భారతదేశ ఐక్యతను కాపాడటం, దానికి స్వాతంత్ర్యం ఇవ్వడం అనే లక్ష్యాలతో బ్రిటిషు ప్రభుత్వం నుండి భారత రాజకీయ నాయకత్వానికి అధికారాన్ని బదిలీ చేసే అంశం గురించి చర్చించడానికి ఒక 1946 మార్చి 24 న లండన్ నుండి భారతదేశానికి ఒక మంత్రివర్గ రాయబార బృందం వచ్చింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ చొరవతో ఏర్పడిన ఈ మిషన్‌లో లార్డ్ పెథిక్-లారెన్స్ ( భారత విదేశాంగ కార్యదర్శి ), సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ (బోర్డు ఆఫ్ ట్రేడ్ అధ్యక్షుడు) AV అలెగ్జాండర్ ( ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాల్టీ) సభ్యులుగా ఉన్నారు. కొన్ని చర్చలలో భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ పాల్గొన్నాడు.
ఈ బృందం రూపొందించిన క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో భారతదేశం కోసం మూడు-స్థాయిల పరిపాలనా నిర్మాణాన్ని ప్రతిపాదించారు, పై వరుసలో ఫెడరల్ యూనియన్, దిగువ శ్రేణిలో వ్యక్తిగత ప్రావిన్సులు ఉండగా, మధ్య శ్రేణిలో ప్రావిన్సుల సమూహాలు ఉంటాయి. A, B, C అనే మూడూ ప్రావిన్సు గ్రూపులను వాళ్ళు ప్రతిపాదించారు. వాయవ్య భారతదేశం, తూర్పు భారతదేశం, భారతదేశంలోని మిగిలిన మధ్య భాగాలు ఈ గ్రూపుల్లో ఉంటాయి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల మధ్య పరస్పర అవిశ్వాసం కారణంగా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక విఫలమైంది. కొత్త పరిష్కారాలను కనుగొనడానికి బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ వేవెల్ స్థానంలో కొత్త వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్‌ను నియమించింది.
ఇది రాజ్యాంగపరంగా అందరికీ ఆమోదయోగ్యమైన భవిష్యత్తు పరిష్కారాన్ని కనుగొనడానికి భారతదేశానికి పంపిన మంత్రివర్గం. ఈ ప్రణాళికలో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల మధ్య చాలా తక్కువ పరస్పర ఆమోదం కనిపించింది. అఖిల భారత కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని అది ప్రతిపాదించింది. చివరికి దాని ప్రతిపాదనలు తిరస్కరించబడ్డాయి.
ఉపఖండాన్ని తాము రాజకీయంగా ఏకీకృతం చేసామనే బ్రిటిషు వారి అహంకారం, పాకిస్తాన్ మనగలగుతుందా అనే విషయమై చాలా మంది బ్రిటిష్ అధికారులకు ఉన్న అనుమానాల నేపథ్యంలో భారతదేశాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరిక వచ్చింది.[1] 1946 మార్చి 24 న న్యూఢిల్లీకి చేరుకున్న మంత్రివర్గ రాయబార బృందం, దీన్నే సూచిస్తుంది.[2] ఈ బ్రిటిష్ ప్రభుత్వ రాయబార బృందంలో ప్ర్రధాన అంశం స్వతంత్రానంతర భారతదేశం ఏర్పడటం.[3] బృందంలో సభ్యులైన AV అలెగ్జాండర్, స్టాఫోర్డ్ క్రిప్స్, పెథిక్-లారెన్స్ లు ముగ్గురూ వ్యూహాత్మక కారణాల వల్ల భారతదేశ ఐక్యతకే మొగ్గు చూపారు.[4]
