మానస్ బిహారీ వర్మ | |
---|---|
![]() | |
జననం | బావుర్ గ్రామం, ఘనశ్యామ్పుర్, బిహార్ | 1943 జూలై 29
మరణం | 2021 మే 4 లాహేరియసారై, దర్భంగా జిల్లా, భారతదేశం | (వయసు: 77)
సమాధి స్థలం | లాహేరియసారై, దర్భంగా జిల్లా, భారతదేశం |
జాతీయత | ![]() |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
మానస్ బిహారీ వర్మ భారతదేశానికి చెందిన సాంకేతిక శాస్త్ర నిపుణుడు, ఏరోనాటికల్ పరిశోధకుడు, మాజీ శాస్త్రవేత్త. భారతీయ వాయుసేన అమ్ముల పొదిలో కీలకంగా మారిన తేజస్ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించాడు. భారత ప్రభుత్వం 2018 మార్చిలో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1]
మానస్ బిహారీ వర్మ 1943, జూలై 29న బిహార్‌లోని దర్భంగ జిల్లా, ఘనశ్యామ్పుర్ ప్రాంతంలోని బావుర్ గ్రామంలో జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెలు ఉన్నారు. బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
మానస్ బిహారీ వర్మ తన 35 సంవత్సరాల సర్వీసులో దేశంలోని అన్ని ఏరోనాటికల్ సంస్థలతో కలిసి పనిచేశాడు. 2002 నుంచి 2005 వరకు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పని చేసే సమయంలో ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశాడు.[2] ఈ స్నేహంతో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రెండుసార్లు వర్మను దర్భంగ వెళ్లి కలిశాడు.
భారత మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌ను తయారు చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించాడు. తేజస్ ప్రారంభ ఆపరేషన్ క్లియరెన్స్‌తో పాటు ఆయుధాలు, మల్టీ-మోడ్ రాడార్ (ఎంఎంఆర్) పనిలో వర్మ కీలకంగా పనిచేశాడు. ఆయన రిటైర్మెంట్ తరువాత మారుమూల ప్రాంతాలకు కూడా శాస్త్రీయ విద్య చేరేలా ఉండేదుకు వీలుగా అగస్త్యా, వికాస్ భారత్ ఫౌండేషన్ల సాయంతో మొబైల్ సైన్స్ వ్యాన్లను ఏర్పాటు చేశాడు.
మానస్ బిహారీ వర్మ 2021, మే 4న బిహార్‌లోని దర్భాంగా పట్టణం, లాహేరియసారైలోని కేఎమ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించాడు.[3][4][5]