యశస్విని సింగ్ దేస్వాల్ భారతీయ స్పోర్ట్ షూటర్. రియో డి జనీరోలో జరిగిన 2019 ISSF ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. అలా 2021 సమ్మర్ ఒలంపిక్స్‌లో భారత కోటాలో చోటు దక్కించుకున్నారు.
న్యూదిల్లీలో 1997 మార్చి 30న యశస్వినీ జన్మించారు. 15 ఏళ్ల వయసులో షూటింగ్‌ను ఎంచుకున్న ఆమె తిరిగి వెనక్కి చూసుకోవాల్సినవసరం రాలేదు. ఏ ఏటికాయేడు కొత్త రికార్డులు సృష్టిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ప్రదర్శన చేస్తూ వచ్చారు. 2010లో న్యూ దిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌ను చూసేందుకు తన తండ్రితో కలిసి వెళ్లినప్పుడు ఆమెకు షూటింగ్ పట్ల ఆసక్తి మొదలయ్యింది[1].
మౌళిక సదుపాయాల కొరత కారణంగా షూటింగ్‌ను క్రీడగా ఎంచుకున్న వాళ్లకు అనేక సమస్యలు ఉంటాయన్న విషయం దేశ్వాల్‌కు చాలా త్వరగానే అర్థమయ్యింది. అయితే వృత్తి పరంగా పోలీస్ అధికారి, అలాగే క్రీడల పట్ల ఆసక్తి చూపించే ఆమె తండ్రి దేశ్వాల్‌కు అన్ని విధాల మనస్ఫూర్తిగా మద్దతుగా నిలిచారు. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తన కెరియర్‌ను ప్రారంభించగానే ఆమె ప్రాక్టీస్ కోసం పంజాబ్‌లోని పంచకులలో తమ ఇంట్లోనే సొంతంగా ఓ షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేశారు ఆమె తల్లిదండ్రులు. ఆమెకు ప్రముఖ అంతర్జాతీయ షూటర్, రిటైర్డ్ ఇన్సెక్టర్ జనరల్ టి.ఎస్.థిల్లన్ కోచ్‌గా వ్యవహరించారు. దేశ్వాల్ ఆమె తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ 2014లో పూణెలో జరిగిన 58వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 3 వేర్వేరు విభాగాల్లో 3 బంగారు పతకాలు సాధించారు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా తన తన విజయ పరంపర కొనసాగించారు దేశ్వాల్. 2017 జూన్‌లో జర్మనీలో జూల్‌లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ రికార్డును సమం చేశారు[2].
దేశ్వాల్ కేవలం తాను ఎంచుకున్న క్రీడారంగంలోనే కాదు, చదువు విషయంలోనూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఓ వైపు వివిధ జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రాక్టీస్ చెయ్యడం, మరోవైపు చదువును ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాల్సి రావడం ఆమెకు చాలా కష్టమయ్యేది. మొదట్లో కేవలం ఆమెకు మాత్రమే కాదు ఆమెను వివిధ పోటీల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాలు తీసుకెళ్లాల్సిన ఆమె తల్లిదండ్రులకు కూడా కష్టంగా ఉండేది[1].
2012 నుంచీ దేశ్వాల్ షూటింగ్‌ను ప్రాక్టీస్ చెయ్యడం ప్రారంభించారు. 2014లో చైనాలోని నాన్జింగ్‌లో జరిగిన సమ్మర్ యూత్ ఒలంపిక్స్‌కు ఆమె అర్హత సాధించారు. ఆ పోటీల్లో ఆమె ఆరో స్థానంలో నిలిచారు.
జర్మనీలోని జూల్ నగరంలో 2016లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో ఆమె రజతం సాధించారు. 2016లో అజర్బైజాన్‌లోని దక్షిణాసియా గేమ్ సాట్ క్వాబ్లాలో టీం విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించారు[2].
2017లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ప్రపంచ రికార్డును సమం చేసి స్వర్ణం సాధించారు. 2019లో రియో డీ జనేరో జరిగిన ఐస్ఎస్ఎఫ్ పోటీల్లో స్వర్ణం సాధించి 2021లో జరగనున్న ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు[1] [2].
2020లో జరిగిన ఐదవ ఇంటర్నేషనల్ ఆన్ లైన్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో దేశ్వాల్ స్వర్ణం సాధించారు. కానీ ఆ ఈవెంట్‌ను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ గుర్తింపు లేని ఆ ఈవెంట్లో పాల్గొనడాన్ని నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ మందలించింది. అయితే కోవిడ్ సమయంలో కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే ఆ మ్యాచ్ ఆడారని, భవిష్యత్తులో ఎన్ఆర్ఎఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటారని ఆమె కోచ్ టీఎస్ థిల్లాన్ అన్నారు.[3]