ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి | |
---|---|
![]() ఎంసీఏ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | వేణు శ్రీరామ్ |
రచన | మామిడాల తిరుపతి శ్రీకాంత్ విస్సా (మాటలు) |
స్క్రీన్ ప్లే | వేణు శ్రీరామ్ |
కథ | వేణు శ్రీరామ్ |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | భూమిక చావ్లా నానీ సాయిపల్లవి విజయ్ వర్మ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | దిల్ రాజ్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 21 డిసెంబరు 2017 |
సినిమా నిడివి | 138 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) (ఆంగ్లం: MCA - Middle Class Boy) వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 2017లో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1] ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2] ఈ సినిమాలో భూమిక, నాని ప్రధాన పాత్రలలో నటించగా, సాయిపల్లవి, విజయ్ వర్మ సహాయ పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా 2017 డిసెంబరు 21వ తేదీన విడుదల అయ్యింది.[3][4][5] వదిన, మరిది మధ్య ప్రేమానుబంధాన్ని తెలిపే సినిమాలు చాలానే వచ్చినా..పూర్తి స్థాయిలో వదినను విలన్ బారీ నుండి కాపాడుకునే మరిది అనే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మొదటి సినిమా ఇది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాని (నాని)కి చిన్నతనంలో అమ్మచనిపోవడంతో అన్న (రాజీవ్ కనకాల) తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. తమ్ముడికి అన్నే సర్వస్వం. అయితే వదిన జ్యోతి (భూమిక చావ్లా) రావడంతో అన్నతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతుంది. దానికి కారణం వదిన అనే ఫీలింగ్‌లో ఉంటాడు. నాని చదువు పూర్తయినా ఉద్యోగం రాక ఇంట్లోనే వుంటుంటాడు. తనకు చాలా టాలెంట్ వున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకపోవడంతో ఇంట్లో నానా పనులు చెప్పి దారిలో పెట్టాలనుకుంటుంది వదిన. అందుకే దూరంగా వెళ్లి హైదరాబాద్ లో బాబాయ్, పిన్నిలతో కలిసి ఉంటాడు.
అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.
వరంగల్ వచ్చిన నానికి పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. పల్లవి స్పీడు..నాని ప్రేమ ఈ రెండు కలగలిసి ..తొలిచూపులోనే పల్లవి పెళ్ళి ప్రపోజల్ తెస్తుంది. అయితే ఆ పెళ్ళి ప్రపోజల్ కి ఫిదా అయిన నాని ఆమె ప్రేమలో మునిగి తేలుతుంటాడు.
ఈ తరుణంలో శివశక్తి ట్రావెల్స్ యజమాని శివ (విజయ్)కు .. రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆ వైరంతో శివ జ్యోతిని చంపేందుకు కుట్రపన్నుతాడు. ఆ కుట్రను తెలుసుకున్న మరిది నాని కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే జ్యోతిని పదిరోజుల్లో చంపేస్తానని..అలా చంపకుంటే ఆమెను ఏమీ చేయకుండా వదిలేస్తానని నాని దగ్గర చాలెంజ్ చేస్తాడు శివ. అలాగే ఈ పదిరోజులు తన వదినను కాపాడుకుంటానని శివ దగ్గర చాలెంజ్ చేస్తాడు నాని. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్ళి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్ళి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ.[6][7]
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా పాటలకు బాణీలు కట్టాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎంసీఏ టైటిల్ సాంగ్" | చంద్రబోస్ | నకష్ అజీజ్ | 3:41 |
2. | "కొత్తగా" | శ్రీమణి | సాగర్, ప్రియా హేమేష్ | 4:38 |
3. | "ఏమైందో తెలియదు నాకు" | శ్రీమణి | కార్తీక్, వి.దీపిక | 4:10 |
4. | "ఫ్యామిలీ పార్టీ" | శ్రీమణి | జస్ప్రీత్ జాస్ | 4:01 |
5. | "ఏవండోయ్ నాని గారు" | బాలాజీ | దివ్య కుమార్, శ్రావణ భార్గవి | 4:30 |
మొత్తం నిడివి: | 19:14 |
ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తనదైన మార్కు వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో ₹20 కోట్లను వసూలు చేసింది.[8]