భారతదేశంలో సైన్యం గురించిన ప్రస్తావనలు వేల సంవత్సరాలకిందటి వేదాల లోను, రామాయణ, మహాభారతాల లోను కనిపిస్తాయి. ప్రాచీన కాలంనుండి, 19వ శతాబ్దం వరకూ, భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల నుండి చిన్నచిన్న భూభాగాలను ఏలిన రాజుల వరకు, రాజ్యంకోసం, అధికారంకోసం యుద్ధాలు చేసారు. సా.శ. 19 వ శతాబ్దంలో బ్రిటీషువారు, భారతదేశంలో తమ వలసరాజ్యాన్ని స్థాపించారు. ప్రస్తుత భారతసైన్యానికి ముందు, మూడు ప్రెసిడెన్సీలు పోషించిన సిపాయి సమూహాలు, స్థానిక కాల్బలాలు, అశ్వదళాలు, ఉండేవి. సా.శ. 19వ శతాబ్దంలో, ముందున్న ప్రెసిడెన్సీల సైన్యాన్నీ, ఒకే గొడుగు కిందకి తెచ్చి, భారత సైన్యాన్ని ఏర్పరిచారు. బ్రిటీషు భారత సైన్యం, రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, కొన్ని యుద్ధకాల ప్రత్యేక దళాలు రద్దుచేయబడ్డాయి. అటుపైన, భారత-పాకిస్తాన్ విభజనలో సైనికబలాలు కూడా పంచబడ్డాయి. భారత రక్షణ బలాలు, మూడు భారత-పాకిస్తాన్ యుద్ధాలలోను, భారత-చైనా యుద్ధంలోనూ పాల్గొన్నాయి. సా.శ. 1999లో భారత సైన్యం, పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం కూడా చేసింది. ఐక్య రాజ్య సమితి యొక్క శాంతిస్థాపన కార్యక్రమాల్లో, భారత రక్షణ దళాలు అనేకమార్లు పాల్గొన్నాయి. ఐరాస శాంతిదళాల సంఖ్యాపరంగా భారత రక్షణ దళాలు రెండోస్థానంలో ఉన్నాయి.
ఇండో-ఆర్యన్ల ఋగ్వేద తెగలు, ‘రాజు’ అనిపిలవబడే తమ నాయకుల ఆధ్వర్యంలో, తమలో తాము, ఇతర తెగలతోనూ యుద్ధాలు చేసేవారు. ఋగ్వేదంలో వర్ణించినట్టు వీరు కంచు ఆయుధాలు, గుఱ్ఱాలు లాగే రథాలు వాడేవారు. యుద్ధంలో లభించిన ‘కొల్లసొమ్ము’ (ముఖ్యంగా పశుసంపద)లో సింహభాగం తెగనాయకునికి చేరేది. ఈ వీరులందరూ క్షత్రియ వర్ణానికి చెందినవారు. ఋగ్వేదానంతర కాలం (ఇనుప యుగం - క్రీ.పూ 1100-500)లో వచ్చిన వేదాలలోనూ, ఇతర సాహిత్యంలోనూ, సైన్యం గురించి తొలిప్రస్తావనలు కనిపిస్తాయి. గజబలం యొక్క తొలి ప్రస్తావనలు ఈ కాలంనాటివే.[1] భారతదేశపు గొప్ప ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు, మహా జనపదాలు ఏర్పడుతున్న కాలంనాటి సైనికనిర్మాణాలు, యుద్ధరీతులు, ఆయుధాల గురించి వర్ణనలు కలిగి ఉంటాయి. యుద్ధ రథాలు, గజబలాలు, వైమానిక దళాల గురించి కూడా వర్ణనలు ఉన్నాయి. మహాభారతంలో యుద్ధవ్యూహాలు (పద్మ వ్యూహం, క్రౌంచ వ్యూహం ఇత్యాది) గురించి కూడా వర్ణనలున్నాయి.
సామ్రాజ్యపిపాసి అయిన బింబిసారుడు, అంగ రాజ్యాన్ని ఆక్రమించడమే కాక, తన రాజధాని రాజగృహం యొక్క సైనికబలగాన్ని పెంచాడు. అతని కుమారుడు అజాతశత్రువు, లిచ్ఛవుల రాజ్యముపై దండయాత్ర చేసేందుకు వీలుగా, మగధ కొత్త రాజధాని పాటలీపుత్రంలో కొత్తకోటను నిర్మించాడు. అతను ఉపయోగించిన కొత్త ఆయుధాలు, కవణాలు (రాళ్లు విసిరే బండ్లు), గదలు తిరిగే రథాలు (నేటి యుద్ధ ట్యాంకుల వంటివి) గురించి జైన గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నాయి.
క్రీ.పూ 4వ శతాబ్దంలో, మగధ రాజ్యాన్ని పరిపాలించిన నంద వంశం ఉచ్ఛ స్థితిలో ఉన్నపుడు, తూర్పున బెంగాల్ నుండి, పశ్చిమాన పంజాబ్ వరకూ, దక్షిణాన వింధ్య పర్వతాల వరకు వ్యాపించి ఉండినది. క్రీ.పూ 327 సంవత్సరంలో అలెగ్జాండర్ పంజాబ్ లోకి చొచ్చుకుని వచ్చాడు. తక్షశిల పాలకుడు, అంభి తన రాజ్యాన్ని అలెగ్జాండరుకు సమర్పించాడు. క్రీ.పూ 326 సంవత్సరంలో, భారతీయ రాజు, పోరస్ లేదా పురుషోత్తముడుతో, జీలం నది వద్ద యుద్ధం చేశాడు. యుద్ధానంతరం పురుషోత్తమునితో సంధి చేసుకుని, అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చివేశాడు. పురుషోత్తముని రాజ్యానికి తూర్పున, నందుల పాలనలో శక్తివంతమైన మగధ సామ్రాజ్యం ఉండినది.
