మనోహర్ సింగ్ గిల్ (14 జూన్ 1936 - 15 అక్టోబర్ 2023), భారతదేశానికి చెందిన బ్యూరోక్రాట్, రాజకీయవేత్త & రచయిత. ఆయన 1958 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. గిల్ 1958 నుండి 2001 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యునిగా పని చేశాడు. ఆయన పదవీ విరమణ తరువాత, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి 2004లో పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన 2008 నుండి 2011 వరకు యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిగా & 2011లో స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిగా పని చేశాడు.
గిల్ 2000లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నాడు.[1] ఆయన "హిమాలయన్ వండర్: ట్రావెల్స్ ఇన్ లాహౌల్ అండ్ స్పితి", "యాన్ ఇండియన్ సక్సెస్ స్టోరీ", "అగ్రికల్చర్ కోఆపరేటివ్స్: ఎ కేస్ స్టడీ ఆఫ్ పంజాబ్" వంటి పుస్తకాలను రాశాడు.
గిల్ భారతదేశంలోని ముస్సోరీలోని సెయింట్ జార్జ్ కళాశాలలో చదివాడు.[ ] 1958లో, అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో చేరాడు 1966 వరకు అవిభాజ్య పంజాబ్‌లో వివిధ హోదాల్లో వివిధ ప్రదేశాలలో పరిపాలనలో పనిచేశాడు, అప్పటి వరకు పంజాబ్‌ను హిమాచల్ ప్రదేశ్ హర్యానా ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. అతను 1985-1987 వరకు పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో పంజాబ్ వ్యవసాయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు.
టి. ఎన్. శేషన్ తర్వాత గిల్ 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు 11వ భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పని చేసి 1998లో 12వ లోక్‌సభకు, 1999లో 13వ లోక్‌సభకు, 1997లో 11వ రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు & 20కి పైగా రాష్ట్రాలలో శాసనసభలకు సాధారణ ఎన్నికలను ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాడు. భారతదేశంలో పోలింగ్ దుర్వినియోగాలను అరికట్టడం కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఆయన హయాంలోనే ప్రవేశపెట్టడం జరిగింది.
గిల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారిగా రిటైర్ అయినా తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో కాంగ్రెస్ టిక్కెట్‌పై రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా[2] & గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్టాటిస్టిక్స్- ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్) మంత్రిగా పని చేశాడు. ఆయన రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
మనోహర్‌సింగ్ గిల్ వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 అక్టోబర్ 15న మరణించాడు. గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3][4]