ఉపఖండంలోకి వచ్చిన తరువాత, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ లు రెండూ ఒక పరిష్కారాన్ని చేరుకోవడానికి గతంలో కంటే ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నాయని బృందం గ్రహించింది. రెండు పార్టీలు సార్వత్రిక, ప్రాంతీయ ఎన్నికలలో మంచి పనితీరు కనబరిచాయి. ఉపఖండంలో రెండు ప్రధాన పార్టీలుగా ఆవిర్భవించాయి, విడివిడి ఎన్నికల వ్యవస్థ కారణంగా ప్రాంతీయ సంస్థలు ఓడిపోయాయి. ముస్లింలకు కేటాయించిన సీట్లలో దాదాపు 90 శాతం ముస్లిం లీగ్ విజయం సాధించింది.[5] ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జిన్నా, బ్రిటిష్ వారితో, కాంగ్రెస్‌తో బేరసారాలలో పట్టు సాధించాడు.[3] విడివిడి ఎన్నికల వ్యవస్థను స్థాపించిన బ్రిటీష్ వారు, దాని విపరిణామాలను ఎంత కావాలనుకున్నా తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది.[5]
భారత నాయకత్వంతో అసంపూర్ణంగా ముగిసిన చర్చల తర్వాత మంత్రివర్గ బృందం తన స్వంత ప్రతిపాదనలు చేసింది.[4] ఆరు పూర్తి ప్రావిన్సులతో కూడిన పాకిస్తాన్ కావాలని జిన్నా చేసిన డిమాండును కాంగ్రెస్ వ్యతిరేకించింది.[3] ఈ బృందం భారతదేశం కోసం మూడు అంచెలున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థను ప్రతిపాదించింది:[6] ప్రావిన్సులు, ప్రావిన్సుల సమూహాలు, కేంద్రం.[7] కేంద్రం అధీనంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, [4] కరెన్సీ, [7] కమ్యూనికేషన్లు మాత్రమే ఉంటాయి.[6] ఇతర అధికారాలన్నీ ప్రావిన్సుల వద్దే ఉంటాయి. మధ్య అంచెలో మూడు ప్రావిన్సుసమూహాలు కూడా ఉంటాయి.[4] ప్రణాళిక లోని ప్రధాన లక్షణం ఈ ప్రావిన్సులసమూహాలే. ముస్లిములు ప్రధానంగా ఉండే పశ్చిమ, తూర్పు ప్రావిన్సులతో రెండు గ్రూపులు ఉంటాయి. మధ్య, దక్షిణ భారతదేశంలో ఉండే హిందూ ప్రాంతాలతో మూడవ గ్రూపు ఉంటుంది.[6] అందువల్ల యునైటెడ్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరార్, బొంబాయి, బీహార్, ఒరిస్సా, మద్రాస్ వంటి ప్రావిన్సులు అన్నీ గ్రూప్ ఎలో ఉంటాయి.[4] గ్రూప్ బిలో సింద్, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, బలూచిస్తాన్‌లను ఉంటాయి. బెంగాల్, అస్సాంలు గ్రూప్ సిలో ఉంటాయి.[8] కేంద్రానికి కేటాయించినవి కాకుండా ఇతర అంశాలు, అధికారాలూ అన్ని సంస్థానాలకు కూడా ఉంటాయి.[9][10]
ఈ పథకం ద్వారా బ్రిటీష్ వారు, తాము, కాంగ్రెస్ ఇద్దరూ కోరుకున్నట్లుగా భారతీయ ఐక్యతను కొనసాగించాలనీ, పాకిస్తాన్ కోరికకు సంబంధించి జిన్నాకు ఒక అవకాశాన్నీ అందించాలని ఆశించారు. ఈ ప్రతిపాదనలు బెంగాల్, పంజాబ్ ల లోని ముస్లిమేతర జిల్లాలు ఎక్కువగా విభజించబడకుండానే ఈశాన్య పాకిస్తాన్‌ను నిరోధిస్తూనే పెద్ద పాకిస్తాన్‌పై జిన్నా పట్టుదలను దాదాపుగా ఇవి సంతృప్తిపరిచాయి. పంజాబ్, బెంగాల్ పూర్తి ప్రావిన్సులను పట్టుకోవడం ద్వారా, తమ ప్రావిన్సులు విభజించబడితే అధికారాన్ని కోల్పోతామని భయపడే ప్రాంతీయ నాయకులను జిన్నా సంతృప్తి పరచగలిగే అవకాశం ఏర్పడింది.[11] పంజాబ్, బెంగాల్ లలో పెద్ద సంఖ్యలో హిందూ మైనారిటీలు ఉండటం వల్ల, హిందూ ప్రావిన్సులలో ఉన్న ముస్లిం మైనారిటీలకు కూడా రక్షణ ఏర్పడింది.[12][13]