జీలం నది వద్ద యుద్ధం జరుగుతున్న కాలానికి, నందుల వద్ద 200000 కాల్బలం, 80,000 అశ్వదళం, 8000 రథాలు, 6000 యుద్ధగజాలు ఉన్నాయని విన్న అలెగ్జాండర్ సేనలు, ముందుకెళ్ళడానికి సాహసించలేదు.
సెల్యుకిడ్ సామ్రాజ్య (గ్రీకుల) రాయబారి మెగస్తనీస్ ప్రస్తావన ప్రకారం, చంద్రగుప్తుని సైన్యంలో 30,000 అశ్వికబలం, 9000 యుద్ధగజాలు, 600000 కాల్బలం ఉన్నాయి. భారత ఉపఖండంలో చాలాభాగాన్ని చంద్రగుప్తుడు ఆక్రమించాడు. భారతదేశం పైకి ఆక్రమణకి పూనుకున్న సెల్యూకిడ్ సామ్రాజ్య స్థాపకుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించడమేకాక, సింధు నదికి తూర్పున ఉన్న భూభాగాలను కూడా ఆక్రమించాడు. అటుపైన దక్షిణంవైపు దండెత్తి, మధ్య భారతదేశాన్ని కూడా తన ఏలుబడిలోనికి తెచ్చుకున్నాడు. ఇతని సైన్యంలో కాల్బలం, అశ్వదళం, గజబలం, రథికులు, నావికాదళం, రవాణా అనే ఆరు విభాగాలకి ఆరుగురు అధిపతులకూడిన వ్యవస్థ ఉండేది. కాల్బలం వెదురుబొంగులతో చేసిన ధనుస్సుని, పిడి కలిగిన చేతికత్తులు ఒకటి-రెండు కలిగి ఉండేవి. ఇతర పదాతి దళాలు తోలు డాలునీ, ఈటె గానీ బల్లెంగాని కలిగి ఉండేవారు. ఏనుగుల తలపైన, మావటివాడు, వెన్నుపైన ధనుర్దారులుగానీ, బల్లెపుగాళ్ళు గానీ ఉండేవారు. గ్రీకులు కనుగొన్న అంబారీ, ఏనుగులపైన ఉండకపోవచ్చు. రథాల వినియోగం తగ్గినప్పటికీ, వాటి ప్రతిష్ఠ మూలంగా సైన్యంలో కొనసాగాయి.
క్రీ.పూ, 185లో ఆఖరి మౌర్య పాలకుణ్ణి చంపి, సేనాధిపతి పుష్యమిత్రుడు సింహాసనాన్ని అధిష్టించి, శుంగ వంశాన్ని స్థాపించాడు.
క్రీ.పూ 180 సంవత్సరంలో, బాక్ట్రియా దేశపు ఇండో-గ్రీకు రాజు దెమెత్రియస్-1 కాబూల్ లోయని ఆక్రమించడమే కాక, సింధు ప్రాంతాన్ని కూడా తన ఏలుబడిలోనికి తెచ్చుకున్నాడు. మరో ఇండో-గ్రీకు రాజు మెనాండర్, ఇతర భారతీయ రాజులతో కలిసి (లేదా కలుపుకుని) పాటలీపుత్రం పైన దండయాత్ర చేసాడు. ఈ దండయాత్ర జరిగిన క్రమం, జయపజయాలు గురించి సమాచారం లేదు.
ఇండో-గ్రీకు రాజ్యంతో శుంగవంశపు యుద్ధాలు, చరిత్రలో గొప్పగా వర్ణించబడ్డాయి. వీరు శాతవాహనులతోనూ, కళింగులతోనూ, ఇండో-గ్రీకులతోనూ (మథురులు, పాంచాలురు) యుద్ధాలు చేసినట్టు ఆధారాలున్నాయి. పుష్యమిత్రుడు రెండు అశ్వమేధ యజ్ఞాలను చేసినట్టు తెలుస్తున్నది. శుంగ సామ్రాజ్యపు శాసనాలు జలంధర్లో కూడా లభించాయి. పంజాబ్ (పాకిస్తాన్) లోని, సియాల్ కోట్ వరకు వీరి పాలన విస్తరించినట్టు ఆధారాలు ఉన్నాయి. మగధ సామ్రాజ్యం గతంలో కోల్పోయిన మధురని, క్రీ.పూ100 సంవత్సరంలో శుంగుల పాలనలోకి వచ్చింది.
శుంగులకి, యవనులకి (గ్రీకులకి) మధ్య జరిగిన యుద్ధాలు, కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రంలో వర్ణింపబడ్డాయి. పుష్యమిత్రుని మనుమడు వసుమిత్రుడు యవనుల అశ్వదళాన్ని ఓడించడం ద్వారా, పుష్యమిత్రుడు అశ్వమేధాన్ని పూర్తిచేసినట్టు తెలుస్తున్నది.
భారతదేశపు యుద్ధకళలకి సంబంధించిన అనేక గ్రంథాలు ధనుర్వేదం, వీరవిద్యలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.
పురాణ కథల ప్రకారం, ఆంధ్రజాతికి చెందిన శాతవాహనులు, దక్షిణాపథంలో మొట్టమొదటి సామ్రాజ్యస్థాపకులు. పురాణాలలో, వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు, శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు, 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.
