రాణి గైదిన్ల్యు | |
---|---|
జననం | నుంగ్కావో గ్రామం, టౌసెంసబ్ డివిజన్, తామేంగ్‌లాంగ్ జిల్లా, మణిపూర్ | 1915 జనవరి 26
మరణం | 1993 ఫిబ్రవరి 17 నుంగ్కావో, మణిపూర్, భారతదేశం | (వయసు 78)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నాగ ప్రజల ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ నాయకురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బ్రిటిష్ పాలనకు కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | పద్మ భూషణ్ (1982), తామ్రపత్ర ఫ్రీడమ్ ఫైటర్ అవార్డు (1972), వివేకానంద సేవా అవార్డు (1983) |
రాణి గైదిన్ల్యు (26 జనవరి 1915 - 17 ఫిబ్రవరి 1993) భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు.[1][2][3] ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు శాసనోల్లంఘన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
గైదిన్ల్యు 1915 జనవరి 26 న మణిపూర్‌లోని తామేంగ్‌లాంగ్ జిల్లాలోని టౌసెంసబ్ డివిజన్‌లో గల నుంగ్కావో (లేదా లాంగ్‌కావో) గ్రామంలో జన్మించింది. ఆమె రోంగ్‌మై నాగ తెగకు చెందినది (కబుయ్ అని కూడా పిలుస్తారు). లోథోనాంగ్ పమేయి, కచక్లెన్లియు అనే దంపతులకు జన్మించిన ఎనిమిదిగురు సంతానంలో గైదిన్ల్యు ఐదో సంతానం.[4] ఈమె కుటుంబం గ్రామంలోని పాలక కులానికి చెందినది. ఈ ప్రాంతంలో పాఠశాలలు లేకపోవడం వల్ల ఆమెకు అధికారిక విద్య అందలేదు.[5][6][7][8]
గైదిన్ల్యు 13 సంవత్సరాల వయస్సులో, కజిన్ హైపో జాడోనాంగ్ హెరాకా మత ఉద్యమంలో చేరింది. ఈ ఉద్యమం తరువాత మణిపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని కోరుతూ మరో ఉద్యమాన్ని ప్రారంభించింది. గైదిన్ల్యును 1932లో 16 సంవత్సరాల వయస్సులోనే బ్రిటిష్ పాలకులు అరెస్టు చేసి, జీవిత ఖైదు విధించారు. జవహర్‌లాల్ నెహ్రూ 1937 లో షిల్లాంగ్ జైలులో ఉన్న ఆమెను కలుసుకుని, ఆమెను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఆమెకు "రాణి" ("క్వీన్") అనే బిరుదు ప్రదానం చేశాడు.[9] అప్పటి నుండి ఆమె రాణి గైదిన్ల్యుగా ప్రజాదరణ పొందింది. హెరాక ప్రజల నమ్మకం ప్రకారం, ఆమె చెరచమ్దిన్లీ దేవత అవతారంగా పరిగణించబడుతుంది.[10][11]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె 1947లో విడుదలైంది. జైలు నుండి విడుదలయ్యాక కూడా ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తూనే ఉండేది. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలిగా గౌరవించబడింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.
ఈమె జైలు నుండి విడుదలైన తర్వాత, నాగ మత పెద్దలు క్రైస్తవుల మత ప్రచారం పట్ల ఆసక్తి చూపి నాగ మత సంప్రదాయాన్ని వదిలి క్రైస్తవ మతం స్వీకరించాలని చెప్పినపుడు ఆమె దీన్ని గట్టిగా ప్రతిఘటించి నాగ మతంలోనే కొనసాగింది.[12] క్రైస్తవ మత ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, హెరాక ఉద్యమానికి ఈమె మద్దతు ఇచ్చిన కారణంగా ఈమెను నాగా జాతి ప్రజలు వ్యతిరేకించారు. వీరిలో చాలా మంది 1960 నాటికి క్రైస్తవ మతంలోకి మారారు. ఆమె భారత ప్రభుత్వానికి మద్దతు పలకడంతో నాగ జాతీయవాద సమూహాలు కూడా ఆమెను గుర్తించలేదు. 1970లో హిందూ జాతీయవాద సంస్థ సంఘ్ పరివార్ హెరాకా ఉద్యమంతో కలిసి పనిచేసినపుడు, ఆమె హిందూమతానికి ప్రమోటర్ అనే భావన క్రైస్తవ నాగాలలో బలపడింది.[13]
1991 లో, గైదిన్ల్యు తన జన్మస్థలం లాంగ్‌కావోకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె 78 సంవత్సరాల వయసులో 1993 ఫిబ్రవరి 17 న మరణించింది.[14]
గైదిన్ల్యు కొహిమాలో ఉన్న సమయంలో ఈ అవార్డులు లభించాయి.
రాణి గైదిన్లియుకు మరణానంతరం బిర్సా ముండా అవార్డు లభించింది. భారత ప్రభుత్వం 1996లో ఆమె గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2015లో ఆమె గౌరవార్థం భారత ప్రభుత్వం స్మారక నాణేన్ని విడుదల చేసింది.
2015లో కేంద్ర ప్రభుత్వం, T. R. జెలియాంగ్ రాష్ట్ర ప్రభుత్వం గైదిన్ల్యు స్మారక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించినప్పుడు, నాగాలాండ్ రాష్ట్రంలోని అనేక పౌర సమాజ సంస్థలు దీనిని వ్యతిరేకించాయి.[15]