రాజ్ మాదిరాజు | |
---|---|
జననం | రాజశేఖర్ మాదిరాజు 1969 డిసెంబరు 5 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మైథిలీ |
పిల్లలు | ప్రార్థన (కుమార్తె) |
రాజ్ మాదిరాజు (జననం 1969 డిసెంబరు 5) భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నిర్మాత. ఆయన తెలుగు సినిమారంగానికి చెందినవాడు. 2012లో వచ్చిన ఋషి చిత్రానికి రచన, దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. 2018లో ఐతే 2.o సినిమాకు దర్శకత్వం వహించాడు.
బదిలీ కారణంగా 1984లో వారి కుటుంబం హైదరాబాద్‌కు మారింది. ఆయన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీఈసీఈ చదివాడు. మొదట్లో కంతకాలం ఆయన మార్కెటింగ్, టీచింగ్ ఉద్యోగాలు చేశాడు. అయితే, ఆయనకు సంగీతం, వినోదం పట్ల ఉన్న ఆసక్తితో ప్రసిద్ధ సంగీత బృందం అయిన హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్‌లో చేరాడు. ఆయన 1992 నుంచి 1996 మధ్య కాలంలో స్టేజ్ షోలు ఇచ్చాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు 1995లో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అవంతి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చేరాడు.[1]
సహాయ దర్శకుడు, దర్శకుడుగా రెండు దశాబ్దాలు సినిమారంగంలో పనిచేసిన తరువాత నటుడుగానూ ఆయన రాణించాడు. ఒసేయ్ రాములమ్మ, అంకుల్, ఆంధ్రా పోరి వంటి చిత్రాలలో అతిథి పాత్రలు పోషించి ఆయన నందిని రెడ్డి రూపోందించిన కళ్యాణ వైభోగమే చిత్రంలో పూర్తి స్థాయి నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో నాగశౌర్యకు తండ్రిగా నటించాడు. ఆ తరువాత, ఆయన అప్పట్లో ఒకడుండేవాడు, రాజా మీరు కేక, జవాన్ వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించాడు.[2][3]
రాజ్ మాదిరాజు 1997లో మైథిలీని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది.[1]