మధ్యాహ్న భోజన పథకము | |
---|---|
![]() నాగాలాండ్ లోని వోఖా జిల్లాలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్వీకరిస్తున్న విద్యార్థులు | |
పథకం రకం | భారత ప్రభుత్వం |
దేశం | భారతదేశం |
ప్రారంభం | 1995 |
స్థితి | క్రియాశీలకం |
వెబ్ సైటు | http://mdm.nic.in/ |
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము (Mid Day Meal Program) అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది.[1] ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు. బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో ఇది ఎప్పటినుంచో అమలులో ఉంది. 2001 నవంబర్ 28 న సుప్రీం కోర్టు ధర్మాసనం మార్గనిర్దేశం నేపథ్యంలో ఈ పథకం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. తమిళనాడులోని పాఠశాలల అభివృద్ధి ఈ పథకం యొక్క విజయానికి చక్కని తార్కాణం.
భారతదేశానికి స్వాతంత్ర్యానికి రాక మునుపు ఆంగ్ల ప్రభుత్వం ఆధీనంలోని మద్రాసు కార్పొరేషన్ 1925 లో మద్రాసు సిటీ కార్పొరేషన్ పాఠాశాలల్లో చదివే పిల్లలకి భోజనం పెట్టేది.[1] 1930 లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఫ్రెంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.[2]
రాష్ట్ర ప్రభుత్వాలు బడి పిల్లల కోసం ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకాలు 1962-63 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. తమిళనాడు రాష్ట్రం ఈ పథకం మొదటి సారిగా అమలు చేసి బడికి హాజరయ్యే పిల్లల శాతాన్ని పెంచడానికి ప్రణాళిక రూపొందించింది. కామరాజ్ నాడార్ ప్రభుత్వం దీనిని విస్తృతంగా అమలు పరిచింది.[3]మొదట్లో ఈ పథకాన్ని చెన్నైలో ప్రారంభించగా 1982 లో ఎం జి రామచంద్రన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విస్తరింపచేసింది. తరువాత తమిళనాడు ప్రభుత్వం, పదవ తరగతి చదివే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసింది. తమిళనాడులో అమలవుతున్న ఈ పథకం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది.
తరువాత ఇతర రాష్ట్రాలలో కూడా అమలులోకి వచ్చింది. ఈ పథకాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం గుజరాత్. ఇక్కడ 1984లో ప్రారంభమైంది. కానీ తర్వాత రద్దు చేశారు.[4] కేరళలో 1984 లో ప్రారంభించబడి మరిన్ని తరగతులకు పాఠశాలలకు విస్తరించబడింది.[5] 1990-91 నాటికి గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు తమ పరిధిలోని దాదాపు అందరు విద్యార్థులకు స్వంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అంతర్జాతీయ సహాయం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పూర్తిగా అంతర్జాతీయ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.[6]
1995 ఆగస్టు 15 న భారత ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ (NP-NSPE) పేరుతో ఒక పథకం ప్రారంభించింది. ప్రాథమిక విద్యనభ్యసించే పిల్లల్లో పోషకాహార స్థాయిని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మొదటగా ఈ పథకాన్ని దేశంలోని 2408 బ్లాకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు లోపు తరగతి పిల్లల కోసం ప్రారంభించారు. 1997-98 సంవత్సరం నుంచి దేశమంతటా ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 300 కేలరీలు, 12 గ్రాముల ప్రోటీన్లతో కూడిన వండిన ఆహారాన్ని ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు అందజేస్తున్నారు. 2007 అక్టోబరు నుంచి చదువులో వెనుకబడిన ప్రాంతాలైన 3479 బ్లాకుల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.[7] దీని పేరు కూడా నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మిడ్ డే మీల్స్ ఇన్ స్కూల్స్ (National Program of Mid day Meals in Schools) అని మార్చారు.[8]
విద్యార్థులకు వండిన ఆహారాన్ని అందించాల్సి ఉండగా ఇదివరకే దాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు చాలా వరకు వంట సామాగ్రి సరఫరా చేయడంతో సరిపెడుతున్నాయి. 80 శాతంపైగా హాజరు గల విద్యార్థులకు మూడు కేజీల గోధుమలు లేదా బియ్యం ఇస్తారు.
ఈ పథకానికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% ఖర్చును భరిస్తున్నాయి.[9] కేంద్రప్రభుత్వం ధాన్యాలను, ఇతర దినుసలకు కావాల్సిన అర్థిక సహాకారాన్ని అందిస్తోంది. రవాణా, కూలి ఖర్చులు, సౌకర్యాలకు అయ్యే ఖర్చును రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంచుకుంటున్నాయి.[10] పాల్గొంటున్న రాష్ట్రాలు తమకు తోచినంత సహాయం చేస్తున్నాయి.[11] ఈ పథకం కోసం పదకొండో పంచవర్ష ప్రణాళికలో ₹384.9 బిలియను (US$4.8 billion), పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ₹901.55 బిలియను (US$11 billion) కేటాయించారు. ఇది 134% పెరుగుదల.[12] 2007-08 లో ₹73.24 బిలియను (US$920 million) గా ఉన్న ఖర్చు 2013-14 నాటికి ₹132.15 బిలియను (US$1.7 billion) అయ్యింది.[1] ప్రాథమిక పాఠశాలలో ఒక రోజుకు ఒక విద్యార్థికి అయ్యే ఖర్చుకు ₹4.13 (5.2¢ US) గా నిర్ణయించగా, ప్రాథమికోన్నత పాఠశాలలో ₹6.18 (7.7¢ US) గా నిర్ణయించారు.[13]
ఇది చాలా చోట్ల అనుసరిస్తున్న పద్ధతి. ఇందులో ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న వంటవారు లేదా స్వయం సహాయక సంఘాలు ఆహారాన్ని పాఠశాల సమీప ప్రాంతంలో వండుతారు. ఈ పద్ధతి ద్వారా పిల్లలకు తమ ప్రాంతీయ వంటకాలు తినగలుగుతారు. ప్రాంతీయులకు పని దొరుకుతుంది. ఆహారం వృధా తక్కువ. ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు దగ్గరగా ఉండి తరచు పర్యవేక్షించే వీలుంటుంది. సరైన వంటశాలలు, సౌకర్యాలు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే పరిశుభ్రతను పాటించడం కూడా కష్టం.[14] 2004 లో తమిళనాడులోని కుంబకోణంలో 87 మంది విద్యార్థులు వంట నుంచి ఎగిరిపడిన నిప్పు వల్ల పూరిపాక లాంటి తరగతి గదిలో అగ్నికి ఆహుతి అయ్యారు.[15] 2011లో ఒక విద్యార్థిని వంట పాత్రలో పడి మరణించింది.[16]
కేంద్రీకృత పద్ధతిలో ఏదైనా బయటి సంస్థ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆహారాన్ని వండి పాఠశాలలకు సరఫరా చేస్తుంది. ఇలాంటి వంటశాలలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ అయితే సమీపంలోనే అనేక పాఠశాలలు ఉంటాయి కాబట్టి రవాణా చేయడం ఆర్థికంగా కలిసివచ్చే అంశం. మెరుగైన పరిశుభ్రతను పాటించడం, యంత్ర పరికరాల ద్వారా పెద్ద ఎత్తున ఆహారాలు తయారు చేయగలగడం ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు. అక్షయపాత్ర ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, జే గీ హ్యుమనిటేరియన్ సొసైటీ & పీపుల్స్ ఫోరం లాంటి ఎన్. జి. ఓ లు ఈ నమూనా ద్వారా మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నాయి.[9]
2007 లో ఢిల్లీలో జరిపిన ఒక అధ్యయనంలో కేంద్రీకృత విధానంలో కూడా ఆహార నాణ్యతలో సమస్యలు ఉన్నాయనీ, దాని నాణ్యతను పెంచాలని తేలింది.[17] ఒక వేళ సరిపడనంత ఆహారం రాకపోతే ఉపాధ్యాయులకు కూడా ఏమి చేయాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు.