ఆంధ్రుల మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత, నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. క్రీ.పూ200 సంవత్సరంలో శాతవాహనులు నేటి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలో అధికారంలోకి వచ్చి, 400 యేళ్ళకిపైగా పరిపాలించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, గోవా, కర్నాటకలలో చాలా భూభాగాన్ని శాతవహనుల ఏలుబడిలో ఉండేవి. వీరి మొదటి రాజధాని కోటిలింగాల, అనంతరం ప్రతిష్ఠానపురానికి, చివరగా అమరావతికి మారింది. సామ్రాజ్య స్థాపకుడు సిముక, మహారాష్ట్ర మాళవ ప్రాంతాలను ఆక్రమించాడు. అతని తరువాత వచ్చిన అతని తమ్ముడు కన్హ (లేదా కృష్ణుడు), రాజ్యాన్ని పశ్చిమ, దక్షిణ దిక్కులలోకి మరింతగా విస్తరించాడు. అతని పిమ్మట వచ్చిన శాతకర్ణి -1, ఉత్తరభారతదేశానికి చెందిన శుంగ వంశని అంతం చేశాడు. అతని అనంతరం వచ్చిన, గౌతమీపుత్ర శాతకర్ణి, శకులను (ఇండో-సింథియన్లు), పహ్లవులను (ఇండో-పార్థియన్లు), యవనులను (ఇండో-గ్రీకులు) దండయాత్రలకి తిప్పికొట్టాడు. అతని సామ్రాజ్యంలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాళవ, పశ్చిమ రాజస్తాన్, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. అనంతరం అనేక భూభాగాలను కోల్పోయిన శాతవాహన సామ్రాజ్యం, చివరగా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మళ్ళీ ఉచ్ఛస్థితిలోనికి వచ్చినా, అతని మరణానంతరం పరిమితమై పోయింది.
మౌర్య సామ్రాజ్యం అనంతరం, కళింగని ఏలిన వంశం మహామేఘవాహన వంశం. ఈ మూడవ వంశపు మూడవ పాలకుడు ఖారవేలుడు, భారతదేశంలో చాలాభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఖారవేలుని నావికాబలగం, భారతదేశం నుండి శ్రీలంక, బర్మా, థాయ్ ల్యాండ్, కాంభోజ (కాంబోడియా), బోర్నియో, బాలి, సుమత్ర, జావా ల మధ్యనున్న వాణిజ్యమార్గాలన్నిటినీ నియంత్రించింది. ఖారవేలుడు, మగధ, అంగ, శాతవాహన రాజ్యాలపైన పలు విజయాలు సాధించాడు.
ఖారవేలుని గురించిన సమాచారం అంతా, హాథీగుంఫా శాసనాల ద్వారానే లభిస్తున్నాయి. ఈ శాసనాల ప్రకారం, ఖారవేలుడు మగధలోని రాజగృహాన్ని ముట్టడించి, యవనుల రాజు దెంత్రియస్ ను మధుర వరకు తరిమేశాడు.
గుప్తులకాలంనాటి సైన్యం రూపురేఖలని శివ ధనుర్వేదం వర్ణిస్తుంది. గుప్తులు యుద్ధగజాలపైన ఎక్కువగా ఆధారపడ్డారు. గుఱ్ఱాల వినియోగం తగ్గించారు. యవనులపైన, శకులపైన, ఇతర ఆక్రమణదారులపైన యుద్ధాలలో కలసిరాకపోవడం వల్ల, రథాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గదలు, కొరడాలతో ఆయుధాలుగా కలిగి, రింగుల కవచాలు ధరించిన అశ్వికదళం భారీసంఖ్యలో, గుప్తుల సైన్యంలో ఉండేది. శత్రువులపైన వీరు మెరుపుదాడులు చేసేవారు. వీరి కాల్బలంలో, విలుకాండ్రు కూడా ఉండేవారు. వెదురు బొంగు గానీ లోహాలతో చేసిన వింటిని ధరించేవారు. వెదురు బొంగు, లోహపు మొనలతో కూడిన బాణాలను సంధించేవారు.శత్రుగజాలపైన ఇనుప కమ్మీలను ప్రయోగించేవారు. అప్పుడప్పుడు నిప్పు చుట్టిన బాణాలు (ఆగ్నేయాస్త్రాలు) కూడా ప్రయోగించేవారు. విలుకాండ్రని పరిరక్షిస్తూండే కాల్బలం కవచాలు, బల్లేలు, పొడవాటి కత్తులు ధరించేవారు. ప్రాదేశిక జలాలను పరిరక్షించడానికి, గుప్తుల నావికాబలగం ఉండేది.
సముద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించిన తొలినాళ్లలో, షిచ్ఛత్ర పద్మావతి రాజ్యాలను ఆక్రమించాడు. అనంతరం కోట రాజ్యాన్ని కలుపుకుని మాళవ, యౌధేయ, అర్జునయన, మదుర, అభీరులపైన దాడి చేసాడు. విచ్ఛిన్న కుషాణు సామ్రాజ్యపు సామంతులను నియంత్రించాడు. సా.శ. 380 లో సముద్రగుప్తుడు, మరణించేనాటికి 20 రాజ్యాలను ఆక్రమించాడు.
చంద్రగుప్తుడు-2, భారతదేశానికి వెలుపల లోపల ఉన్న 21 రాజ్యాలను ఆక్రమించాడని, సా.శ. 4వ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి కాళిదాసు పొగిడాడు.తూర్పు పడమర దిగ్విజయ యాత్రలని పూర్తి చేసిన అనంతరం సముద్రగుప్తుడు, ఉత్తరదిశగా కదిలి పారశీకులని అణిచివేసాడు. అటుపైన వక్షు నది (అము దార్యా)కి తూర్పు, పడమరల ఉన్న హూణులను, కాంభోజులను ఓడించాడు. భారత ఉపఖండం మొత్తాన్నీ శాసించిన చంద్రగుపుడు - 2 కాలానికి గుప్తసామ్రాజ్యం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యము.
వాయవ్య సరిహద్దులనుండి ఆక్రమణకి వచ్చిన ఇండో-హెప్థలైట్స్ లేదా శ్వేతహూణులను స్కంధగుప్తుడు నిరోధించాడు. స్కంధగుప్తుడు, తన తండ్రి రాజ్యంలో సైతం హూణులతో యుద్ధాలు చేసి, గొప్ప యోధునిగా పేరుపొందాడు. మళ్ళీ, సా.శ. 455లో దురాక్రమణకి వచ్చిన హూణులను నిరోధించాడు. అయితే, మాటిమాటికీ ఆక్రమణలు, వాటిని నిరోధించే యుద్ధాలతో సామ్రాజ్య వనరులన్నీ ఖర్చు అయిపోయి, సామ్రాజ్యపతనానికి కారణమయ్యాయి.
హర్షుడు (సా.శ. 606-647) ఉత్తరభారతదేశాన్ని నలభై సంవత్సరాలపాటు ఏలిన చక్రవర్తి. ధానేసర్ ని పరిపాలించిన, హర్షుని తండ్రి, హూణులపైన విజయాల ద్వారా ప్రాముఖ్యతని గడించాడు. హర్షుడు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాలని ఉద్దేశంతో, 30 సంవత్సరాలపాటు యుద్ధాలతో గడిపి, పలువిజయాలు సాధించాడు. సా.శ.612 నాటికే ఉత్తర భారతదేశాన్ని నర్మదా నది వరకూ ఆక్రమించి, భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. సా.శ. 620లో దక్షిణాపథంపై దండెత్తిన హర్షుడు, రెండవ పులకేశిచే ఓడింపబడ్డాడు.
దక్షిణ భారతదేశాన్ని చాళుక్యులు, పల్లవులు ఒకేకాలంలో ప్రాధాన్యతని పొందారు. చాళుక్య రాజు, రెండవ పులకేశి సామ్రాజ్య కాంక్షతో సాగించిన దండయాత్రలు అలూపులు, గాంగులపైన విజయాలతో మొదలై; పల్లవ రాజు మహేంద్రవర్మన్ని ఓడించడమే కాక చేర, పాండ్యులను ఓడించాడు. ఉత్తర భారతదేశం నుండి దండయాత్రకి బయలుదేరిన, హర్షుణ్ణి నిరోధించి, అతని దిగ్విజయ యాత్రలని ఆపుచేసాడు.
పల్లవ రాజు మహేంద్రవర్మన్ కొడుకు, నరసింహవర్మన్ తండ్రి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, చాళుక్యుల రాజధాని వాతాపి/బాదామిపై దండెత్తాడు. ఆతని సేనాని పరంజోతి నాయకత్వంలో సాగిన ఈ దండయాత్రలో, నరసింహవర్మన్ చాళుక్యులని ఓడించి, రెండవ పులకేశిని వధించాడు. చాళుక్యుల రాజధాని వాతాపిని ధ్వంసం చేసి, వాతాపికొండ అనే బిరుదుని పొందాడు. అటుపైన, చాళుక్య-పల్లవుల మధ్య పగలుప్రతీకారాలు శతాబ్దానికిపైగా సాగాయి. వీరి మధ్య అనేక యుద్ధాలకి వేంగిదేశం వేదిక అయింది. చివరికి చాళుక్య రాజు, విక్రమాదిత్యుడు-3 సా.శ. 740 పల్లవులని పూర్తిగా ఓడించాడు. అటుపైన, సా.శ. 750 సంవత్సరంలో వీరి అధికారాన్ని, రాష్ట్రకూటులు కూలదోసారు. సా.శ. 970లో చాళుక్యుల వంశస్థుడు, తైలపుడు - 2, రాష్ట్రకూటుల అధికారాన్ని కూలదోసి, చాళుక్య సామ్రాజ్యాన్ని (గుజరాత్ మినహా) పునరుద్ధరించారు. వీరిని కళ్యాణి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. అధికారం కోసం వీరు, చోళులుతో పోటిపడ్డారు.
భారత ఉపఖండ పాలకులలో, దండయాత్రలకి సామ్రాజ్యవిస్తరణకి నావికాబలగాన్ని వాడిన మొట్టమొదటి పాలకులు, చోళులు. విజయాలయ చోళుడు పల్లవులను ఓడించి, తంజావూరుని స్వాధీనం చేసికొన్నాడు. సా.శ. 10వ్1 శతాబ్ది తొలినాళ్లలో, చోళరాజు పరాంతకుడు-1, పాండ్యరాజు మారవర్మ రాజసింహ-2ని ఓడించి, శ్రీలంకపైన దండెత్తాడు. అయితే, అతని కుమారుడు రాజాదిత్యుడు, సా.శ. 949లో రాష్ట్రకూట పాలకుడు మూడవ కృష్ణుని చేత ఓడింపబడి, వధింపబడ్డాడు.
సా.శ. 970-85లో పరిపాలించిన ఉత్తమ చోళుని పరిపాలనాకాలంలో సైనికులు, నడుముకి కిందివరకు కవచపు కోటులని ధరించినట్టు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. అనంతరం వచ్చిన రాజరాజ చోళుడు, కండలూరు యుద్ధం నుండి దండయాత్రలని ప్రారంభించాడు. విలీనం పట్టణాన్ని, శ్రీలంకలో కొంత భాగాన్ని పరిపాలిస్తున్న అమర భుజంగుడనే పాండ్య రాజుని బంధించాడు. పాలనకి వచ్చిన 14వ యేట, మైసూరు గాంగులని, బళ్లారి తూర్పు మైసూరులని ఏలుతున్న నోళంబులని, తాడగైపాడి, వేంగి, కూర్గ్ లను, దక్షిణాపథాన్ని ఏలుతున్న చాళుక్యుల రాజ్యాలను ఆక్రమించాడు. తరువాతి మూడేళ్లలో, కుమారుడు రాజేంద్ర చోళుడు -1 సాయంతో, కొల్లం రాజ్యాన్ని, ఉత్తరాన కళింగ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అటుపైన, రాజేంద్ర చోళుడు -1, శ్రీలంకని పూర్తిగా అక్రమించడమేకాక ఉత్తరాన గంగా నది దాటి రాజ్య విస్తరణ చేసి గంగైకొండఅనే బిరుదుని ధరించాడు. కళింగ గుండా బెంగాల్ వరకు దిగ్విజయయాత్ర చేసాడు. తన దిగ్విజయ యాత్రకి గుర్తుగా సా.శ. 1025సంవత్సరంలో గంగైకొండచోళపురం అనే కొత్త రాజధాని నగరాన్ని కట్టించాడు. సుమారు 250 సంవత్సరాలపాటు ఈ నగరం దక్షిణభారతదేశాన్ని శాసించింది. రాజేంద్ర చోళుడు దండయాత్రకి పంపిన భారీ నావికాదళం, తన నావికాదండయాత్రలో జావా, మలేసియా, సుమత్రా దీవులని ఆక్రమించింది. చోళుల అనంతరం, పడమరన హోయసాలులు, దక్షిణాన పాండ్యులు స్వతంత్రులైనారు.
సా.శ. 9వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట చక్రవర్తి, ప్రపంచంలో నాలుగు శక్తివంతమైన రాజులలో ఒకడని, అరబ్ పండితుడు సులేమాన్ వర్ణించాడు.[3] సా.శ. 9వ శతాబ్దంలో, దేవపాలుడు, గుర్జర-ప్రతీహారులపైన దాడిచేశాడు. మిహిరభోజుని నాయకత్వాన ప్రతీహారులు వారి సామంతులు నారాయణపాలుని ఓడించారు.
గుర్జర-ప్రతీహార రాజు భోజునికి రాష్ట్రకూట రాజు కృష్ణుడు-2 కి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాతికాలంలో రాష్ట్రకూట రాజు, ఇంద్రుడు-3 కనౌజ్ పైన దాడిచేసినపుడు మహిపాలుడు పలాయనం చిత్తగించాడు.
సా.శ.915 సంవత్సరం మహిపాలుని పాలనలో 8లక్షలుగా ఉన్న గుర్జర-ప్రతీహార సైన్యం, ప్రతీహారులు దక్షిణాన రాష్ట్రకూటులతోనూ, పశ్చిమాన ముస్లింలతోనూ యుద్ధంలో మునిగి ఉన్నట్టు అల్-మసౌది రచనల ద్వారా తెలుస్తున్నది.
సా.శ. 712 సంవత్సరంలో ముహమ్మద్ బిన్ ఖాసిం అల్-తఖాఫీ అనే అరబ్బు సేనాని (Arabic: محمد بن قاسم) (c. 31 December 695–18 July 715), సింధురాజ్యంపై దాడి చేసి ఆక్రమించాడు. సింధు లోయ (ప్రస్తుత పాకిస్తాన్లో ఒక భాగం)ని ఆనుకుని సింధురాజ్యాన్ని రాయ్ వంశానికి చెందిన, రాజా దాహిర్ పాలిస్తూ ఉన్నపుడు ఈ దాడి జరిగింది. సా.శ. 712 కి ముందు సింధుపై అనేక అరబ్బు దాడులు జరిగినప్పటికీ, స్థానిక బౌద్ధుల సహకారంతో నిలువరింపబడ్డాయి. అయితే, సా.శ. 712నాటికి సింధురాజుకి బౌద్ధుల సహకారం లభించకపోవడంతో. సింధు ప్రాంతం ఆక్రమణకి గురై, భారతదేశం మహమ్మదీయ పాలనకి నాంది పలికినట్లైనది. కాజీ ఇస్మాయిల్ వ్రాసిన చాచ్ నామా అప్పటి పరిస్థితులను వర్ణిస్తుంది. అటుపైన సా.శ.738లో తూర్పు, దక్షిణ దిశలుగా సాగిన అరబ్బుల విస్తరణ ప్రయత్నాలను, రాజస్థాన్ యుద్ధంలో దక్షిణపథేశ్వరుడైన చాళుక్య రాజు విక్రమాదిత్యుడు-2, ప్రతీహారులు నిలువరించారు.
అరబ్బుల దాడిని ప్రస్తావించిన అ కాలంనాటి, శాసనాలు వీరిది పరిమిత విజయమని స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ దిశగా మొదలైన దాడిని నవ్సరి వద్ద చాళుక్య విక్రమాదిత్యుని-2 సేనాని పులకేశి తిప్పికొట్టాడు. అవంతిపై దాడి చేసిన అరబ్బు సైన్యాన్ని, గుర్జర ప్రతీహార పాలకుడు నాగభట-1, ఓడించాడు. ఆ యుద్ధంలో అరబ్బు సేనలు ప్రాణభయంతో పారిపోయాయి. ఫలితంగా అరబ్బు సేనలు, సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి.
సా.శ. 11వ శతాబ్దపు తొలినాళ్ళలో, గజనీ మహమ్మద్ అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులలోని భూభాగాన్ని ఏలుతున్న హిందూ రాజపుత్రులని ఓడించి, ఉత్తరభారతదేశంవైపు దండెత్తాడు. ఉత్తరభారతదేశంపైన ఇతని దండయాత్రలు ప్రతీహార సామ్రాజ్యాన్ని బలహీనపరచాయి. గజనీ మహమ్మద్ ఉత్తర భారతదేశంలోని అనేక ఆలయాలని దోపిడిచేశాడు. వీటిలో ప్రసిద్ధమైనది గుజరాత్ లోని సోమనాథ్ పైన జరిగిన దండయాత్ర. [4]
ఖిల్జీ వంశం, ఢిల్లీ సుల్తనత్ ను ఏలుతున్న కాలంలో అనేక మంగోలు దండయాత్రలను నిరోధించింది. సా.శ. 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని జాఫర్ ఖాన్, జలంధర్ వద్ద మంగోలులను ఓడించాడు. సా.శ. 1299లో 2 లక్షలమందిగా ఉన్న మంగోలు సైన్యాన్ని నిరోధిస్తూ, జాఫర్ ఖాన్ యుద్ధరంగంలో మరణించాడు. సా.శ.1526లో చివరి ఢిల్లీ సుల్తాను, ఇబ్రహీం లోధీ, మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ సైన్యంతో పోరాడుతూ మరణించాడు. దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై, ఉత్తర భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది.
