యశోధర దాసప్ప | |
---|---|
జననం | [1] | 1905 మే 28
మరణం | 1980 |
విద్యాసంస్థ | క్వీన్ మేరీ కళాశాల, మద్రాస్ |
వృత్తి | గాంధేయవాది సంఘ సంస్కర్త కర్ణాటక రాష్ట్ర మాజీమంత్రి. |
జీవిత భాగస్వామి | హెచ్.సి. దాసప్ప |
పిల్లలు | రాందాస్, తులసీదాస్, ప్రభామోహన్ చంపా |
పురస్కారాలు | పద్మభూషణ్ |
యశోధర దాసప్ప, భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, గాంధేయవాది, సంఘ సంస్కర్త, కర్ణాటక రాష్ట్ర మాజీమంత్రి.[2] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉంటూ ఎస్ఆర్ కాంతి (1962),[3] ఎస్. నిజలింగప్ప (1969) మంత్రివర్గంలో కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పనిచేసింది.[4]
యశోధర దాసప్ప 1905, మే 28న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని వొక్కలిగ కుటుంబంలో జన్మించింది.[5] తండ్రి కెహెచ్ రామయ్య సామాజిక కార్యకర్త. సంపన్న కుటుంబంలో జన్మించిన యశోధర, సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది.[6] లండన్ మిషన్ స్కూల్ లో, మద్రాస్‌లోని క్వీన్ మేరీస్ కాలేజీలో తన చదువును పూర్తిచేసింది.
జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన హెచ్‌సి దాసప్పతో యశోధర వివాహం జరిగింది.[7] వారి చిన్న కుమారుడు తులసీదాస్ దాసప్ప, చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు.[2]
భారత స్వాతంత్ర్య పోరాటం, 1930ల అటవీ సత్యాగ్రహ ఉద్యమం వంటి అనేక సామాజిక ఉద్యమాలలో చురుకుగా పనిచేసింది. ఆ ఉద్యమాల వల్ల 1200 మందికి పైగా జైలుకు పంపబడ్డారు.[8] 1938లో విదురాశ్వత ఎపిసోడ్ 35 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు.[9] ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు, యశోధర జైలు శిక్షను కూడా అనుభవించింది.[10]
భూగర్భ సత్యాగ్రహం (స్వాతంత్ర్య పోరాటం) కార్యకలాపాలకు యశోధర ఇల్లు ఒక సమావేశ స్థానంగా ఉండేది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై క్రూరత్వానికి పేరుగాంచిన హామిల్టన్ పేరును ఒక భవనానికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రసంగాలు వ్రాసింది.[6]
నిజలింగప్ప మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, కర్ణాటక రాష్ట్రంలో నిషేధాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఆమె ఆ పదవికి రాజీనామా చేసి వార్తల్లోకెక్కింది.[3] సమాజానికి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం 1972లో భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ను ప్రదానం చేసింది.[11][12]
యశోధర 1980లో మరణించింది.[4]