మౌళి | |
---|---|
జననం | తిరువిదైమరుదూర్ సాంబమూర్తి గణపతి బాలకృష్ణ శాస్త్రి మౌళి 1947 మార్చి 14 కానాతుకాత్తన్, మద్రాసు రాష్ట్రం, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | టి.ఎస్.బి.కె.మౌళి, బి.చంద్రమౌళి, బి.సి.మౌళి |
వృత్తి | నటుడు, చలనచిత్ర దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
టి.ఎస్.బి.కె.మౌళి (తిరువిదైమరుదూర్ సాంబమూర్తి గణపతి బాలకృష్ణ శాస్త్రి మౌళి) భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు, నాటక ప్రయోక్త. ఇతడు అనేక తమిళ, తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. సినీ రచయితగా ఇతడు అశ్వని చిత్రానికి వ్రాసిన స్క్రిప్ట్ పేర్కొనదగినది. ఇతని మూడు ప్రసిద్ధ నాటకాలు తెలుగు, బెంగాలీ భాషలలోనికి అనువదించబడి ఆంధ్రరాష్ట్రంలోను, వంగదేశంలోను 4000కు పైగా ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఇతనికి తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5సార్లు నంది పురస్కారాలతోను సత్కరించింది.
ఇతని తండ్రి టి.ఎస్.బాలకృష్ణ శాస్త్రి హరికథా కళాకారుడు. మౌళి తన చిన్నతనంలో నాటకాలలో నటించడానికి ఎక్కువ మక్కువ చూపేవాడు. టి.కె.షణ్ముగం, ఎస్.వి.సహస్రనామం మొదలైన వారి నాటకాలు ఇతడిపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. ఇతడు బి.టెక్ డిగ్రీని సంపాదించినప్పటికీ నాటక రచన పట్ల ఇతని మోహం తగ్గలేదు. తన 19వ యేట ఇతడు ఒక 45 నిమిషాల నాటకం వ్రాసి శివాజీ గణేశన్‌కు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రదర్శించాడు. ఇతడు కళాశాలలో చదువుకునే సమయంలో వై.జి.పార్థసారథి నెలకొల్పిన యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (UAA)లో భాగస్వామిగా ఉన్నాడు. 1969లో ఇతడు "ఫ్లైట్ నెం.176" అనే నాటకాన్ని వ్రాసి అందులో నటించాడు. ఈ నాటకం విజయవంతంగా 30 సంవత్సరాలు అవిచ్చిన్నంగా ప్రదర్శించబడింది.
తరువాత ఇతడు సినిమా దర్శకత్వం వైపు తన దృష్టిని సారించాడు. ఏ దర్శకుడి వద్ద సహాయకుడిగా పనిచేయకుండానే ఇతడు నేరుగా మొదటిసారి ఇవర్‌గళ్ విద్యాసమానవర్గళ్ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇతని రెండవ సినిమా మాత్రవై నిరిల్ కొత్త నటులతో కేవలం 26రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుని 100 రోజులు ప్రదర్శింపబడి వాణిజ్యపరంగా విజయవంతమైంది. తరువాత ఇతడు కె.బాలచందర్ బ్యానర్‌లో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. బాలచందర్ దర్శకత్వం వహించిన నిళల్ నిజమాగిరదు చిత్రానికి కామెడీ ట్రాక్ వ్రాశాడు. ఇతని సినిమా వా ఇంద పక్కమ్ తెలుగులోనికి డబ్ చేయబడి ఇతడు తెలుగు చలనచిత్రరంగంలో ప్రవేశించాడు. ఆ చిత్రనిర్మాత ఇతడిని తెలుగులో డైరెక్ట్ సినిమా చేయమని కోరాడు. ఐతే ఇతనికి తెలుగు భాష బొత్తిగా తెలియదు. తెలుగు రచయిత జంధ్యాల సహాయంతో ఇతడు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. అది మొదలు ఇతడు తెలుగు, తమిళ భాషలలో వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు మహానగరంలో మాయగాడు, హలో డార్లింగ్, చెప్పవే చిరుగాలి మొదలైన చిత్రాలలో నటించాడు.
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
విడుదల సంవత్సరం | చిత్రం పేరు | నటీ నటులు | విశేషాలు |
---|---|---|---|
1982 | పట్నం మొగుడు పల్లెటూరి పెళ్ళాం | ప్రతాప్ పోతన్ | వా ఇంద పక్కమ్ తమిళ సినిమా డబ్బింగ్ |
1982 | పట్నం వచ్చిన పతివ్రతలు | చిరంజీవి, మోహన్ బాబు , రాధిక, గీత | |
1984 | ప్రేమ పరీక్ష | ప్రతాప్ పోతన్, సుహాసిని | నాంద్రి మీందమ్ వరుగ తమిళ సినిమా డబ్బింగ్ |
1986 | పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు | భానుచందర్, సుహాసిని | |
1987 | అక్షింతలు | నందమూరి కళ్యాణ చక్రవర్తి, రమ్యకృష్ణ | |
1987 | చందమామ రావే | చంద్రమోహన్, కల్పన | |
1987 | రౌడీ పోలీస్ | భానుచందర్, రాధిక | |
1988 | ఓ భార్య కథ | చంద్రమోహన్, జయసుధ | |
1989 | జీవన గంగ | రాజేంద్ర ప్రసాద్, రజని | |
1989 | పైలాపచ్చీసు | రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ | |
1990 | మనసు - మమత | నరేష్, సితార | |
1991 | అశ్వని | అశ్వని నాచప్ప, భానుచందర్ | |
1991 | మంచిరోజు | వినోద్ కుమార్, శోభన | |
1992 | అదృష్టం | నరేష్,యమున | |
1992 | హలో డార్లింగ్ | నరేష్,శోభన | |
1993 | ఆదర్శం | జగపతిబాబు,అశ్వని నాచప్ప | |
1993 | ఆరంభం | శశికుమార్,అశ్వని నాచప్ప | |
1993 | ఇన్‌స్పెక్టర్ అశ్వని | ఆనంద్ బాబు,అశ్వని నాచప్ప | |
1994 | అందరూ అందరే | కృష్ణంరాజు,లక్ష్మి | |
1994 | ఓ తండ్రి – ఓ కొడుకు | వినోద్ కుమార్,నదియా | |
1995 | ఆంటీ | జయసుధ,నాజర్ | |
1995 | మిస్ 420 | అశ్వని నాచప్ప,రాజ్ కుమార్ | |
1995 | అక్కా! బాగున్నావా? | విక్రమ్,జయసుధ | |
1996 | పెళ్ళాల రాజ్యం | కృష్ణ,రమ్యకృష్ణ | |
1997 | ఏవండీ మనమ్మాయే | వాణిశ్రీ,రమ్యకృష్ణ | |
2000 | మాధురి | అబ్బాస్,అంజన | |
2002 | బ్రహ్మచారి | కమల్ హాసన్,సిమ్రాన్ | పమ్మల్ కె.సంబంధం తమిళ సినిమా డబ్బింగ్ |