గౌరవ మెహర్ చంద్ మహాజన్ | |
---|---|
3వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1954 జనవరి 4 – 1954 డిసెంబరు 22 | |
Appointed by | బాబూ రాజేంద్ర ప్రసాద్ |
అంతకు ముందు వారు | ఎం. పతంజలి శాస్త్రి |
తరువాత వారు | బిజన్ కుమార్ ముఖర్జియా |
జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి | |
In office 1947 అక్టోబరు 15 – 1948 మార్చి 5 | |
అంతకు ముందు వారు | జనక్ సింగ్ |
తరువాత వారు | షేక్ అబ్దుల్లా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ | 1889 డిసెంబరు 23
మరణం | 1967 డిసెంబరు 11 | (వయసు 77)
జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ (1889, డిసెంబరు 23 - 1967, డిసెంబరు 11) భారతదేశ సుప్రీంకోర్టు మూడవ ప్రధాన న్యాయమూర్తి. మహారాజా హరిసింగ్ హయాంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. భారతదేశం - పాకిస్తాన్ సరిహద్దులను ఏర్పాటుచేసిన రాడ్‌క్లిఫ్ కమిషన్‌లో భారత జాతీయ కాంగ్రెస్ నామినీగా ఉన్నాడు. జస్టిస్ మహాజన్ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, రాజకీయ నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.
మెహర్ చంద్ మహాజన్ 1889 డిసెంబరు 23న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలోజన్మించాడు. అతని తండ్రి లాలా బ్రిజ్ లాల్ న్యాయవాది, ధర్మశాలలో ప్రసిద్ధ న్యాయవాద విద్యను స్థాపించాడు.[1] మహాజన్ పాఠశాల విద్య తరువాత, 1910లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) లో చేరాడు. తండ్రి మాటతో న్యాయవిద్యకు మారాడు. 1912లో ఎల్.ఎల్.బి. డిగ్రీ పట్టా పొందాడు.[1]
1913లో ధర్మశాలలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన మహాజన్, అక్కడ ఒక సంవత్సరంపాటు ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత 1914-1918 మధ్యకాలంలో నాలుగు సంవత్సరాలపాటు గురుదాస్‌పూర్‌లో న్యాయవాది పనిచేశాడు.1918 నుండి 1943 వరకు లాహోర్‌లో న్యాయవాద వృత్తిని అభ్యసించాడు. 1938 నుండి 1943 వరకు లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
స్వాతంత్ర్యానికి రావడానికి ముందే పంజాబ్ హైకోర్టులో న్యాయమూర్తి పదవిని చేపట్టాడు. జమ్మూ - కాశ్మీర్ మహారాజు భారతదేశంతో విలీనానికి సంబంధించిన చర్చల కోసం తన ప్రధానమంత్రిని కావాలని పిలిచాడు.[2]
మహాజన్ 1947 సెప్టెంబరులో మహారాణి ఆహ్వానం మేరకు కాశ్మీర్‌ను సందర్శించాడు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రధానమంత్రిగా ఉండవలసిందిగా కోరగా ఆయన అంగీకరించి, 1947 అక్టోబరు 15న జమ్మూ & కాశ్మీర్ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోకి చేర్చడంలో పాత్ర పోషించాడు.[3] 1947 అక్టోబరులో జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. మహాజన్ భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ 1వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1948 మార్చి 5 వరకు పనిచేశాడు.
మహాజన్ 1954 జనవరి 4న భారతదేశం మూడవ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. 1954 డిసెంబరు 22న పదవీ విరమణ చేసే వరకు దాదాపు ఒక సంవత్సరంపాటు భారతదేశ న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉన్నాడు. (65 సంవత్సరాల వయస్సులో తప్పనిసరి పదవీ విరమణ). ప్రధాన న్యాయమూర్తి కావడానికి ముందు 1948 అక్టోబరు 4 నుండి 1954 జనవరి 3 వరకు స్వతంత్ర భారతదేశ సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తులలో ఒకరిగా పనిచేశాడు.
మహాజన్ 1967, డిసెంబరు 11న మరణించాడు.