భారతీయ భాషల సర్వే అనేది బ్రిటిష్ ఇండియాలో భాషలపై చేసిన సమగ్ర సర్వే. ఇది 364 భాషలు, మాండలికాలను వివరిస్తుంది. [1] 1886 సెప్టెంబరులో వియన్నాలో జరిగిన ఏడవ అంతర్జాతీయ ఓరియంటల్ కాంగ్రెస్‌కు హాజరైన ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు, భాషా శాస్త్రవేత్త జార్జ్ అబ్రహాం గ్రియర్సన్ ఈ సర్వేను మొదట ప్రతిపాదించాడు. అతడు చేసిన సర్వే ప్రతిపాదనను మొదట బ్రిటిషు భారత ప్రభుత్వం తిరస్కరించింది. అప్పుడున్న ప్రభుత్వ అధికారులనే వాడి, సహేతుకమైన ఖర్చుతో చేయవచ్చని అతడు చూపించిన తరువాత, 1891 లో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అయితే ఇది అధికారికంగా 1894 లో మాత్రమే ప్రారంభమైంది. సర్వే ముప్పై సంవత్సరాల పాటు కొనసాగి, 1928 లో చివరి ఫలితాలను ప్రచురించింది.
ఎల్‌ఎస్‌ఐ వారి శోధించదగిన డేటాబేసు ఆన్-లైన్‌లో అందుబాటులో ఉంది. ఇది గ్రియర్సన్ యొక్క ఒరిజినల్ ప్రచురణలో కనిపించినట్లుగా ప్రతి పదానికి సారాంశాన్ని అందిస్తుంది. అదనంగా, బ్రిటిషు లైబ్రరీ సౌండ్ ఆర్కైవ్‌లో గ్రామోఫోన్ రికార్డింగులు కూడా ఉన్నాయి. [2] ఇది ధ్వని శాస్త్రాన్ని డాక్యుమెంట్ చేస్తుంది.
గ్రియర్సన్ భారతదేశంలోని డేటాను సేకరించడానికి ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకున్నాడు. సమాచారాన్ని సేకరించిన అధికారుల కోసం ఫారమ్‌లు, మార్గదర్శక సామగ్రిని తయారు చేశాడు. డేటా సేకరణలోని ఏకరూపత, అవగాహన లోని స్పష్టతను నిర్ధారించడంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఇంటి లోని వారు మాట్లాడే భాష పేరేంటో తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డానని ఒక అధికారి చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తున్నవారు భాష పేరేంటంటే తమ కులం పేరు చెప్పేవారు. [3]
రాష్ట్ర సరిహద్దుల పునర్వ్యవస్థీకరణను కోరే రాజకీయ సమూహాలు గ్రియర్సన్ తయారు చేసిన పటాలు, సరిహద్దులను ఉపయోగించు కుంటూంటాయి. [3]
1898 నుండి 1928 వరకు గ్రియర్సన్ ప్రచురించిన సంపుటుల జాబితా:
రెండవ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ 1984 లో రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఆఫీస్ యొక్క భాషా విభాగం: ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. 2010 సంవత్సరం చివరిలో సుమారు 40% సర్వే పూర్తయింది. గ్రియర్సన్ అధ్యయనం తరువాత భాషా దృశ్యంలో చోటు చేసుకున్న మార్పులను తెలుసుకోవడమే ఈ సర్వేకున్న పరిమిత లక్ష్యం. [4] అనేక ప్రొఫెషనల్ భాషా శాస్త్రవేత్తలు, గ్రియర్సన్ పద్దతిలో జరిగిన తప్పిదాలను ఈ ప్రాజెక్టు లోనూ చేశారని విమర్శించారు - భాషా డేటాను సేకరించడానికి సామాన్యులను కాకుండా, స్థానిక భాషా ఉపాధ్యాయులను లేదా ప్రభుత్వ అధికారులను సమాచారకర్తలుగా ఎంచుకోవడం వంటి లోపాలు మళ్ళీ జరిగాయి.
1991 భారత జనాభా లెక్కల ప్రకారం, ప్రత్యేక వ్యాకరణ నిర్మాణాలున్న"మాతృభాషలు" 1,576, "ఇతర మాతృభాషలు" 1,796 ఉన్నాయి. త్వరలోనే, భారతదేశపు పూర్తి ఖచ్చితమైన భాషా సర్వే చెయ్యాలనే డిమాండులు వచ్చాయి. గ్రియర్సన్ సర్వే, శిక్షణ లేని క్షేత్రస్థాయి కార్మికులపై ఆధారపడి చేసిందనీ, పూర్వ ప్రావిన్సులు బర్మా, మద్రాసు, అప్పటి రాచరిక రాజ్యాలైన హైదరాబాదు, మైసూర్లను నిర్లక్ష్యం చేశారనీ గుర్తించారు. ఫలితం ఏమిటంటే, ఎల్‌ఎస్‌ఐలో దక్షిణ భారతదేశపు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. [5] [6]
భారత భాషా సర్వేను విస్తరించడానికి, సవరించడానికీ మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత ప్రభుత్వం ప్రకటించింది. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో (2007–12) ఈ ప్రాజెక్టు కోసం రూ. 280 కోట్లు మంజూరు చేశారు. దీనిని రెండు విభాగాలుగా వర్గీకరించారు: ఒకటి న్యూ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, రెండవది మైనర్ భాషలూ, అంతరించిపోతున్న భాషల సర్వే. మైసూరు లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో, ఉదయ నారాయణ సింగ్ నేతృత్వంలో జరిగే ఈ ప్రాజెక్టులో 54 కి పైగా విశ్వవిద్యాలయాలు, 2,000 మంది పరిశోధకులు, 10,000 మంది భాషావేత్తలూ భాషా నిపుణులూ పదేళ్ల కాలం పాటు పనిచేస్తారని అంచనా వేసారు. [5]
ఆన్‌లైన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో [7] ఏప్రిల్ 2010 న వచ్చిన కథనం ప్రకారం పైన పేర్కొన్న ప్రాజెక్టును మానేసినట్లు పేర్కొంది. ఈ సర్వే భాషావాదం లేదా భాషా సామ్రాజ్యవాదం పునరుజ్జీవనానికి దారితీస్తుందనే భయంతో, "ప్రభుత్వం వెనకాడినందువల్ల", న్యూ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాను వదిలివేయవలసి వచ్చిందని భాషా కాన్ఫ్లుయెన్స్ వద్ద సిఐఐఎల్ డైరెక్టర్ రాజేష్ సచ్‌దేవా అన్నారు. అయితే, భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్ అనే ఒక ఎన్జీఓ ఆధ్వర్యంలో, గణేష్ ఎన్ డేవి చైర్‌పర్సన్‌గా పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎస్‌ఐ) గ్రియర్సన్ సర్వేను అనుసరించి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. హిమాలయ భాషల సర్వేతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.