మొదటి ఆదిత్యచోళుడు | |
---|---|
రాజకేసరి | |
పరిపాలన | సా.శ. 870–907 |
పూర్వాధికారి | విజయాలయ చోళుడు |
ఉత్తరాధికారి | మొదటి పరాంతకుడు |
జననం | తెలియదు |
మరణం | సా.శ. 907 |
రాణి | త్రిభువనమాదేవయ్యార్ ఇలంగోన్ పిచ్చి |
వంశము | మొదటి పరాంతకుడు |
తండ్రి | విజయాలయ చోళుడు |
మొదటి ఆదిత్యచోళుడు (క్రీ.పూ.870-907) చోళరాజాన్ని మధ్యయుగంలో పున:స్థాపించిన విజయాలయ చోళుని కుమారుడు. విజయాలయ చోళుడు పల్లవులను ఎదిరించి తంజావూరు చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించాడు.[1] ఆ విస్తరణను మొదటి ఆదిత్యచోళుడు కొనసాగించాడు.
పల్లవుల అంతర్యుద్ధంలో అపరాజిత వర్మన్ పక్షం వహించి యుద్ధ విజయానంతరం పాండ్య భూభాగాలను సాధించడం ద్వారానూ, తదుపరి కాలంలో అదే అపరాజిత వర్మన్ దండెత్తి జయించడం ద్వారానూ చోళ రాజ్యాన్ని విశేషంగా విస్తరించాడు. ఈ క్రమంలో చేసిన వీరకృత్యాలకు, పొందినవిజయాలకు తొండైనాడును గెలుపొందినవాడిగానూ, అపరాజితుడిని యుద్ధంలో ఏనుగెక్కి చంపినవాడిగానూ, తొండైమండలంలో పల్లవుల పరిపాలనకు ముగింపు పలికినవాడిగానూ నిలిచి పేరొందాడు.
ఆదిత్యచోళుడు తన సరిహద్దుల్లోని చేర రాజ్యంతో మంచి సంబంధాలు పెంపొందించుకున్నాడు. తన కుమారుడు పరాంతకునికి చేర రాకుమార్తెతో పెళ్ళికావడం ఈ సంబంధాలకు మరింత బలం చేకూర్చింది. ఆదిత్యచోళుడు తన పాలనలో 108 శివాలయాలను నిర్మించాడు. దాదాపు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసిన ఆదిత్యుడు 907లో మరణించాడు. ఇతనికి వారసునిగా ఇతని కుమారుడు మొదటి పరంతకచోళుడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆదిత్యచోళుడు మరణించిన ప్రదేశంలో అతని చితాభస్మం మీద నిర్మించిన ఆదిత్యేశ్వర దేవాలయం (లేక కోదండరామేశ్వరాలయం) ఈనాటి శ్రీకాళహస్తి సమీపంలోని బొక్కసంపాడులో ఉంది.
చోళ దేశం మీద దండయాత్ర సమయంలో పల్లవ రాజు మూడవ నందివర్మన్ పెద్ద కుమారుడు నృపతుంగునికి పాండ్యరాజు రెండవ వరగుణన్ వర్మ మిత్రుడు అయ్యాడు.
సా.శ. 869లో నందివర్మన్ మరణించాకా నృపతుంగ వర్మన్ కి, అతని సవతి సోదరుడు అపరాజిత వర్మన్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. బహుశా రాజ్యాన్ని తన స్వంతంగా పరిపాలించాలనే ఆశయం కారణంగా అయి ఉండవచ్చు. ఇరువర్గాలు మిత్రుల కోసం చూశాయి. అపరాజితుడు గంగారాజు మొదటి పృథ్వీపతితోనూ, మొదటి ఆదిత్య చోళుడితోనూ పొత్తు పెట్టుకోగా, నృపతుంగ వర్మన్ వరగుణ పాండ్యునితో మైత్రి కొనసాగించాడు. కొన్ని వర్ణనల ప్రకారం కొందరు చరిత్రకారులు అపరాజితుడిని నృపతుంగ వర్మ కుమారుడిగా భావిస్తున్నారు. అతని తల్లి పృథ్వీమాణికమ్ కుమార్తెగా గుర్తించబడింది.
