మృగవని జాతీయ వనం | |
---|---|
![]() | |
రకం | ఉద్యానవనం |
స్థానం | హైదరాబాద్, తెలంగాణ |
సమీప పట్టణం | హైదరాబాద్ |
అక్షాంశరేఖాంశాలు | 17°21′19″N 78°20′17″E / 17.355228°N 78.338159°E |
మృగవని జాతీయ వనం (ఆంగ్లం: Mrugavani National Park) తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉంది. ఇది హైదారాబాదులోని మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో మొయినాబాద్ మండలం చిలుకూర్ గ్రామంలో 3.6 చదరపు కిలోమీటర్ల (1.4 చదరపు మైళ్ళు) లలో లేదా సుమారు 850 ఎకరాల్లో విస్తరించి ఉంది.
రక్షిత అడవిగా ఉన్న ఈ పార్కుకు 1998లో మృగవని జాతీయ వనంగా నామకరణం చేశారు. ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అటవీ శాఖ అభివృద్ధి సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్కు జీవవైవిధ్యానికి నిలయంగా మారింది. పార్కులోనే సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.[1]
ఇందులో ఐదొందల చుక్కల జింకలు, 40 వరకు సాంబరు దుప్పిలు, 200పైగా నెమళ్లు, 100 జాతులకు పైగా పక్షులు, పదుల సంఖ్యలో జీవచరాలు ఉన్నాయి. జంతువులు నీళ్లు తాగడానికి పార్కులో అక్కడక్కడ నీటి తొట్లను ఏర్పాటు చేశారు. కొన్ని చెట్లు, ఔషధ మొక్కలను గుర్తించేలా శాస్త్రీయ పేర్లతో వాటికి బోర్డులు తగిలించారు.
2012లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు మృగవని పార్కును సందర్శించి, ఇక్కడ ఉన్న చెట్లు, అరుదైన జాతుల ఔషధ మొక్కలు, వివిధ రకాల పక్షి, జంతు సంపదను చూసి మెచ్చుకున్నారు.
వారానికోసారి ప్రకృతి సంపదపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు పర్యావరణం, వన్యప్రాణుల గురించిన వివిధ అంశాలపై అవగాహన తరగతలు నిర్వహిస్తారు. దీనికోసం పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రంను, 40మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియాన్ని నిర్మించారు. ఇందులో విద్యార్థులకు వీడియో ప్రదర్శణ ద్వారా రాష్ట్రంలోని పార్కులు, అభయారణ్యాలు, వన్యప్రాణులు, పర్యావరణ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా వివిధ రకాల జంతువుల నమూనాలతో మ్యూజియం, విద్యార్థులకు వన్యప్రాణులు, పర్యావరణంపై విజ్ఞానం పొందడానికి ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేశారు.