మహిళల ప్రీమియర్ లీగ్ | |
---|---|
దస్త్రం:Women's Premier League.svg | |
దేశాలు | India |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | Twenty20 cricket |
తొలి టోర్నమెంటు | 2023 |
చివరి టోర్నమెంటు | 2023 |
తరువాతి టోర్నమెంటు | 2024 |
టోర్నమెంటు ఫార్మాట్ | డబుల్ రౌడ్ రాబిన్, ప్లే ఆఫ్‌లు |
జట్ల సంఖ్య | 5 |
ప్రస్తుత ఛాంపియన్ | ముంబై ఇండియన్స్ (తొలి టైటిల్) |
అత్యధిక పరుగులు | మెగ్ లానింగ్ (345) |
అత్యధిక వికెట్లు | హేలీ మ్యాథ్యూస్ (16) |
మహిళల ప్రీమియర్ లీగ్, భారతదేశంలో మహిళలకు నిర్వహిస్తున్న క్రికెట్ ఫ్రాంచైసీ లీగ్ పోటీ. దీన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) స్థాపించి, నిర్వహిస్తోంది.[1][2]
మొదటి సీజన్ 2023 మార్చిలో జరిగింది. మొదటి టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఐదు ఫ్రాంచైజీలు పాల్గొన్న ఈ తొలి సీజనులో మ్యాచ్‌లను ముంబై, నవీ ముంబైల్లో జరిపారు.[3][4]
భారత్‌లో నిర్వహించిన పెద్ద మహిళా క్రికెట్ టోర్నమెంటు వుమెన్స్ 20 ఛాలెంజ్. 2018 లో ఇది ఒకే మ్యాచ్ ఉండే టోర్నమెంటుగా మొదలై, 2019, 2020, 2022 లలో 3 జట్లు, 3 మ్యాచ్‌లు ఉండే పోటీగా జరిగింది.
2022 ఫిబ్రవరిలో, BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మహిళల T20 ఛాలెంజ్ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్ధతి లోనే మహిళల లీగ్‌ను స్థాపించే ప్రణాళికలను ప్రకటించాడు.[5] ఆగస్టు నాటికి ప్రణాళికలు మరింత ముందుకు సాగాయి [6][7] అక్టోబరులో BCCI, 2023 మార్చిలో ఐదు-జట్లతో టోర్నమెంటును జరిపే ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది [8][9] ఈ లీగ్‌ని అనధికారికంగా ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని అన్నారు; ఆ తరువాత బిసిసిఐ దీనికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టింది.[1]
2023 జనవరి 28 న, BCCI 2027 వరకు లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది [10] టాటా గ్రూప్ వెల్లడించని మొత్తానికి ఆ బిడ్‌ను గెలుచుకుంది.[11] తొలి ఏడాది ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ టోర్నమెంట్‌లో తొలి విజేతగా నిలిచింది.[12]
లీగ్ నిర్మాణం IPL నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.[13][14]
ప్రారంభంలో ఐదు జట్లు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన మూడు జట్లు పోటీలో ప్లేఆఫ్ దశల్లోకి ప్రవేశించాయి.[15][16] లీగ్ విజయవంతమైతే భవిష్యత్ సీజన్‌లలో మ్యాచ్‌లు, ఫ్రాంచైజీల సంఖ్యను పెంచాలని బోర్డు యోచిస్తోంది.[17]
లీగ్ మొదటి సీజను 2023 మార్చి 4 నుండి మార్చి 26 వరకు జరిగింది. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియం, DY పాటిల్ స్టేడియంలలో 22 మ్యాచ్‌లు జరిగాయి.[17][18] మొదటి సీజన్‌లో మహిళలకు టిక్కెట్లు ఉచితంగా అందుబాటులో ఉంచారు.[19]
ఆకాశ నీలం రంగు క్రికెట్ దుస్తులు ధరించిన ఆడపులిని లీగ్ మస్కట్‌గా ఎంచుకున్నారు. దాని పేరు శక్తి .[20]
2023 జనవరిలో ప్రారంభ ఫ్రాంచైజీ హక్కులను క్లోజ్డ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మదుపరులు కొనుక్కున్నారు. మొత్తం 6,669 కోట్లను ఈ విధంగా సేకరించారు.[21][22]
2023 నుండి 2027 వరకు ఐదేళ్ల కాలానికి విక్రయించబడిన ఫ్రాంచైజీ హక్కులను కొనేందుకు అనేక కంపెనీలు ముందుకొచ్చాయి. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హక్కులను 1,289 కోట్లకు గెలుచుకుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై ఫ్రాంచైజీని 912.99 కోట్లతో సొంతం చేసుకుంది.[a] GMR – JSW Cricket Pvt Ltd ఢిల్లీ ఫ్రాంచైజీని 810 కోట్లకు, [b] కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ లక్నో ఫ్రాంచైజీని 757 కోట్లకూ, [c] ఆల్కహాల్ తయారీ కంపెనీ డియాజియో అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు ఫ్రాంచైజీని 901 కోట్లకూ గెలుచుకున్నాయి.[d]
మీడియా పరిశోధనా సంస్థ అయిన ఆంపియర్ అనలిటిక్స్‌కు చెందిన జాక్ జెనోవీస్ ప్రకారం, అమెరికా లోని ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక విలువైన మహిళల స్పోర్ట్స్ లీగ్ ఇదే.[14]
ఐదు ఫ్రాంచైజీలలో మూడింటికి - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ - పురుషుల IPLలో కూడా జట్లు ఉన్నాయి.
జట్టు | నగరం | తొలి సీజను | యజమానులు | కెప్టెన్ | ప్రధాన కోచ్ |
---|---|---|---|---|---|
ఢిల్లీ క్యాపిటల్స్ | న్యూఢిల్లీ | 2023 | JSW గ్రూప్ - GMR గ్రూప్ (JSW GMR క్రికెట్ ప్రైవేట్. లిమిటెడ్) [23] | మెగ్ లానింగ్ [24] | జోనాథన్ బట్టీ [25] |
గుజరాత్ జెయింట్స్ | అహ్మదాబాద్ | 2023 | అదానీ గ్రూప్ | బెత్ మూనీ [26] [e] | రాచెల్ హేన్స్ [27] |
ముంబై ఇండియన్స్ | ముంబై | 2023 | ఇండియావిన్ స్పోర్ట్స్ | హర్మన్‌ప్రీత్ కౌర్ [28] | షార్లెట్ ఎడ్వర్డ్స్ [29] |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | బెంగళూరు | 2023 | డియాజియో | స్మృతి మంధాన [30] | బెన్ సాయర్ [31] |
UP వారియర్స్ | లక్నో | 2023 | కాప్రి గ్లోబల్ | అలిస్సా హీలీ [32] | జోన్ లూయిస్ [33] |
BCCI మొదటి ఐదేళ్లలో ఫ్రాంచైజీ యజమానుల మధ్య పోటీ నుండి వచ్చే లాభాలలో 80% పంపిణీ చేయాలని భావిస్తోంది. తదుపరి ఐదు సీజన్లలో, 60% లాభాలు పంచుతారు. 11 నుండి 15 వరకు, లాభాలలో 50% పంపిణీ చేస్తారు. అదనంగా, పోటీ కోసం సెంట్రల్ లైసెన్సింగ్ హక్కుల నుండి వచ్చే ఆదాయంలో 80% ఫ్రాంఛైజీలకు పంచుతారు. ఫ్రాంచైజీలు సరుకులు, టిక్కెట్ల విక్రయాలు, ప్రకటనల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతాయి.[17]
ఫ్రాంచైజీకి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మొదటి వేలం 2023 ఫిబ్రవరి 13 న ముంబైలో జరిగింది.[29][34] దాదాపు 1,500 మంది క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.[35][36] ఒక్కో ఫ్రాంచైజీకి 12 కోట్లు ఖర్చు చేసి 15 నుండి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసారు. వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు.[13][29]
మొదటి వేలంలో కొత్త క్రీడాకారిణి బేస్ ధర 10 లక్షలు, 20 లక్షల మధ్య ఉంది. ఇప్పటికే ఆడినవాళ్ళకు ఇది 30 - 50 లక్షల మధ్య ఉంది.[37] భవిష్యత్తు సీజన్‌లలో ప్రతి ఫ్రాంచైజీ పర్స్ పరిమాణం ప్రతి సంవత్సరం 1.5 కోట్ల చొప్పున పెంచుతారు.[17]
మొదటి వేలంలో మొత్తం 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 59.5 కోట్లు వెచ్చించారు. ప్రారంభ వేలంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన క్రీడాకారిణి స్మృతి మంధాన ; ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్లకు కొనుక్కుని, జట్టు కెప్టెన్‌గా నియమించింది.[38]
టోర్నమెంటు టీవీ డిజిటల్ ప్రసారాల ప్రపంచ మీడియా హక్కులను పొందినట్లు వయాకామ్18 2023 జనవరిలో ప్రకటించింది. ఈ ఒప్పందం ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దీని విలువ 951 కోట్లు.[39] లీగ్ ప్రారంభ సీజన్ను భారతదేశంలో స్పోర్ట్స్ 18 TV ఛానెల్, JioCinema యాప్‌లు ప్రసారం చేస్తాయి. ఈ రెండూ Viacom18 యాజమాన్యంలోనే ఉన్నాయి.[40]
మొదటి సీజను జరిగే పోటీల ప్రసారాలను యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్కై స్పోర్ట్స్‌లోను,[41] ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా ద్వారా, అమెరికా, కెనడాల్లో విల్లో TV ద్వారా, దక్షిణాఫ్రికాలో సూపర్‌స్పోర్ట్స్ ద్వారా ప్రసారం చేసారు.[42]
{{cite web}}
: CS1 maint: url-status (link)