ప్రత్యర్థి సైన్యాలు కుంబకోణం సమీపంలోని తిరుపురంబియం వద్ద ఎదురుపడ్డాయి. సా.శ. 885లో పాండ్య, నృపతుంగ పల్లవ సైన్యాలను అపరాజిత పల్లవుడు, మొదటి ఆదిత్యచోళుడు ఎదిరించారు. యుద్ధంలో అపరాజుత వర్మన్-ఆదిత్యచోళుల పక్షానికి విజయం లభించింది. పేరుకు ఇది పల్లవుల అంతర్యుద్ధమైనా వాస్తవానికి స్పష్టమైన ఆధిపత్యం కొరకు పల్లవులు, పాండ్యుల మధ్య జరిగిన యుద్ధంగా ఇది భావించబడింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏ ఉద్దేశాలతో ప్రారంభమైనా చివరకు చోళుల ప్రాబల్యానికి ఇది సోపానంగా ఉపయోగపడింది.
తిరుపురంబియం పల్లవ అంతర్యుద్ధంలో అపరాజితుడు విజేత అయినప్పటికీ ఆ యుద్ధం వల్ల నిజమైన ప్రయోజనాలు మొదటి ఆదిత్యచోళుడికే అందాయి. ఈ యుద్ధం కారణంగా దక్షిణాదిలో పాండ్యుల శక్తి అంతం అయ్యింది. తరువాత పాండ్య వరగుణవర్మన్ తన సింహాసనాన్ని త్యజించి సన్యాసి జీవితాన్ని అనుసరించాడు. మొదటి ఆదిత్యచోళుడి సహాయానికి ఫలితంగా తన తండ్రి విజయాలయచోళుడు గెలుచుకున్న భూభాగాలపై అతని హక్కు ధ్రువీకరింపబడడమే కాకుండా ఓడిపోయిన పాండ్యుల నుండి కొత్త భూభాగాలు కూడా చోళ రాజ్యానికి సంక్రమించాయి.
మొదటి ఆదిత్య చోళుడు తన తండ్రి, తాను సాధించిన భూభాగంతో సంతృప్తి చెందలేదు. సా.శ. 903లో తన పాలనకు వచ్చిన 32వ సంవత్సరంలో తన పూర్వ అధిపతి అయిత పల్లవ రాజు అపరాజితుడి మీద దాడి చేశాడు. ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఆదిత్యచోళుడు అపరాజితుడిని ఏనుగు మీద ఎక్కి చంపాడు. ఇది తోండైమండలం (ఉత్తర తమిళనాడు)లో పల్లవుల పాలనకు ముగింపుగా నిలిచింది. పల్లవ రాజ్యం మొత్తం చోళ భూభాగంగా మారింది. ఇది దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యంగా వెలిగిన పల్లవుల ప్రభావాన్ని ముగించివేసింది.[ఆధారం చూపాలి]
మొదటి ఆదిత్యచోళుడు సంపాదించిన తొండై మండలం విజయాన్ని గుర్తిస్తూ "తొండైనాడు పవిన రాజకేసరివర్మన్" (తొండైనాడును సాధించిన రాజకేసరివర్మన్) అన్న బిరుదు వచ్చిచేరింది. ఇతను ఈనాటి మధ్య తమిళనాడు ప్రాంతమైన కొంగునాడులోకి దండయాత్రలు చేసి ఆ ప్రాంతంలో కూడా రాజ్యాన్ని విస్తరించాడు.
మొదటి ఆదిత్యచోళుడు చోళ రాజ్యాన్ని 36 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అతనికి చోళరాజులకు పారంపర్యంగా వచ్చే బిరుదైన రాజకేసరి అన్నది ముఖ్యమైన బిరుదుగా ఉండేది. దీనితో పాటుగా కోదండరామ అన్న పేరు కూడా ఉంది.[2]
ఆదిత్యునికి ఇలంగోను పిచ్చి, వయిరి అక్కన్ (త్రిభువన మాదేవియారు) అన్న ఇద్దరు రాణులు ఉన్నారని చరిత్రకారులు చెప్తారు. అయితే, శాసనాల ప్రకారం ఈ ఇద్దరే కాక తెన్నవన్ మహాదేవి, తిరునారన మహాదేవి, చెంబియన్ దేవియార్ (కులమణిక్క నంపిరాత్తియార్), అళిసి కట్టడిగాళ్ వంటి పలువురు ఇతర రాణులున్నట్టు తేలుతోంది.[3] ఈ రాణులతో పాటు మొదటి ఆదిత్యునికి నంగై సత్తపెరుమనారు అనే ఉంపుడుగత్తె ఉన్నట్లు ఒక శాసనం రుజువుగా ఉంది.
