హిందూమతం రష్యాలో ప్రధానంగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) నుండి వచ్చిన పండితులు, భారతదేశం నుండి వచ్చిన స్వాములు, భారతీయ వలసదారుల ద్వారా వ్యాప్తి చెందింది. రష్యాలో ఇస్కాన్‌కు సాపేక్షికంగా బలమైన అనుచరులు ఉన్నప్పటికీ, ఇతర సంస్థలకు పెద్దగా అనుయాయులు లేరు. రష్యాలో చురుకైన తంత్ర సంఘం పనిచేస్తోంది. 2012 అధికారిక జనాభా లెక్కల ప్రకారం, రష్యాలో 1,40,000 మంది హిందువులు ఉన్నారు, ఇది రష్యా జనాభాలో 0.1%. [1]
రష్యాలో హిందూమత చరిత్ర కనీసం 16వ శతాబ్దం నాటిది. 1556లో ఆస్ట్రాఖాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, చిన్న భారతీయ సమాజం మాస్కో దేశంలో భాగమైంది. 18వ శతాబ్దం ప్రారంభంలో, మొదటి రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్, ఆస్ట్రాఖాన్ హిందువులను కలుసుకున్నాడు. వారి అభ్యర్థన మేరకు హిందువుల విశ్వాసాలను పరిరక్షించడానికి ఒక చట్టాన్ని జారీ చేయాలని రష్యన్ సెనేట్‌ను కోరాడు. ఒక విదేశీ మతాన్ని రక్షించడానికి రష్యాలో చేసిన మొదటి చట్టం ఇదే. [2]
1971లో AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) వ్యవస్థాపకుడు ఇస్కాన్‌ను రష్యాకు పరిచయం చేశాశు. 1988లో, ఇస్కాన్ మొదటిసారిగా మతంగా నమోదు అయింది. తరువాత, 1998లో ఇది తిరిగి నమోదైంది. అదే సంవత్సరంలో, రష్యాలో 120 కృష్ణ సంఘాలు ఉన్నాయి. [3]
2007లో, వోల్గా ప్రాంతంలో తవ్వకాల్లో పురాతన విష్ణు విగ్రహం బైటపడింది, దీనివలన రష్యాలో హిందూమతం పట్ల ఆసక్తిని పెరిగింది. [4]
2005 డిసెంబరు నాటికి, ఫెడరల్ రిజిస్ట్రేషన్ సర్వీస్ 79 హిందూ సమూహాలను కృష్ణమతం గా నమోదు చేసింది. [5] అవి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‌నెస్, ఇస్కాన్ రివైవల్ మూవ్‌మెంట్, సైన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫౌండేషన్, శ్రీ చైతన్య సరస్వత్ మఠ్, శ్రీ చైతన్య గౌడియా మట్, శ్రీ క్ర్ష్ణ చైతన్య మిషన్, శ్రీ గోపీనాథ గౌడియా మఠ్, అంతర్జాతీయ స్వచ్ఛ భక్తి యోగ సంఘం.
రష్యాలో శైవమత అనుయాయులు నాథ్‌లు, లింగాయత్‌లు (వీరశైవ), తంత్ర సంఘ. [6]
రష్యాలో ఉన్న హిందూ సంస్థలు బ్రహ్మ కుమారీలు, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, శ్రీ అరబిందో ఆశ్రమం, అంతర్జాతీయ శివానంద యోగా వేదాంత కేంద్రాలు, ఆనంద మార్గ, ఆనంద సంఘం, స్వీయ-సాక్షాత్కార ఫెలోషిప్, శ్రీ రమణ ఆశ్రమం, సహజ యోగ, శ్రీ చిన్మయి సెంటర్, సనాతన్ సంస్థ, సత్యసాయి బాబా ఉద్యమం, సైన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫౌండేషన్, శ్రీ ప్రకాష్ ధామ్, మహర్షి మహేష్ యోగి, హైదఖాన్ బాబాజీతో అనుబంధించబడిన సంస్థలు. బ్రహ్మ కుమారీలు 20 కేంద్రాలను, రామకృష్ణ మిషన్ ఒక కేంద్రాన్నీ నడుపుతున్నాయి. ఆనంద మార్గ కు బర్నౌల్ లో కేంద్రం, తంత్ర సంఘంకు మాస్కోలో ఒకటి, నీఝ్నీ నొవ్‌గొరోద్‌లో ఒకటీ ఉన్నాయి. [5] [7] [6]
స్లావిక్, రష్యన్ లేదా పీటర్‌బర్గియన్ వైదికం, నియో-వైదికం లేదా వైదికం [8] [9] అనేవి రష్యా, సైబీరియా, ఇతర స్లావిక్ దేశాలు, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ లోని సభ్యులు, సోవియట్ అనంతర దేశాలన్నిటిలోనూ సమకాలీన వేద మతాన్ని సూచించడానికి వాడే పదాలు.
