ముత్తు | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
రచన | కె. ఎస్. రవికుమార్ |
కథ | ప్రియదర్శన్ |
నిర్మాత | రాజం బాలచందర్ పుష్ప కందస్వామి |
తారాగణం | రజనీకాంత్ మీనా శరత్ బాబు |
ఛాయాగ్రహణం | అశోక్ రాజన్ |
కూర్పు | కె. తనికాచలం |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
పంపిణీదార్లు | కవితాలయ ప్రొడక్షంస్ |
విడుదల తేదీ | అక్టోబరు 23, 1995 |
సినిమా నిడివి | 165 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
బాక్సాఫీసు | ₹21 crore (equivalent to ₹80 crore or US$10 million in 2020) |
ముత్తు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. ఇందులో రజనీకాంత్, మీనా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు మాతృక 1994 లో మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తెన్మవిన్ కొంబత్ అనే సినిమా.[1][2] ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. అక్టోబరు 23, 1995 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది మంచి వసూళ్ళు రాబట్టింది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది. 1998 లో జపనీస్ భాషలో విడుదలై రజనీకాంత్ కు జపాన్ లో కూడా అభిమానుల్ని సంపాదించిపెట్టింది.
ముత్తు (రజనీకాంత్) శివకామి అమ్మ (జయభారతి) జమీనులో పనిచేసే దయాగుణం మెండుగా కలిగిన పనివాడు. శివకామి కొడుకైన రాజా (శరత్ బాబు) గుర్రబ్బండినీ, గుర్రాలను జాగ్రత్తగా చూసుకోవడం అతని బాధ్యత. ముత్తు జమీందారు కుటుంబానికి చాలా నమ్మకంగా సేవలు చేస్తుంటాడు. ఒకసారి ముత్తు, రాజా కలిసి బండిలో వెళుతుండగా ఒక నాటకాల కంపెనీలో పనిచేసే రంగనాయకి (మీనా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రాజా వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు. రాజాకు మేనమామ అయిన ఉపేంద్ర (రాధా రవి) తన కూతురు పద్మిని (శుభశ్రీ) ని రాజాకిచ్చి పెళ్ళి చేయాలనుకుంటూ ఉంటాడు.
రంగనాయకి బృందం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే రాజా వారందరికీ తన దివాణంలో ఉద్యోగాలిస్తాడు. ఇప్పుడు ముత్తు, రంగనాయకి పరస్పరం ప్రేమలో పడతారు. శివకామి ఇది గమనిస్తుంది. కాళీ (పొన్నంబళం) ఉపేంద్ర కి నమ్మినబంటు. దివాణంలో పనిచేస్తూ అక్కడ జరిగే విషయాలన్నీ అతనికి రహస్యంగా చేరవేస్తుంటాడు. కాళీ రాజా దగ్గరకి వెళ్ళి రంగనాయకిని పెళ్ళి చేసుకోమని ముత్తు ఒత్తిడి చేస్తున్నాడని అబద్ధం చెబుతాడు. దాంతో రాజా ముత్తును కొట్టి తరిమేయమని కాళీని పురమాయిస్తాడు. దాంతో ముత్తు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న శివకామి రాజాను మందలిస్తుంది. ముత్తు, రంగనాయకి ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు చెబుతుంది. ముత్తును గురించి అసలు నిజం కూడా తెలియజేస్తుంది. దాంతో రాజా తన తప్పు తెలుసుకుంటాడు.
ముత్తు తండ్రి (రజనీకాంత్) నిజానికి ఆ దివాణానికి జమీందారు. వాళ్ళు అనుభవించే ఆస్తులన్నీ ఆయన సంపాదించినవే. రాజశేఖర్ (రఘువరన్) జమీందారుకు తమ్ముడు వరసవుతాడు. అతను దివాణంలోనే ఉంటాడు. అతనికి శివకామితో పెళ్ళవుతుంది. వారికి రాజా పుట్టిన తర్వాత జమీందారుకు పిల్లలు లేకపోవడంతో రాజాను ఆయన దత్తత తీసుకుంటాడు. తరువాత జమీందారు భార్య ఒక పిల్లాడికి జన్మనిచ్చి పురిట్లోనే కన్నుమూస్తుంది. రాజశేఖర్, ఉపేంద్ర కలిసి నకిలీ పత్రాలు సృష్టించి జమీందారు ఆస్తులు కొట్టేయాలని పథకం వేస్తారు. జమీందారుకు తన చుట్టూ జరుగుతున్న ఈ దారుణాలన్నీ తెలుసుకుని జీవితం మీదే విరక్తి కలుగుతుంది. దాంతో ఆయన ఆస్తులంతా రాజశేఖర్, అతని కుటుంబానికి రాసిచ్చేసి ముత్తును తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. దాంతో శివకామి తన భర్త చేసిన తప్పును ఒప్పుకుని జమీందారును క్షమాపణ వేడుకుని కనీసం ముత్తును తన దగ్గర వదిలి వెళితే తాను పెంచి పెద్ద చేస్తాననీ కోరుతుంది. జమీందారు అలాగే ఒప్పుకుని ముత్తును సాధారణ బిడ్డలాగా పెంచమని చెప్పి వెళ్ళిపోతాడు. శివకామి అందుకు అంగీకరిస్తుంది. జమీందారు గొప్పతనం తెలుసుకున్న రాజశేఖర్ సిగ్గుతో, అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు. జమీందారు రాజభవనాన్ని వదిలి వెళ్ళిపోగానే శివకామి వేరే ఊరుకు వెళ్ళిపోతుంది. ముత్తును సాధారణ మనిషిలా పెంచడం కోసం అందరితో ఆమె ముత్తు చనిపోయాడని అబద్ధం చెబుతుంది.
ముత్తు తండ్రి చుట్టుపక్కలే ఎక్కడో విరాగిగా తిరుగుతుంటాడని తెలుసుకున్న రాజా ఆయన్ను తిరిగి ఇంటికి తీసుకువద్దామని బయలు దేరతాడు. ఈ సంభాషణంతా చాటుగా విన్న కాళీ అదే విషయాన్ని ఉపేంద్రకు చేరవేస్తాడు. దాంతో ఉపేంద్ర దారిలో రాజాను చంపి ఆ నేరాన్ని ముత్తు మీద నెట్టేస్తే ఆస్తంతా తమ వశం అవుతుందని భావిస్తారు. దారిలో వెళుతున్న రాజాను కాళీ కొట్టి పడేస్తాడు. కానీ జమీందారు అతన్ని రక్షించి పద్మినితో పెళ్ళి చేసి పంపిస్తాడు. ముత్తు కాళీని నిర్బంధించి జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు. తన తండ్రిని కలుసుకోవడానికి వెళతాడు. కానీ అప్పటికే ఆయన అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ముత్తు కొత్తగా జమీందారు అవుతాడు కానీ తానూ అందరితో సమానంగా మెలుగుతానని చెప్పడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రకు తెలుగులో గాయకుడు నాగూర్ బాబు డబ్బింగ్ చెప్పాడు. అంతకు ముందు రజనీకాంత్ పాత్రకు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ చిత్రం తర్వాత దాదాపు అన్ని రజనీకాంత్ తెలుగు అనువాద చిత్రాలకు నాగూర్ బాబే డబ్బింగ్ చెప్పాడు.[3]
పాట | పాడిన వారు | రాసినవారు |
---|---|---|
థిల్లానా థిల్లానా | మనో | |
ఒకడే ఒక్కడు మొనగాడు | బాలు | |
కొంగ చిట్టి కొంగా | బాలు |