అన్నింటికంటే ముఖ్యంగా, జిన్నా పాకిస్తాన్, భారతదేశాల మధ్య సమానత్వాన్ని కోరుకున్నాడు. ప్రాంతీయ సమూహాలు దానిని సురక్షితంగా ఉంచగలవని అతను విశ్వసించాడు. హిందూ భారతదేశంతో సమానంగా ముస్లిం భారతదేశానికి కేంద్రంలో ప్రాతినిధ్యం ఉంటుందని అతను పేర్కొన్నారు. అతను రెండు సమూహాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, ముస్లిం లీగ్ లోని కౌన్సిల్, 1946 జూన్ 6 న మంత్రివర్గ ప్రతిపాదనలను అంగీకరించింది.[12] కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను అంగీకరించకపోతే లీగ్‌ను తాత్కాలిక ప్రభుత్వంలో ఉంచుతానని వేవెల్ నుండి హామీని పొందింది.[14]
ఇప్పుడు బాధ్యత కాంగ్రెస్‌పై పడింది.[15] ఇది ప్రతిపాదనలను అంగీకరిస్తూ, అవి పాకిస్తాన్ డిమాండ్‌కు తిరస్కారమని అర్థం చేసుకుంది. NWFP, అస్సాం రెండింటినీ పాలిస్తున్న తాము నేపథ్యంలో, ప్రావిన్సులకు ఇష్టం లేని పక్షంలో అవి ప్రావిన్సుగ్రూపులలో చేరకుండా ఉండవచ్చు అనేది కాంగ్రెస్ వైఖరి. అయితే, జిన్నా దానితో విభేదించాడు. గ్రూపింగ్ ప్లాన్ తప్పనిసరి అని అన్నాడు. సార్వభౌమ రాజ్యాంగ సభ, మంత్రివర్గ ప్రణాళికకు కట్టుబడి ఉండదనే కాంగ్రెస్ వైఖరి వారిద్దరి మధ్య ఉన్న మరొక భేదాభిప్రాయం. ఒకసారి ప్రణాళికను అంగీకరించిన తర్వాత, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని జిన్నా పట్టుబట్టాడు.[7] సమూహాల ప్రణాళిక భారతదేశపు ఐక్యతను కాపాడింది. అయితే నాయకత్వం, ముఖ్యంగా నెహ్రూ, ఈ ప్రణాళిక వల్ల, పార్టీ ఆశయాలను సాధించే వీలు లేకుండా కేంద్రం అశక్తమౌతుందని విశ్వసించింది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెసు సోషలిస్ట్ విభాగం దేశాన్ని పారిశ్రామికీకరించే, పేదరికాన్ని నిర్మూలించే ప్రభుత్వాన్ని కోరుకుంది.[15]
1946 జూలై 10 న నెహ్రూ చేసిన ప్రసంగంలో, ప్రావిన్సులు ఏదో ఒక సమూహంలో [15] చేరవలసి ఉంటుంది అనే ఆలోచనను తిరస్కరించాడు. కాంగ్రెస్ ప్రణాళికకు కట్టుబడి లేదని కూడా అన్నాడు.[16] ఫలితంగా, నెహ్రూ ప్రసంగం మిషన్ ప్రణాళికనూ, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచే అవకాశాన్నీ తుడిచిపెట్టేసింది.[15] ఆ ప్రసంగం కాంగ్రెస్ చేసే ద్రోహానికి మరో ఉదాహరణ అని జిన్నా వ్యాఖ్యానించాడు.[17] సమూహాలపై నెహ్రూ ప్రసంగం తరువాత, జూలై 29 న ముస్లిం లీగ్, ప్రణాళికకు[4] తాము ఇచ్చిన మునుపటి ఆమోదాన్ని రద్దు చేసింది.[13]
