రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 238 మంది సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులతో కలిపి 250 మంది సభ్యులకు మించకుండా ఉండాలి.[1] రాజ్యసభ శాశ్వత సంస్థ, రద్దుకు లోబడి ఉండదు. రాజ్యసభ సభ్యులు (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా భారత పార్లమెంటు ఎగువసభ) భారతదేశం లోని అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర శాసనసభ (ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి) ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ఎన్నికైన సభ్యులచే పరోక్షంగా ఎన్నుకుంటారు.రాజ్యసభ సభ్యులు భారతదేశం లోని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను 'పార్లమెంటుసభ్యుడు' అనిపిలుస్తారు.వారు ఎన్నికైననాటి నుండి ఆరు సంవత్సరాల కాలపరిమితి వరకు పదవిని కలిగిఉంటారు.కొత్త చట్టాల రూపకల్పన, భారత పౌరులందరినీ ప్రభావితంచేసే ప్రస్తుత చట్టాలను తొలగించడం లేదా మెరుగుపరచడం వంటి విషయాలపై న్యూఢిల్లీ లోని సంసద్ భవన్ లోని రాజ్యసభ ఛాంబర్లో వారందరితో సభలు జరుగుతూ ఉంటాయి.[2] ప్రతి సంవత్సరం రాజ్యసభకు 238 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతుంటాయి. వీరిలో మూడింట ఒకవంతు మంది సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ప్రతి సభ్యుడు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.[3] భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫిషియో ఛైర్మన్. సభ తన సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్‌ను కూడా ఎన్నుకుంటుంది. అంతేకాకుండా, రాజ్యసభలో "వైస్ ఛైర్మన్ల" ప్యానెల్ కూడా ఉంది. రాజ్యసభ సభ్యుడైన అత్యంత సీనియర్ మంత్రిని ప్రధానమంత్రి సభా నాయకుడిగా నియమిస్తారు. రాజ్యసభకు మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి.