రంజన్‌గావ్ మహాగణపతి మందిరం అనేది మహారాష్ట్ర, పూణే నగరానికి సమీపంలోని రంజన్‌గావ్ గ్రామంలో ఉన్న దేవాలయం. ఎనిమిది ఇతిహాసాలను జరుపుకునే అష్టవినాయకుల్లో రంజన్‌గావ్ గణపతి చివరి దేవాలయం.[1] రంజన్‌గావ్‌లోని మహాగణపతి విగ్రహం, వినాయకుడి అత్యంత శక్తివంతమైన ప్రతిరూపం. ఈ రూపాన్ని ఆవాహన చేసిన తరువాత, శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు, కాబట్టి త్రిపురారివాడే మహాగణపతి అని కూడా పిలుస్తారు.[2]
ఈ దేవాలయం 9-10వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. పేష్వాల కాలంలో దీని ప్రధాన దేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తోంది. సూర్యకిరణాలు నేరుగా వినాయకుడి విగ్రహంపై పడేలా ఈ దేవాలయం నిర్మించబడింది. యుద్ధానికి వెళ్ళేముందు శ్రీమంత్ మాధవరావ్ పేష్వా ఇక్కడ మహాగణపతి దర్శనం చేసుకునేవాడు. తూర్పుముఖంగా ఉన్న దేవాలయానికి భారీ, అందమైన ప్రవేశ ద్వారం ఉంది. మాధవరావు పేష్వా వినాయక విగ్రహాన్ని ఉంచడానికి దేవాలయంలోని నేలమాళిగలో ఒక గదిని నిర్మించాడు. తర్వాత ఇండోర్‌కు చెందిన సర్దార్ కిబే దీనిని పునరుద్ధరించాడు.[3]
ఇక్కడి గణపతి విగ్రహాన్ని రంజన్‌గావ్‌లో ఉన్న స్వర్ణకార కుటుంబమైన "ఖోల్లం" కుటుంబం ప్రతిష్ఠించింది. ఈ వినాయక విగ్రహానికి 'మహోత్కట్' అనికూడా పేరు పెట్టారు. ఈ విగ్రహానికి 10 తొండంలు, 20 చేతులు ఉన్నాయని చెబుతారు.