2010-12 లో మానవ వనరుల అభివృద్ధి శాఖ జరిపిన సర్వేలో ఎన్. జి. ఓలు తయారు చేసిన ఆహార నమూనాలు పరీక్షించి 95% పోషక ప్రమాణాలు అందుకోవడం లేదని నివేదించింది. దీనికి స్పందనగా 50% చెల్లింపును నిలిపి వేసింది.[18]
ఈ పథకానికి కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సహాయం చేశాయి. చర్చ్ వరల్డ్ సర్వీస్ అనే సంస్థ ఢిల్లీ, మద్రాసు కార్పొరేషన్లలో పాలపొడిని పంచింది. కేర్ అనే సంస్థ సోయా మీల్, బల్గర్ వీట్, వెజిటబుల్ ఆయిల్ సమకూర్చింది. యూనిసెఫ్ వారు అత్యధిక ప్రోటీన్లు గల ఆహారాన్ని, విద్య సంబంధ విషయాల్లో సహకారం అందించారు.[19] 1982 లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సహకారంతో నేర్చుకుంటే ఆహారం (Food for Learning) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటగా షెడ్యూల్డ్ కులాల, తెగల బాలికల కోసం ఉద్దేశింపబడింది.[19]1983 లో కేంద్ర విద్యా శాఖ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (ప్రపంచ ఆహార పథకం) ద్వారా 15 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 1 నుంచి 5 తరగతి చదివే 1 కోటి 36 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు, 1 కోటి 9 లక్షల మంది షెడ్యూల్డ్ తెగల అమ్మాయిలకు భోజనం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం సుమారు 16.33 కోట్ల రూపాయలు.[19] కూలీ, సౌకర్యాలు, రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. దీనికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా రాష్ట్రాలు ఆసక్తి చూపగా కొన్ని రాష్ట్రాలు ఒకవేళ FAO సహకారం ఆగిపోతే పరిస్థితి ఏమిటని తమ అనుమానాలు వ్యక్తం చేశాయి.[20]
ఏప్రిల్ 2001 న పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) అనే సంస్థ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (No. 196/2001) దాఖలు చేసింది.[21] ఈ కేసునే ఆహార హక్కు ("right to food") అని కూడా పిలిచారు. ఈ కేసులో PUCL భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ (జీవించే హక్కు), ఆర్టికల్ 39(a), ఆర్టికల్ 47 కలిపి ఆలోచిస్తే ఆహారపు హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగా భావించవచ్చని వాదించింది. ఆర్టికల్ 32 ప్రకారం దీన్ని అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించింది. అంతే కాకుండా భారత ఆహార సంస్థ (Food Corporation of India) లో వృధాగా పడి ఉన్న ధాన్యాలను ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం వినియోగించాలని వాదించింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చడం కూడా ఇందులో భాగం. 2001 నవంబర్ 28 న సుప్రీం కోర్టు,[22] అన్ని ప్రభుత్వప్రాథమిక పాఠశాలల్లోనూ ఈ పథకాన్ని కచ్చితంగా అమలుపరచాలని తీర్పు చెప్పింది.[11] మొదట్లో కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించినా 2005 నాటికి ఇది అన్ని రాష్ట్రాలలో ఆరంభమైంది.
ప్రస్తుతం మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద 12.12 లక్షల పాఠశాలల్లో, 10.68 కోట్ల మంది బడి పిల్లలకు వండిన ఆహారం అందుతోంది.
2014-2015 సంవత్సరం బడ్జెట్లో ఈ నిమిత్తం 13215 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి దేశస్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు అనేక కమిటీలు ఉన్నాయి.
స్థాయి | కమిటీ | కలుసుకునే సమయం |
---|---|---|
జాతీయ స్థాయి | జాతీయ స్థాయి స్టీరింగ్/మానిటరింగ్ కమిటీ ప్రోగ్రాం అప్రూవల్ బోర్డ్ (PAB) |
ప్రతి మూడు నెలలకు |
రాష్ట్ర స్థాయి | రాష్ట్ర స్థాయి స్టీరింగ్/మానిటరింగ్ కమిటీ | ప్రతి మూడు నెలలకు |
జిల్లా స్థాయి | జిల్లా స్థాయి కమిటీ | నెలకోసారి |
మునిసిపాలిటీ స్థాయి | మునిసిపల్ కమిటీ | నెలకోసారి |
బ్లాకు | మండలస్థాయి కమిటీ | పక్షానికోసారి |
గ్రామం | పంచాయితీ స్థాయి కమిటీ | రోజు వారీ పర్యవేక్షణ |
పాఠశాల | పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కమిటీ లేదా విద్యార్థి తల్లిదండ్రుల కమిటీ |
నెలకోసారి లేదా అవసరమైనప్పుడు |
ఈ పథకం వల్ల చాలా ప్రయోజనలున్నాయి: సమాజంలో వెనుకబడిన వర్గాలవారైన దళితులు, గిరిజనులు ముఖ్యంగా బాలికలను క్రమం తప్పకుండా బడికి రప్పించవచ్చు. పోషకాహారాన్ని అందజేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. నాగరిక సమాజంలో కలుపుకోవచ్చు.[23][24]
ఆర్థిక శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఈ లక్ష్యాలు కొంతమేరకు నెరవేరాయని తేలింది. చక్రవర్తి, జయరామన్, పాండే చేసిన అధ్యయనం ప్రకారం పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగింది.[25] బోరువా, ఆఫ్రిది, సోమనాథన్ చేపట్టిన అధ్యయనం ప్రకారం నేర్చుకునే నైపుణ్యం, సింగ్, డెర్కాన్, పార్కర్ చేసిన అధ్యయనంలో పోషకాహార లేమి తగ్గుదల మొదలైన లక్ష్యాలు నెరవేరాయని తెలుస్తున్నది.
కొన్ని చోట్ల కులాల ఆధారంగా వివక్షకు గురవుతున్నారు. సుఖ్ దేవ్ థోరాట్, జొయెల్ లీ 2005 లో చేసిన అధ్యయనం దీన్ని ధృవపరిచింది.[26]
ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కొన్ని నివేదికలు మహిళలకు, ముఖ్యంగా పనిచేసే మహిళలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులపై ఇది సానుకూల ఫలితాలు చూపిందని తెలియజేశాయి.[27] అంతే కాకుండా ఈ నివేదికలు ఈ పథకం నిర్వహణలో ఎదురవుతున్న అవినీతి, అపరిశుభ్రత, కుల వివక్ష, క్రమం తప్పకుండా నిర్వహించకపోవడం లాంటి విషయాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. ఉదాహరణకు కొన్ని
- డిసెంబరు 2005 లో ఢిల్లీ పోలీసులు ప్రాథమిక పాఠశాల పిల్లలకోసం ఉద్దేశించిన 2760 బస్తాల బియ్యం కలిగిన 8 ట్రక్కులను పట్టుకున్నారు. ఈ ట్రక్కులు బులంద్ షహర్ జిల్లాలోని భారత ఆహార సంస్థ గోడౌన్ల నుండి ఉత్తర ఢిల్లీ లోకి తీసుకెళ్తున్నాయి. పోలీసులు తర్వాత విచారించగా ఓ ఎన్. జి. ఓ ద్వారా బియ్యం దొంగిలించబడ్డవని తేలింది.[28]
- నవంబరు 2006 లో డార్జిలింగ్ కి 30 కి.మీ సమీపంలోని పెంబాంగ్ గ్రామ వాసులు తమ గ్రామంలో ఒకటిన్నర సంవత్సరం పైగా మధ్యాహ్న భోజన కార్యక్రమం జరగకున్నా ఉపాధ్యాయులు దొంగ లెక్కలు పంపుతున్నారని రాత పూర్వకంగా నివేదించారు.[29]
- డిసెంబరు 2006లో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ధాన్యం కోసం ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి చూపుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పరిక నివేదించింది.[30]
- 16 జులై 2013 న బీహార్, శరణ్ జిల్లా, ధర్మ సతి గ్రామంలో పురుగుల మందుతో కూడిన మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు మరణించారు.[1]
- 31 జులై 2013 న బీహార్ లోని జామూయ్ జిల్లా, కలియుగ గ్రామంలో 55 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత పాలయ్యారు. అదే రోజు ఆర్వాల్ జిల్లాలోని చామండి ప్రాథమిక పాఠశాలలో 95 మంది పిల్లలు ఒక ఎన్. జి. ఓ సరఫరా చేసిన ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు.[31]
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link)
<ref>
ట్యాగు; :1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు