మెరైన్ డ్రైవ్ (ఆంగ్లం: Marine drive) ముంబాయి నగరంలోని ఒక ముఖ్యమైన రహదారి. అధికారికంగా దీని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహదారి. ఈ రహదారి ప్రత్యేకత ఏమంటే, ఒక పక్క అరేబియా సముద్రము ఊంటుంది. మరొక పక్క అందమయిన ఎత్తయిన భవనాలు ఉంటాయి. ముంబాయి నగరవాసులు శలవదినాలలో, ఆదివారములలో సేదతీరుటకు ఇక్కడకు చేరుకుంటారు. ప్రతిరోజు ఉదయం పూట వ్యాయామంలో భాగంగా ఉదయపు నడక చేసేవారికి ఇది ఒక చక్కటి వేదిక. సముద్రం వైపు చాలా భాగం ప్రజలు నడవటానికి చాలా వెడల్పైన కాలినడక ప్రాంతాన్ని(Foot Path)ను ఏర్పాటు చేసారు. సముద్రపు గోడకూడ వెడల్పుగా ఉండి ప్రజలు కూచోవటానికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. నారీమన్ పాయింట్ (Nariman Point) నుండి మలబార్ హిల్స్(Malabar Hills) వరకు మెరైన్ డ్రైవ్ విస్తరించి ఉన్నది. మెరైన్ డ్రైవ్ నిర్మాణము 1935లో ప్రారంభమైంది. 1940లో నిర్మాణం పూర్తయినప్పుడు ఈ రోడ్డుకు క్వీన్స్ నెక్లెస్ (రాణీ హారము) గా నామకరణం చేశారు.[1] ఇది ముంబాయిలోనే అత్యంత శోభాయమానమైన మార్గంగా రూపొందింది.
ముంబాయి నగరంలో వినాయక చవితి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. చివరి రోజున జరిగే నిమజ్జన ఉత్సవానికి మరైన్ డ్రైవ్ ముఖ్య కేంద్రం. నిమజ్జనం జరిగే గిర్గావ్ చౌపాటీ(చౌపాటీ అంటే సముద్ర తీరం) మరైన్ డ్రైవ్ కు మలబార్ హిల్స్ వైపుకు ఉన్నది. నగరంలోంచి నిమజ్జనానికి వచ్చే విగ్రహాలన్నీ కూడ మరైన్ డ్రైవ్ మీదుగానె ఊరేగింపుగా వెల్తాయి. ఈ నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి ప్రజలు తండొప తండాలుగా వస్తారు. వారందరికి రహదారి మరైన్ డ్రైవ్.
ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరిగె మారథాన్(పరుగు పోటీ)కు కూడ ప్రధాన కేంద్రం మరైన్ డ్రైవ్. ఈ మారథాన్ ఇక్కడనుండి ప్ర్రారంబమవుతుంది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు -సినీ నటులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్య కర్తలు-ఈ మారథాన్ లో ఉత్సాహంగా పాల్గొంటారు.
వాయుసేన వారు నిర్వహించే విమానోత్సవాలకు కూడ మరైన్ డ్రైవ్ ముఖ్య వేదిక. నగరంలోని వివిధ విమాన కేంద్రాలనుండి, వాయు సేన విమానాలు వచ్చి సముద్రం మీద రక రకాల విన్యాసాలు జరిపి ప్రజలను అలరిస్తాయి. విమానోత్సవాలు 4-5 సంవత్స్రరాలకొకసారి నిర్వహిస్తూ ఉంటారు.
మరైన్ డ్రైవ్ మీద అనేక చూడ చక్కటి భవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏర్ ఇండియా వారి భవనం, ఒబెరాయ్-ట్రైడెంట్ హోటల్ సముదాయం, ఎన్ సి పి ఎ అపార్టుమెంటు సముదాయం వంటివి ముఖ్యమైనవి. ఇవి కాక, తారాపోర్ వాల మత్స్య కేంద్రం ఉన్నది. ఇక్కడ అనేక రకరకాల చేపలను అద్దాల పెట్టెలలో ఉంచి చూపుతారు. చిన్న చిన్న చేపల దగ్గర నుండి, చాలా పెద్ద చేపలవరకు, తాబేళ్ళు రకరకాల పరిమాణంలో ఉన్న గాజు పేటికలలొని నీటిలో ఈదుతూ ఉంటే సందర్శకులు చూడవచ్చు
ఇవి కాక, మరైన్ డ్రైవ్ దగ్గరగా చర్చ్ గేట్ స్టేషను, పశ్చిమ రైల్వే ముఖ్య కేద్రం, హైకోర్ట్, మంబాయి విశ్వవిద్యాలయం, పసిద్ధి కెక్కిన ముంబాయి స్టాక్ ఎక్సేంజి , ఫ్లోరా ఫౌటైన్, మహరాష్ట్ర శాసన సభ, అనేక బాంకుల ముఖ్య కార్యాలయాలు (స్టేట్ బాంకు, సెంట్రల్ బాంకు, యూనియన్ బాంకు)షిప్పింగ్ కార్పొరేషన్ ముఖ్య కార్యాలయం ఉన్నాయి.
మరైన్ డ్రైవ్ సందర్శించాలనుకునేవారు, పశ్చిమ రైల్వేలోని మరైన్ లైన్ లేదా చర్చ్ గేట్ లోకల్ రైల్ స్టేషనులలొ దిగి, నడకన ఇక్కడకు చేరుకొనవచ్చు. మధ్య రైల్వేలోని ఛత్రపతి శివాజి రైల్వే స్టేషను నుంచి కూడ ఇక్కడకు రావచ్చు కాని, టాక్సీ మీద రావలిసి ఉంటుంది.