సర్ మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ | |
---|---|
అస్సాం గవర్నరు | |
In office 4 మే 1947 – 28 డిసెంబరు 1948 | |
అంతకు ముందు వారు | హెన్రీ ఫోలీ నైట్ (ఆపద్ధర్మ) |
తరువాత వారు | రోనాల్డ్ ఫ్రాన్సిస్ లాడ్జ్ (ఆపద్ధర్మ) |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బ్రిటీషు ఇండియా | 1894 అక్టోబరు 12
మరణం | 1948 డిసెంబరు 28 వైఖాంగ్, మణిపూర్, భారతదేశం | (వయసు 54)
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | సీగ్రిడ్ వెస్ట్‌లింగ్ |
తల్లిదండ్రులు | అక్బర్ హైదరీ అమీనా హైదరీ |
వృత్తి | పాలనాధికారి, రాజకీయనాయకుడు |
సర్ మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ కెసిఐఇ, సిఎస్ఐ (12 అక్టోబర్ 1894-28 డిసెంబర్ 1948) ఒక భారతీయ పరిపాలనాధికారి, రాజకీయవేత్త. ఈయన అస్సాం ప్రావిన్స్‌కు, బ్రిటిష్ వారు నియమించిన చివరి గవర్నర్. ఈయన భారత స్వాతంత్ర్యం తరువాత కూడా గవర్నరుగా కొనసాగాడు.
హైదరీ 12 అక్టోబర్ 1894న సులేమానీ బోహ్రా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అమీనా హైదరీ, సర్ అక్బర్ హైదరీ ఈయన తల్లితండ్రులు.[1] ఏడుగురు పిల్లలలో ఈయన ఒకరు. .[2] న్యాయవాది, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బద్రుద్దీన్ తయ్యబ్జీకి ఈయన మనవడు. మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ బొంబాయి, ఆక్స్‌ఫర్డ్ లలో తన చదువును పూర్తి చేశాడు.
1919లో భారతీయ సివిల్ సర్వీసులో చేరి, మద్రాసు ప్రెసిడెన్సీలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 1924 జూన్ లో ఆయన భారత ప్రభుత్వ విద్యా, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల శాఖలో అండర్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఆయన అక్టోబరు 1927 నుండి జూన్ 1929 వరకు సిలోన్ లో గవర్నర్ జనరల్ కు ఏజెంట్ గా పనిచేశారు. ఆ కాలంలో ఈయన పెద్ద సంఖ్యలో ప్లాంటేషన్లలలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల సంక్షేమం, హక్కుల గురించి వ్యవహరించారు.[3] 1929లో ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఏర్పడిన తరువాత, ఈయన దానికి కార్యదర్శి అయ్యాడు.[4]
హైదరీ, తొలుత భారత రాచరిక సంస్థానాల ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీగా, ఆ తరువాత తన తండ్రి నేతృత్వంలోని హైదరాబాద్ ప్రతినిధి బృందానికి సలహాదారుగా, రౌండ్ టేబుల్ సమావేశాల కోసం లండన్ను సందర్శించాడు.[5] రెండవ సమావేశంలో ప్రభుత్వం తరపున మాట్లాడుతూ, "అఖండ, సంయుక్త భారతదేశం కోసం సామరస్యంగా పనిచేయాలని" ఈయన పిలుపునిచ్చాడు.[6] రెండవ సమావేశం తరువాత జరిగిన చర్చలలో, ఈయన ఫెడరల్ ఫైనాన్స్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు.[7]
తదనంతరం, హైదరీ విద్యా, ఆరోగ్య, ప్రభుత్వ భూముల శాఖకు సంయుక్త కార్యదర్శిగా తిరిగివచ్చి, తరువాత కార్మిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ దశల్లో, ఈయన, బ్రిటిష్ కాలనీలు, సూయజ్ కెనాల్‌కు తూర్పున ఉన్న ప్రాంతాలలో సరఫరాల నిల్వలను పెంచడంలో సమన్వయం చేయడానికి ఏర్పాటు చేయబడిన, ఈస్టర్న్ గ్రూప్ సప్లై కౌన్సిల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో ప్రత్యేక విధుల్లో నియమించబడ్డాడు. 1945లో, అతను వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు. సమాచార, ప్రసార విభాగం బాధ్యతలు ఈయనకు అప్పగించబడ్డాయి.[8][9][10] 1946లో భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత, హైదరీకి కార్మిక, పనులు, గనులు, విద్యుత్, సమాచారం, కళలు, ఆరోగ్య శాఖా బాధ్యతలు అప్పగించబడ్డాయి.[4]
జనవరి 1947లో, సర్ ఆండ్రూ గౌర్లే క్లో తరువాత అస్సాం గవర్నర్గా నియమితులయ్యాడు.[11] ఈయన మే 4న పదవీ బాధ్యతలు స్వీకరించి, స్వాతంత్ర్యం తరువాత కూడా ఆ పదవిని కొనసాగించాడు.[4] ఆ సమయంలో స్వతంత్ర రాష్ట్రం కోసం నాగా ఉద్యమం కొనసాగడంతో, హైదరీ ఆ సంవత్సరం జూన్లో నాగా నేషనల్ కన్వెన్షన్తో తొమ్మిది పాయింట్ల ఒప్పందంపై సంతకం చేశాడు.[12][13]
అక్బర్ హైదరీ, స్వీడిష్ మహిళ సీగ్రిడ్ వెస్ట్‌లింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు అక్బర్ హైదరీ III (1919-1998), ఇద్దరు కుమార్తెలు.[14][15][8] అక్బర్ హైదరీ అని పిలువబడే ఈయన కుమారుడు పారిశ్రామికవేత్త. 1964 నుండి 1980 వరకు వెస్ట్రన్ ఇండియా మ్యాచ్ కంపెనీ (WIMCO) లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేశాడు. ఆ తరువాత, ఫాసిట్ ఆసియా డైరెక్టర్‌గా, మద్రాసులో గౌరవ స్వీడిష్ కౌన్సుల్‌గా కూడా పనిచేశాడు.[16][17]
1948 డిసెంబర్ 28న మణిపూర్ పర్యటనలో ఉన్నప్పుడు, ఇంఫాల్ నుండి 30 మైళ్ళు (48 కిలోమీటర్లు) దూరంలో ఉన్న వైఖాంగ్ అనే గ్రామంలో ఉన్న ఢాక్ బంగ్లాలో హైదరీ గుండెపోటుతో మరణించాడు. ఈయన తన భార్య, కుమారుడు, తన గిరిజన సలహాదారు ఎన్.కె.రుస్తోంజీ, సైనిక కార్యదర్శి మేజర్ ధమిజాతో కలిసి ఈ మణిపూర్ పర్యటనలో ఉన్నాడు.[8] ఈయన మృతదేహాన్ని జాతీయ, గవర్నర్ జెండాలో కప్పిన శవపేటికలో ఊరేగింపుగా కాంగ్లా ప్యాలెస్లోని ఇంఫాల్ కంటోన్మెంట్ స్మశానవాటికకు తీసుకెళ్లారు.[18] మణిపూర్లో మూడు రోజుల సంతాపం పాటించారు.[5]