ఇబ్రహీం లోధీపైన బాబర్ విజయానంతరం, మేవార్ పాలకుడు రాణా సాంగా లేదా రాణా సంగ్రాం సింగ్, సుమారు 20,000వేలమంది రాజపుత్ర కూటమి సైన్యంతో బాబర్ నుండి ఢిల్లీని జయించేందుకు వచ్చాడు. బాబర్ ఆస్థాన చరిత్రకారుల ప్రకారం, రాణా సాంగా యొక్క సైన్యం 2లక్షలపైనే. అయితే, పరిమితంగానే ఉన్న మంగోలుల ఫిరంగిదళం ముందు అధికసంఖ్యలో ఉన్న రాజపుత్ర కాల్బలం నిలువలేకపోయింది. ఖణ్వా వద్ద సా.శ. 1527 మార్చి 16న జరిగిన ఈ యుద్ధంలో రాణా సాంగా బాబర్ చేత ఓడింపబడ్డాయి. భారతీయ సైనిక చరిత్ర, ఫిరంగుల ఉపయోగం యుద్ధఫలితాన్ని నిర్ణయించిన మొదటి యుద్ధంగా ఖణ్వా యుద్ధాన్ని భావిస్తారు. రాణా సాంగా కుమారుడు రాణా ఉదయ్ సింగ్-2 కాలంలో, బాబర్ మనవడు అక్బరు, మేవార్ల రాజధాని చిత్తూరుని ఆక్రమించాడు. మేవార్ పాలకులు, భారతదేశంలో మంగోలుల పాలనని వ్యతిరేకించారు.
సా.శ. 1576 జూన్ 21న, మేవార్ పాలకుడు రాణా ప్రతాప్ సింగ్ కి, రాజా మాన్ సింగ్, అక్బరు కుమారుడు సలీం నాయకత్వాన ఉన్న మొఘలుల సైన్యానికి హల్దిఘాటి వద్ద యుద్ధం జరిగింది. 80,000 మందిగా ఉన్న మంగోలు సైన్యం ముందు 20,000 రాజపుత్ర సైన్యం నిలువలేకపోయింది. తమ్ముడు శక్తి సింగ్ సహాయంతో, రాణా ప్రతాప్ సింగ్ మొఘలులకి బందీ కాకుండా తప్పించుకున్నాడు. అనంతరం, భిల్ల తెగల సహాయంతో, అక్బరు యొక్క మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులు చేసేవాడు.
రాణా ప్రతాప్ సింగ్ అనంతరం, అతని కుమారుడు రాణా అమర్ సింగ్, మొఘలులపై యుద్ధాన్ని కొనసాగించాడు. తదుపరి కాలంలో, మొఘల్ చక్రవర్తి జహంగీర్, అమర్ సింగ్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
సా.శ. 15వ శతాబ్దంలో భారతదేశాన్ని దర్శించిన నికోలో-డి-కొంటె అనే ఇటాలియన్ నావికుడు, విజయనగర ప్రభువు భారతీయ పాలకులందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా పేర్కొన్నాడు. .[5]
సా.శ. 1509 సంవత్సరంలో బహమనీ సుల్తాను, విజయనగరం పైన యుద్ధాన్ని ప్రకటించాడు. బహమనీ సుల్తానుల ఉమ్మడి బలగాలని, శ్రీకృష్ణదేవరాయలు ఓడించాడు. సా.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయలు, కోవెలకొండ వద్ద ప్రతిదాడికి పూనుకున్నాడు. ఆ యుద్ధంలో, బీజాపూర్ సుల్తాను యూసఫ్ అదిల్ షా, మరణించాడు. సా.శ. 1512లో బరీద్-ఇ-మమలిక్ ని ఓడించి, రాయచూరు, గుల్బర్గాలను ఆక్రమించాడు. బరీద్-ఇ-మమలిక్ బీదర్కి పారిపోయాడు. అనంతరం, శ్రీకృష్ణదేవరాయలు బీదరుని సైతం జయించి, సుల్తానుతో జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా అతనికి తిరిగి కట్టబెట్టాడు.
సా.శ. 1512-14 కాలంలో, ఉమ్మత్తూరు పాలెగాని తిరుగుబాటుని అణిచివేసాడు. ఆ సమయంలో, ఓఢ్ర గజపతులు విజయనగర సామ్రాజ్యంపై దండెత్తి, కొండవీడు, ఉదయగిరిలను ఆక్రమించారు.ఈ భూభాగాలను సా.శ. 151513-18 కాలంలో శ్రీకృష్ణదేవరాయలు, తిరిగి పొందాడు.
సా.శ. 1565 సంవత్సరంలో, విజయనగర సేనలకు, బహమనీ సుల్తానుల సేనలకు మధ్య తళ్ళికోట యుద్ధం జరిగింది. దీనిని రాక్షసి-తంగిడి యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో విజయనగర సేనలు ఘోరపరాజయాన్ని చవిచూసాయి. రామరాయలు యుద్ధంలోనే చనిపోగా, మిగిలిన విజయనగరసేనలు పెనుగొండకి పారిపోయాయి. విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం, ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది.
చివరి ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోధీని ఓడించి, సా.శ. 1526 సంవత్సరంలో స్థానంలో నెలకొల్పబడిన మొఘల్ సామ్రాజ్యం, ఇంచుమించుగా దక్షిణాసియా ప్రాంతం మొత్తాన్నీ పరిపాలించింది. తూర్పున బెంగాల్ నుండి పడమరన కాబూల్ వరకూ, ఉత్తరాన కాశ్మీరు నుండి దక్షిణాన కావేరి వరకూ ఉన్న విశాల భూభాగం మొఘలుల ఏలుబడిలో ఉండినది.,[6] సామ్రాజ్య జనాభా 11 నుండి 13 కోట్లు ఉండి ఉంటుందని అంచనా [7] సా.శ. 1540 సంవత్సరంలో, మొఘల్ చక్రవర్తి హుమయూన్, షేర్ షా సూరి చేత ఓడింపబడి కాబూల్కి పారిపోయాడు. సా.శ. 1540 నుండి 1566 వరకూ, సూరి వంశస్థులు, వారి సలహాదారు అయిన హిందూ చక్రవర్తి హేమచంద్రుడు పాలించారు. షేర్ షా సూరి మరణానంతరం సా.శ. 1555 సంవత్సరంలో అస్థిరమైన సూరి సామ్రాజ్యాన్ని, సికిందర్ సూరిని ఓడించి హుమయూన్ తిరిగి పొందాడు.
మొఘలుల ప్రాభవం అక్బరు పరిపాలన నుండి ప్రారంభమై, సా.శ. 1707లో ఔరంగజేబుమరణంతో అంతమైంది.[8][9] అటుపైన మరో 150 సంవత్సరాలు వంశపాలన సాగినప్పటికీ, మునుపటి సామర్థ్యం, తదుపరి పాలకులకి లేవు. మొఘలుల కాలంలో కేంద్రీకృత పరిపాలన, క్రియాశీలకంగా ఉండింది. సా.శ. 1725 అనంతరం యుద్ధాల వలన, కరువుకాటకాల వలన, స్థానిక తిరుగుబాట్ల వలన, విపరీతమైన పరమత ద్వేషం వలన, మరాఠాల విజృంభణ వలన, చివరి బ్రిటీషు వలసపాలన వలన మొఘలుల పాలన అంతమైంది. చివరి మొఘలు పాలకుడు బహదూర్ షా, 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటీషువారు విధించిన దేశబహిష్కరణ శిక్షకి గురైనాడు.
సూరి సామ్రాజ్య సైన్యంలో సాధారణ సైనికునిగా జీవితం ప్రారంభంచిన హేమచంద్రుడు లేదా హేమూ సా.శ. 1552 నాటికి పంజాబు గవర్నరుగా నియమింపబడ్డాడు. అటుపైన, సూరి సామ్రాజ్యంపైన తిరుగుబాటు చేసిన బెంగాల్-ఆఫ్ఘన్ సేనలను అణిచివేసి, బెంగాలు గవర్నరుగా ఉండిన సమయంలో, అదిల్ షా సూరిని ఓడించి, మొగల్ చక్రవర్తి హుమయూన్ ఢిల్లీని ఆక్రమించాడు. సా.శ. 1556 సంవత్సరంలో హుమయూన్ మరణానంతరం, అదే అదునుగా భావించి బెంగాలునుండి ఆఫ్ఘన్, భారతీయ సేనలతో తన దండయాత్రలని ప్రారంభంచాడు. 22 వరుస యుద్ధాలలో ఓటమినెరుగని హేమూ బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో అనేక బలమైన దుర్గాలను ఆక్రమించడమే కాక, కీలకమైన ఆగ్రా కోటనీ, చివరగా సా.శ. 1556 అక్టోబరు 6న ఢిల్లీ కోటనీ ఆక్రమించాడు. సా.శ. 1556 అక్టోబరు 7న ఢిల్లీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై, విక్రమాదిత్య అనే నామాన్ని ధరించాడు. కేవలం నెలరోజులు మాత్రమే ఢిల్లీ చక్రవర్తిగా ఉండిన హేమూ, సా.శ. 1556 నవంబరు 6న రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడింపబడి, అక్బరు సంరక్షకుడైన భైరాం ఖాన్ చేత వధింపబడ్డాడు.
సా.శ. 1674 సంవత్సరంలో పూణె కేంద్రంగా శివాజీ, బీజాపూర్ సుల్తానుల నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతున్న దశలో ఏర్పడిన రాజకీయశూన్యతని నింపిన మరాఠా సామ్రాజ్యంకి అదే నాంది పలికింది.[10] శివాజీ అద్భుతమైన సైనిక, పరిపాలనా విభాగాలను ఏర్పరిచాడు. జీవితం మొత్తం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో యుద్ధాలతోనూ, గెరిల్లా దాడులతోనూ గడిపిన శివాజీ సా.శ.1680 సంవత్సరంలో కన్నుమూశాడు. గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, శివాజీ మరణించే సమయానికి మరాఠా సామ్రాజ్యం స్థిరపడలేదు. ఔరంగజేబు మరణించిన తర్వాతే, మరాఠాలు సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు.
సాయుధ నావికా బలగాలను కలిగిన రెండవ భారతీయ పాలకుడు, శివాజీ. శివాజీ మనుమడు, సాహూజీ యొక్క నావికా సేనాని కన్హోజి ఆంగ్రే, మరాఠా రాజ్యంలోకి డచ్చివారి, బ్రిటీషు వారి, పోర్చుగీసువారి నౌక అక్రమ ప్రవేశాలని నిరోధించాడు.
శివాజీ యొక్క సంతతి, పరిపాలించినప్పటికీ, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయాలు, ప్రధానమంత్రి లేదా పేష్వాల చుట్టూ తిరిగాయి. మరాఠా సామ్రాజ్యాన్ని వాస్తవంగా పాలించినది, పీష్వాలే. పీష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ, సా.శ. 1761లో అఫ్ఘన్ సైన్యం మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడించేంతవరకు, అవిచ్ఛిన్నంగా సాగింది. సా.శ. 1772లో మరాఠాలు మళ్ళీ తమ అధికారాన్ని పొందారు. చివరి పీష్వా బాజీరావ్-2, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయేంతవరకు, వీరి పాలన సాగింది. మరాఠాల ఓటమి అనంతరం, స్థానిక పాలకులలో ఎవరూ బ్రిటీషువారికి బెడద కాలేదు.[11] చివరి ఆంగ్లో-మరాఠా యుద్ధం, భారతదేశంలో బ్రిటీషు ఆధిపత్య శకానికి నాంది అయింది.[12]
కృష్ణరాజ ఒడయారు-2 రాజ్యంలో దళవాయిగా ఎదిగిన హైదర్ అలీ అనతి కాలంలోనే రాజుని శాసించే స్థాయికి ఎదిగి సా.శ. 1761లో తనను మైసూరు రాజ్యానికి సర్వాధికారిగా ప్రకటించుకున్నాడు. మైసూరు రాజ్యానికి నామమాత్రపాలకులుగా ఒడయారులు ఉండినా వాస్తవానికి అధికారమంతా హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ల వద్దనే ఉంది. బ్రిటిషువారి వలసపాలనని వ్యతిరేకించిన భారతీయ పాలకులలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఒకరు. బ్రిటీషు సేనలతో యుద్ధంలో హైదర్ అలీ, రాకెట్లను వినియోగించాడు.[14] టిప్పు సుల్తాన్ వద్ద పాశ్చాత్య దేశాలకు చెందిన తుపాకీ కర్మకారులు అనేకమంది పనిచేశారు. టిప్పు సుల్తాన్, అతని తండ్రి హైదర్ అలీలు, భారతదేశంలో మరాఠాల, బ్రిటీషువారి ఉనికిని తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీషువారిపైన వైరంతో టిప్పు సుల్తాన్, అఫ్ఘన్ దురానీ రాజ్యంతోనూ, టర్కీలోని ఒట్టోమాన్ రాజ్యంతోనూ, ఫ్రెంచివారితో సంబంధాలను సాగించాడు.
మైసూరు రాజ్యం సా.శ. 1399 యదురాజ ఒడయారు స్థాపించాడు. సా.శ. 18వ శతాబ్దంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఆక్రమించుకున్నప్పటికీ, బ్రిటీషువారు సా.శ. 1799లో తిరిగి కృష్ణరాజ ఒడయారు-3 కి అప్పగించారు.
భారత గణతంత్ర రాజ్యం, పాకిస్తాన్ తో మూడు యుద్ధాలు, చైనాతో ఒక సరిహద్దు యుద్ధం చేసింది.
సా.శ. 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిన భారతదేశం, పాకిస్తాన్ తో మూడు యుద్ధాలు (1947-48,1965,1971) చేసింది. పాకిస్తాన్ సైనికులు, సాయుధులైన ఇతర తెగలవారు స్వతంత్ర కాశ్మీరుపై ఆక్రమణకి దిగినపుడు, మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ బలగాలు, రాజధాని శ్రీనగర్ వైపు చొచ్చుకుని వస్తూండగా, కాశ్మీరు రాజు హరి సింగ్, కాశ్మీరు భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు సంతకం చేసాడు. తరువాత, భారత బలగాలు జమ్మూ కాశ్మీరుని విడిపిస్తూ ముందుకు పోయాయి. వాస్తవాధీన రేఖగా నేడు పిలుస్తున్న ప్రాంతం వద్ద, సా.శ. 1948 జనవరి 1/2న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది [15]: 379
పాకిస్తాన్ తో యుద్ధానంతరం, భారతదేశం స్వతంత్ర హైదరాబాద్ పైన దృష్టిపెట్టింది. ఆ సమయంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణలో సాయుధ పోరాటాలు సాగుతున్నాయి. దాని ఫలితంగా స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ ను కొనసాగించాలనుకున్న నిజాం నవాబు, పాకిస్తాన్ నుండి ఖాసిం రిజ్వీ నాయాకత్వంలో రజాకార్ అనబడే సైన్యాన్ని తెలంగాణలో నడిపించాడు. నిజాం నవాబు, హైదరాబాదుని పాకిస్తాన్ లో విలీనం చేయవచ్చనే వార్తలు వస్తున్న కాలంలోనే భారత ప్రభుత్వం ఆపరషన్ పోలోని ప్రారంభించింది. ఐదు రోజులు సాగిన పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ రాజ్యం, భారత గణతంత్ర రాజ్యంలో కలిసింది.
భారతదేశం, గోవాని తన ప్రాంతంగా పేర్కొన్న అనంతరం, భారత-పోర్చుగల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశంలో కలవాలని సాగుతున్న శాంతియుత ప్రదర్శనపై పోర్చుగీసు పోలిసులు విచక్షణారహితంగా విరుచుకుపడడంతో, భారతదేశం గోవాని ఆక్రమించడానికి పూనుకున్నది. భూ,జల,గగన మార్గాలన్నిటినీ భారతదేశం చుట్టుముట్టడంతో,[16] కేవలం 36 గంటలలో, 461 సంవత్సరాల పోర్చుగీసు పాలన అంతమయ్యింది. ఈ యుద్ధం పోర్చుగీసు సైనికులు చనిపోయినవారు 31, గాయపడినవారు 57, పట్టుబడినవారు 3306. భారతదేశ సైనికులు చనిపోయినవారు 34, గాయపడినవారు 51.
భారతదేశం క్షిపణుల అభివృద్ధిని, సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (Integrated Guided Missile Development Program - IGMDP) ద్వారా చేపడుతున్నది. సా.శ. 1983లో ఏర్పడిన ఈ వ్యవస్థ, క్షిపణి అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో భారతదేశ స్వయం సమృద్ధికోసం ప్రారంభించబడింది. ప్రస్తుతం, ఇందులో ఆరు క్షిపణి కార్యక్రమాలు ఉన్నాయి.
ప్రస్తుతం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, సూర్య అనే అధునాతన ఖండాతర క్షిపణులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీని పరిధి 10,000 కి.మీ పైచిలుకు. ఇది అమెరికా,రష్యా,ఇజ్రాయెల్ దేశాల అధునాతన క్షిపణులతో పోల్చదగినది.[17] భారత క్షిపణి రక్షణ కవచ కార్యక్రమం చేపట్టడం ద్వారా భారతదేశం, క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పరచిన నాలుగవ దేశం అయింది.
సా.శ. 1974 సంవత్సరంలో, భారతదేశం అణుకార్యక్రమాన్ని చేపట్టింది. స్మైలింగ్ బుద్ధ అని పిలువబడిన, ఈ పరీక్షల్లో ఉపయోగించబడిన అణుధార్మికత 15 కిలోటన్నులు. సా.శ. 1998 మే 11, 13 తేదీలలో, మరోసారి అణుపరీక్షలను విజయవంతంగా జరిపిన భారతదేశం, అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్నది.