క్షీణిస్తున్న బ్రిటిషు శక్తి పట్ల ఆందోళన చెందిన వేవెల్, ఓ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రారంభించేందుకు ఆతృతగా ఉన్నాడు. జిన్నా ఓటును పక్కన పెట్టి, నెహ్రూ తాత్కాలిక ప్రధానిగా ఉన్న మంత్రివర్గానికి అధికారం ఇచ్చాడు.[7] తనను పక్కకు పట్టడం, తన "గుంపుల" పాకిస్తాన్ భావనను తిరస్కరించడంతో జిన్నా కలత చెందాడు. పాకిస్తాన్‌ను సాధించడానికీ, తనను పక్కన పెట్టడం కష్టమని కాంగ్రెసుకు తెలియజెప్పడానికీ, "ప్రత్యక్ష చర్య"ను ఉపయోగించమని తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. ఇది గాంధీ చేసిన శాసనోల్లంఘన ఉద్యమం తరహాలోనే ఇది చెయ్యాలని అతను చెప్పాడు. అయితే అది కొన్ని ప్రాంతాలలో మత ప్రాతిపదికన అల్లర్లకు, ఊచకోతలకూ దారితీసింది.[18] డైరెక్ట్ యాక్షన్ డే కారణాంగా, తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించాలనే వేవెల్ సంకల్పం మరింత దృఢతరమైంది. 1946 సెప్టెంబరు 2 న నెహ్రూ మంత్రివర్గం ఏర్పాటైంది.[19]
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నిరసనగా లక్షలాది భారతీయ ముస్లిం కుటుంబాలు నల్లజెండాలు ఎగురవేశారు.[20] జిన్నా తాత్కాలిక ప్రభుత్వంలో చేరలేదు కానీ లియాఖత్ అలీ ఖాన్‌ను ద్వితీయ పాత్ర పోషించడానికి పంపాడు. ముఖ్యమైన హోం మంత్రి పదవిని ఆయనకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఇష్టపడక, ఆర్థిక మంత్రి పదవి ఇచ్చింది. లియాఖత్ అలీ ఖాన్, కాంగ్రెస్ మంత్రిత్వ శాఖల పనితీరును అడ్డుకుంటూ కాంగ్రెసుకు ఆగ్రహం కలిగించాడు.[19] జిన్నా కనుసన్నలలో పనిచేస్తూ, భారతదేశానికి ఒకే ప్రభుత్వం అసాధ్యమని అతను నిరూపించాడు.[20]
అట్లీ, క్రిప్స్, పెథిక్-లారెన్స్‌లను కలవడానికి నెహ్రూ, జిన్నా, వేవెల్‌లను డిసెంబరులో పంపి, క్యాబినెట్ మిషన్ పథకాన్ని పునరుద్ధరించడానికి బ్రిటన్ ప్రయత్నించింది. ఏమాత్రం రాజీలేని వారి వాదనల కారణంగా నెహ్రూ భారతదేశానికి తిరిగి వచ్చేసాడు. "ఇక మేము లండన్ వైపు చూడటం పూర్తిగా మానేశాము" అని అతను ప్రకటించాడు.[20] ఇంతలో, వేవెల్ రాజ్యాంగ సభను ప్రారంభించాడు. లీగ్ దానిని బహిష్కరించింది. తాత్కాలిక ప్రభుత్వంలో లీగ్ చేరింది కాబట్టి, ఇందులోనూ చేరుతుందని అతను ఊహించాడు. దాని బదులు కాంగ్రెస్ మరింత బలపడింది. ముస్లిం లీగ్ మంత్రులను తొలగించమని అతనికి సిఫార్సు చేసింది. బ్రిటిషు ప్రభుత్వం చేత దాని లక్ష్యాలను వివరించే ప్రకటనను కూడా వేవెల్ ఇప్పించలేకపోయాడు.[19]
పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆ సందర్భంలో, వేవెల్ క్రమంగా బ్రిటిష్ నిష్క్రమణను వివరించే బ్రేక్‌డౌన్ ప్రణాళికను రూపొందించాడు. అయితే అతని ప్రణాళికను మంత్రివర్గం ప్రాణాంతకమైనదిగా పరిగణించింది. తన ప్రణాళికను అంగీకరించాలని అతను పట్టుబట్టడంతో, అతని స్థానంలో లార్డ్ మౌంట్ బాటన్‌ని నియమించారు.[4]
<ref>
ట్యాగు; "autogenerated7" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated5" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated9" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated6" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "autogenerated8" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు