రాంప్రసాద్ సేన్ | |
---|---|
జననం | సా.శ. 1723 లేక 1718 |
మరణం | 1781 | (వయసు 62–63)
ఇతర పేర్లు | సాధక్ రాంప్రసాద్ |
వృత్తి | సాధువు, కవి, భక్తుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాంప్రసాదీ |
రాంప్రసాద్ సేన్ (1723 లేదా 1718 - 1775) 18వ శతాబ్దపు బెంగాల్ హిందూ శాక్త కవి, సాధువు, భక్తుడు.[1][2] రాంప్రసాదీ అని బెంగాలీలు పిలుచుకునే ఆయన భక్తి కవితలు ఇప్పటికీ బెంగాల్ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలావరకూ అవి హిందూ దేవత కాళి ఉద్దేశించి, బెంగాలీ రాసిన కవితలు.[3] రాంప్రసాద్ జీవిత కథలలో సాధారణంగా జీవితచరిత్ర వివరాలతో పాటుగా మహిమలకు సంబంధించిన కథలు కూడా ఉంటాయి.[4]
రాంప్రసాద్ బెంగాలీ బైద్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని, చిన్న వయస్సు నుంచే కవిత్వం వైపు మొగ్గు చూపించాడని చెబుతారు. తాంత్రిక పండితుడు, యోగి అయిన కృష్ణానంద అగమవాగీశ వల్ల రాంప్రసాద్ బాగా ప్రభావితుడయ్యాడు. క్రమేపీ రాంప్రసాద్ రాసిన భక్తి గీతాలు సుప్రసిద్ధి చెందాయి. కాళీమాత పట్ల ఆయన భక్తిని, కాళితో ఆయన అనుబంధాన్ని వర్ణించే అనేక కథలు అతని జీవితం గురించి ఉన్నాయి. విద్యాసుందర్, కాళీ-కీర్తన, కృష్ణ-కీర్తన, శక్తిగతి వంటి రచనలు రాంప్రసాద్ సాహిత్యంలో భాగం.
బెంగాలీ జానపద శైలికి చెందిన బౌల్ సంగీతాన్ని శాస్త్రీయ శ్రావ్యమైన సంగీతంతోనూ, కీర్తనలతోనూ కలిపి కొత్త రచనా రూపాన్ని రూపొందించిన ఘనత రాంప్రసాద్‌కి దక్కింది. ఈ కొత్త శైలికి చెందిన గీతాలు బెంగాలీ సంస్కృతిలో లోతుగా వేళ్ళూనుకుంది. జానపద సంగీతాన్ని, రాగ-ఆధారిత సంగీతాన్ని మిళితం చేస్తూ చాలామంది వాగ్గేయకారులు కృతులు రచించారు.[5]
బెంగాలీ సంగీత శైలిపై లోతైన ముద్ర వేయడంతో పాటుగా రాంప్రసాద్ పాటలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. బెంగాలీ గాయకులు రాంప్రసాద్ కీర్తనలను ఆలపిస్తున్నారు. వాటిలో ప్రఖ్యాతమైనవాటిని రాంప్రసాదీ సంగీత్ అన్న పేరుతో కలక్షన్ రూపొందించి బెంగాల్లోని శాక్త దేవాలయాలు, పీఠాల్లో ఇప్పటికీ అమ్ముతున్నారు.[3]