలు చేసారు. విస్తృతమైన అరెస్టులు చేసి బెంగాల్ పోలీసులు కలకత్తాలోని 1916 మార్చి నాటికి ఢాకా అనుశీలన్ సమితిని అణిచివేసారు. [17] రెగ్యులేషన్ III, డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం 1916 ఆగస్టు నుండి బెంగాల్‌లో విస్తృత స్థాయిలో అమలు చేసారు. 1917 నాటికి బెంగాల్లో విప్లవ హింసా సంఘటనలు 10 కి క్షీణించాయి. [18] యుద్ధం ముగిసే సమయానికి ఈ చట్టం కింద బెంగాల్‌లో ఎనిమిది వందల మందికి పైగా నిర్బంధించబడ్డారు.
విప్లవ కార్యక్రమాలకు పాల్పడినట్లు అనుమానించిన వారిపైన మాత్రమే ఈ చట్టాన్ని అమలు ఎయ్యలేదు. ఇది క్రమంగా అనేక మంది జాతీయవాద నాయకుల గొంతును నిక్కేందుకు, వారిని అణచివేసేందుకూ ఉపయోగించారు. వారి అభిప్రాయాలు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు విద్రోహం కలిగించేవి, ప్రమాదకరమైనవి అని స్థానిక ప్రభుత్వాలు భావించిన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించాయి. [19] డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద అనేక మంది ప్రముఖ మితవాద నాయకులు నిర్బంధించబడ్డారు లేదా బహిష్కరించబడ్డారు. ఈ నాయకులలో ప్రముఖులు అన్నీ బిసెంట్. బాలగంగాధర తిలక్ బొంబాయిలోను, పశ్చిమ భారతదేశంలోనూ హోమ్ రూల్ లీగ్ను స్థాపించే సమయంలో బీసెంట్ ప్రధాన పట్టణాలు, నగరాల్లో లీగ్ శాఖలను ఏర్పాటు చేసింది. ఇవి చర్చా వేదికల కంటే పెద్దవేమీ కాకపోయినప్పటికీ, ఇవి రాజకీయ కరపత్రాలను ప్రచురించేవి. 1916లో దాదపు 46,000 పత్రాలను విక్రయించడం గమనార్హం. గ్రంథాలయాలను కూడా స్థాపించారు. అక్కడ రాజకీయ పత్రాలు, గ్రంథాలూ అందుబాటులో ఉండేవి. 1917 నాటికి లీగ్‌లో 27,000 మంది సభ్యులు ఉన్నారు. అదే సంవత్సరం తిలక్, బీసెంట్‌ల కార్యకలాపాలు విధ్వంసకరమౌతున్నాయనే కారణంతో ఇరువురినీ ఈ చట్టం కింద నిర్బంధించారు. మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీలు కాబూల్‌లో జర్మన్ మిషన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించి, వారిని నిర్బంధించారు. ఇది విస్తృత భారత ఇస్లామిక్ విప్లవాన్ని ప్రచారం చేయడమేనని ప్రభుత్వం అనుమానించింది. [20] అల్ బాలాగ్‌లో రాసినందుకు అబుల్ కలాం ఆజాద్‌ను బెంగాల్ నుండి బహిష్కరించి, రాంచీలో గృహనిర్బంధంలో పెట్టారు.
భారత రక్షణ చట్టం అమలు చేస్తున్న పద్ధతి పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే, 1917లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ చట్టపు దుర్వినియోగంపై ఆందోళనను వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని వినియోగం రాజ్య రక్షణ చట్టం లాగా, అదే సూత్రాలపై ఆధరపడి ఉండాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. [21] అమృత్‌సర్ ఊచకోతపై నివేదిక రాసినందుకు గాను బెంజమిన్ హార్నిమాన్‌ను యుద్ధం ముగిసిన వెంటనే బొంబాయి ప్రెసిడెన్సీ నుండి బహిష్కరించారు.