స్లావిక్ వేదవాదం అనేది వేద ఆచారాలను, పురాతన వేద దేవతలను ఆరాధిస్తూ, ఆధునిక భారతీయ హిందూమతంతో బలమైన బంధాన్ని కొనసాగించే ఇతర సమూహాల నుండి వేరుగా ఉంటుంది. అయితే క్రిష్ణైట్ సమూహాలు తరచుగా తమను తాము "వైదికులు"గా గుర్తించుకుంటాయి.
పీటర్‌బర్గియన్ వేదవాదం వంటి స్లావిక్ స్థానిక విశ్వాసం లోని కొన్ని సమకాలీకరణ సమూహాలు "వేదవాదం" [10] [11] అనే పదాన్ని ఉపయోగిస్తాయి, వేద దేవతలను ఆరాధిస్తాయి, అయితే ప్రధాన స్రవంతి రోడ్‌నవరీ స్థానిక స్లావిక్ ఆచారాలు, దేవతలకు.స్లావిక్ పేర్లనూ ఉపయోగిసస్తుంది.
2012 అధికారిక జనాభా లెక్కల ప్రకారం, రష్యాలో హిందూ మతస్థులు 1,40,000 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 0.1%. ఆల్టై రిపబ్లిక్ లో 2%, సమర ఒబ్లాస్ట్ లో 0.5% , ఖకాసియా, కల్మికియా, బ్రయాన్స్క్ ఒబ్లాస్ట్, కమ్చత్కా, కుర్గన్ ఒబ్లాస్ట్, టియూమెన్ ఒబ్లాస్ట్, చేల్యబిన్స్క్ ఒబ్లాస్ట్ లలో 0.4%, స్వెర్ద్‌లోవ్స్క్ ఒబ్లాస్ట్ లో 0.3% , యమలియా, క్రాస్నోదర్ క్రై, స్టావ్రోపోల్ క్రై, రోస్టోవ్ ఒబ్లాస్ట్, సఖాలిన్ ఒబ్లాస్ట్ లలో 0.2% నుండి 0.3%, ఇతర ఫెడరల్ సబ్జెక్టులలో 0.1% నుండి 0.2% వరకు ఉన్నారు. [12]
2006లో, రష్యా రాజధాని మాస్కోలో 10,000 మంది హరే కృష్ణ భక్తులు, కనీసం 5,000 మంది భారతీయులు, శ్రీలంకలు, నేపాలీలు, మారిషయన్లు హిందూమతస్థులు ఉన్నారు. [13]
రష్యాలో ఇస్కాన్ అనుచరుల సంఖ్య వివాదాస్పదమైంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఆఫ్ రష్యాకు చెందిన సంజీత్ ఝా ప్రకారం, రష్యాలో కృష్ణ భక్తుల జనాభా 2,50,000 వరకు ఉంటుందని అంచనా. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌కు చెందిన ఫిలాటోవ్, ఈ సంఖ్య 15,000గా అంచనా వేశాడు. [14] రష్యన్ ఇస్కాన్ గురువైన భక్తి విజ్ఞాన గోస్వామి ప్రకారం, రష్యాలో 2011లో 50,000 మంది క్రియాశీల హరే కృష్ణ భక్తులు ఉన్నారు [15]