రాండోర్ గై | |
---|---|
జననం | మాడభూషి రంగదొరై 1937 నవంబరు 8 |
మరణం | 2023 ఏప్రిల్ 23 | (వయసు 85)
వృత్తి | న్యాయవాది, కాలమిస్ట్, సినిమా రచయిత |
రాండోర్ గై (1937, నవంబరు 8 - 2023, ఏప్రిల్ 23), తమిళనాడుకు చెందిన న్యాయవాది, కాలమిస్ట్, సినిమా రచయిత,[1] ఆంగ్ల భాషా వార్తాపత్రిక ది హిందూతో అనుబంధమున్న న్యాయ చరిత్రకారుడు.[2][3] ది హిందూలో ప్రచురించబడిన "బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్" అనే వీక్లీ కాలమ్కి అధికారిక సంపాదకుడిగా కూడా పనిచేశాడు. ఇతని అసలు పేరు మాడభూషి రంగదొరై,[3][4] రాండోర్ గై అనేది అతని కలం పేరు.[5]
రాండోర్ గై 1937, నవంబరు 8న జన్మించాడు.[6][7] అతను మద్రాస్ విశ్వవిద్యాలయం[8] నుండి బిఎస్సీ, బిఎల్ లో పట్టభద్రుడయ్యాడు.
న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు.[8][9] కొద్దికాలంపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ప్యాటర్సన్ అండ్ కో అనే సంస్థలో చేరి, అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా ఉండడంకోసం 1976లో రాజీనామా చేశాడు.
ప్రారంభంలో కొన్ని డాక్యుమెంటరీలు, సినిమాలకు స్క్రీన్ప్లే రాశాడు. కొన్ని ప్రకటనలకు నిర్మాతగా వ్యవహరించాడు.[9] 1999లో హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీ కోసం టేల్స్ ఆఫ్ ది కామ సూత్ర: ది పెర్ఫ్యూమ్డ్ గార్డెన్ పేరుతో ఆంగ్లంలో 100 నిమిషాల సినిమాకు స్క్రిప్ట్ రాశాడు, దీనికి జగ్ ముంధ్రా దర్శకత్వం వహించాడు.[8] ఆ తర్వాత ఇది హిందీ, తమిళం, తెలుగు భాషల్లోకి బ్రహ్మచారి పేరుతో డబ్ చేయబడింది.[4][8] తరువాత సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్తో కలిసి తన త్రిభాషా సినిమా కామ (1999)లో పనిచేశాడు. తను వ్రాసిన బెస్ట్ సెల్లింగ్ క్రైమ్ నవల ఆధారంగా ప్యారడైజ్ పీక్ అనే సింహళీస్ సినిమాను రాశాడు.[8] నటి నమిత నటించిన కామసూత్ర నైట్స్: మాయ అనే సినిమాకు రాశాడు.[10] ఇంగ్లీషులో నమిత నటించిన తొలి చిత్రం మాయ. [10]
2007 నవంబరు 12న కళలు, సంస్కృతికి అంకితమైన పత్రిక సముద్ర ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళారంగాలకు ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా జ్ఞాన సముద్రం అవార్డును ప్రదానం చేశారు.[11]
అతడు తన 85 సంవత్సరాల వయస్సులో 2023, ఏప్రిల్ 23న మరణించాడు.[12][13][14]