మొదటి ఆదిత్యచోళుడి పాలనలో చేర, చోళుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిత్యచోళుని సమకాలికుడైన చేర రాజు స్థాను రవి నుంచి రాజగౌరవాలు పొందినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. ఆదిత్యుని కుమారుడు మొదటి పరాంతకుడు స్థానురవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కొంగునాడులో రాజ్య విస్తరణకు మొదటి ఆదిత్యచోళుడు చేసిన యుద్ధాల్లో స్థానురవి సహాయకునిగా ఉన్నాడని, వీరిద్దరూ కలసి తమకు యుద్ధాల్లో సాయం చేసిన తంజావూరుకు చెందిన సైన్యాధిపతి విక్కీ అణ్ణన్ కి సైనిక బిరుదాలను, గౌరవాలను కల్పించారని శాసనాల ఆధారంగా కొందరు చరిత్రకారులు చెప్తున్నారు.[4][5]
తిరుపురంబియం యుద్ధంలో తన విజయాన్ని పురస్కరించుకుని కావేరీ నదీ తీరంలో వరుసగా పలు శివాలయాలను నిర్మిస్తూ సాగాడు.[6] తన పాలనాకాలంలో మొత్తంగా మొదటి ఆదిత్యచోళుడు కావేరి ఒడ్డున 108 శివాలయాలను నిర్మించాడని పేరొందాడు. కన్యాకుమారి శాసనం కోదండరామ అనే ఇంటిపేరుతో మొదటి ఆదిత్యచోళుడు కూడా పిలువబడ్డాడని సమాచారం ఇస్తుంది. తొండైమనారూరు పట్టణానికి సమీపంలో కోదండరామేశ్వర అని పిలువబడే ఆలయం ఒకటి ఉంది. దాని శాసనాలలో ఆదిత్యేశ్వర అనే పేరు కూడా ఉంది. దీనిని మొదటి ఆదిత్యుడు నిర్మించినట్లు తెలుస్తోంది. అతను సా.శ. 872 - 900 కాలంలో తిరువణ్ణామలైలోని అణ్ణామలైయారు గర్భగుడిని కూడా పునర్నిర్మించాడు. ఆదిశంకరాచార్యుల అభిమాన శిష్యుడైన కుమరిలభట్టు శిష్యులు సురేశ్వర, ప్రభాకరలకు కూడా ఆదిత్యుడు పోషకునిగా ఉన్నాడు. ఆ కవులు కావేరి ఒడ్డున స్థిరపడ్డారని[Notes 1], వారు మనుకులా ఆదిత్యచోళుడి చేత నియమించబడ్డారని ధృవీకరిస్తున్నారు.
ఆదిత్యుడు సా.శ.907లో ఈనాటి శ్రీకాళహస్తికి సమీపంలో తొండైమనారూరు అన్న ప్రదేశంలో మరణించాడని శాసనాలు చెప్తున్నాయి.[Notes 2] అతని కుమారుడు, వారసుడు అయిన మొదటి పరాంతకుడు ఆదిత్యుడు మరణించినచోట శివాలయాన్ని పళ్ళిప్పడైగా[Notes 3] నిర్మించాడు. ఈ శివాలయానికి ఆదిత్యుని పేర్ల మీదుగా ఆదిత్యేశ్వరాలయం అనీ, కోదండరామేశ్వరాలయం అనీ పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ శివాలయం బొక్కసంపాలెం గ్రామంలో నెలకొని ఉంది.[7] అతని మునిమనుమడి కుమారుడైన రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు.[8]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
అంతకు ముందువారు విజయాలయ చోళుడు |
చోళ సామ్రాజ్యం సా.శ.871–907 |
తరువాత వారు మొదటి పరాంతకచోళుడు |